5 Working Days Week For Bank Employees: బ్యాంకు ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు అతి దగ్గరలో ఉంది. బ్యాంక్‌ సిబ్బంది జీతం అతి త్వరలో పెరగొచ్చు. సుదీర్ఘ కాల డిమాండ్‌ అయిన 'వారానికి 5 రోజుల పని' కూడా నెరవేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై అన్ని బ్యాంక్‌ యునియన్లు ఆర్థిక మంత్రితో చర్చించి & ఆమోదం పొందిన తర్వాత, ఉద్యోగులందరికీ త్వరలో శుభవార్త అందుతుంది. 


ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (Indian Banks Association), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్స్ యూనియన్‌ (United Forum of Banks Union) కలిసి ఈ ప్రతిపాదన సిద్ధం చేశాయి. బ్యాంక్‌ల్లో పని చేస్తున్న సిబ్బంది జీతాలు పెంచాలని, పని దినాలను వారానికి 6 రోజుల నుంచి 5 రోజులకు తగ్గించాలని ప్రతిపాదించాయి. దీనిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు (Finance Ministry) పంపాయి. బ్యాంక్‌ యూనియన్ల ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓకే చెబితే, దేశంలోని బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ వారానికి 5 పని దినాలు వర్తిస్తాయి. 


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (RBI), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో ‍(LIC) ఇప్పటికే వారానికి 5 పని రోజులు అమలవుతున్నాయని ఆ ప్రతిపాదనలో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్‌ యూనియన్స్ వెల్లడించింది. కాబట్టి, బ్యాంక్‌లకు కూడా అదే ఫెసిలిటీ అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.


5 పని దినాలు వస్తే మారనున్న బ్యాంక్‌ పని గంటలు
వారంలో ఐదు రోజులు మాత్రమే పని చేసినంత మాత్రాన, వారంవారీగా చూస్తే బ్యాంక్‌ పని గంటలు తగ్గవని ఆర్థిక మంత్రిత్వ శాఖకు బ్యాంక్‌ల యూనియన్లు హామీ ఇచ్చాయి. ప్రస్తుతం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేసే బ్యాంక్‌ బ్రాంచ్‌లు, 5 పని దినాల వ్యవస్థకు మారితే, ఈ సమయాన్ని పెంచుతాయి. అంటే, '5-డే వర్క్‌ వీక్‌' (5-Day Work Week) ప్రతిపాదనకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపితే, ఈ ఐదు పని దినాల్లో పని గంటలను యూనియన్ల ఫోరం సవరిస్తుంది.


ప్రస్తుతం, సోమవారం నుంచి శనివారం (రెండు, నాలుగు శనివారాలు మినహా) వరకు బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్‌లో ఉంటున్నాయి. ఐదు రోజుల పని ఫార్ములా అమలైతే, సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:30 వరకు బ్యాంక్‌ తలుపులు తెరిచి ఉంటాయని అంచనా. 


ఇప్పుడు బ్యాంకులన్నీ జాతీయ సెలవులు, ప్రాంతీయ సెలవులు, నెలలో అన్ని ఆదివారాలు, నెలలో రెండు & నాలుగు శనివారాల్లో పని చేయడం లేదు. నెలవారీ పద్దులు సరి చూసుకునేందుకు, కొన్ని బ్యాంకుల్లో, నెలలో చివరి రోజున హాఫ్‌ డేను సెలవుగా ప్రకటించారు.


జీతం 17% పెంచే ప్రతిపాదన
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్‌- బ్యాంక్‌ ఉద్యోగుల మధ్య 2023 డిసెంబర్‌ నెలలో ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని ఉద్యోగులందరి జీతం 17% పెంచే ప్రతిపాదనతో MoUపై సంతకాలు చేశారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే, పెరిగిన జీతాన్ని ఉద్యోగుల బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వంపై మరో రూ. 12,499 కోట్లను కేటాయించాలి.


రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బ్యాంక్ యూనియన్ల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందని, ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి జూన్‌ కల్లా ఉత్తర్వులు రావచ్చని భారీ అంచనాలు ఉన్నాయి.


మరో ఆసక్తికర కథనం: జనం షేక్‌ అయ్యే షాక్‌ ఇచ్చిన గోల్డ్‌, సిల్వర్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే