2000 Rupee Currency Note: 2000 రూపాయల నోటును చలామణీ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించిన ప్రకటించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI withdraws Rs 2,000 notes from circulation), దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో, ఈ నోట్లను దాచుకున్న జనం ఇప్పుడు కంగారు పడుతున్నారు. అయితే, సామాన్య ప్రజలెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, 2000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ సమయం ఇచ్చింది.


2000 రూపాయల నోటును చలామణీ నుంచి ఎందుకు తొలగించారు?, దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అనే విషయాలపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ (T V Somanathan) స్పష్టతనిచ్చారు.


2000 రూపాయల నోట్లను చెలామణి నుంచి ఎందుకు తొలగిస్తున్నారు?
డిజిటల్ లావాదేవీలు పెరగడంతో రూ. 2000 నోట్ల వినియోగం తగ్గిందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ చెప్పారు. 2016 నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్ల రద్దు ప్రకటన కేంద్ర ప్రభుత్వం, దేశంలో నోట్ల కొరతను పూరించడానికి అదే నెలలో కొత్తగా రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టిందని చెప్పారు. వచ్చిన కొత్తలో ఈ నోట్లను విపరీతంగా వినియోగించారని, ఇప్పుడు ఆ ధోరణి తగ్గిందని వివరించారు. ఎలక్ట్రానిక్ లావాదేవీలు బాగా విస్తరించడాన్ని దృష్టిలో ఉంచుకుని, పెద్ద విలువ గల నోట్లను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటోందని, ఇకపై ఆ నోట్లను తీసుకెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు.


ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
2000 రూపాయల నోటు చెలామణిలో లేకపోతే ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుంది అన్న ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పారు. మార్కెట్‌ నుంచి ₹2000 నోట్లను వెనక్కు తీసుకున్నా ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్థిక శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. 


రూ. 2000 నోట్లు చెల్లుబాటు అవుతాయా?
రూ. 2000 నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ రద్దు చేయలేదు, చలామణీ నుంచి ఉపసంహరించుకుంటోంది. కాబట్టి, రూ. 2000 నోటు చెల్లుబాటులోనే ఉంటుందని, లావాదేవీల కోసం ఇప్పటికీ రూ. 2000 నోట్లను తీసుకోవచ్చని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.


రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు
ప్రజల దగ్గర ఉన్న 2000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి ఆర్‌బీఐ గడువు ఇచ్చింది. ఈ నెల 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చని, లేదా ఖాతాల్లో జమ చేయవచ్చని తెలిపింది. RBIకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో సైతం రూ. 2000 నోట్లను మార్చుకోవచ్చు. అయితే, ఒక వ్యక్తి ఒక విడతలో గరిష్ఠంగా రూ. 20 వేల విలువైన నోట్లను మాత్రమే మార్పిడి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. లావాదేవీల రూ. 2000 నోట్లను తీసుకుంటే, సెప్టెంబర్‌ 30లో వాటిని మార్చుకోవడమో, ఖాతాల్లో జమ చేయడమో చేయాలని స్పష్టం చేసింది. పెద్ద నోట్ల మార్పిడి పూర్తి ఉచితం, బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించవు.


రూ. 2000 నోట్లను మార్చుకునేందుకు వచ్చే వాళ్లతో బ్యాంకుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి, వృద్ధులు (సీనియర్ సిటిజన్లు), దివ్యాంగులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది.


ఇది కూడా చదవండి: 8 నవంబర్ 2016 Vs 19 మే 2023 – రెండు నిర్ణయాల పూర్తి కథనం