Yamaha Motor India: 2022 జనవరి 1వ తేదీ నుంచి 2024 జనవరి 4వ తేదీ మధ్య తయారు చేసిన రే జెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్, ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్లకు సంబంధించిన సుమారు 3,00,000 యూనిట్లను తక్షణమే రీకాల్ చేస్తున్నట్లు యమహా మోటార్ ఇండియా ప్రకటించింది. రెండు 125 సీసీ స్కూటర్లలోని కొన్ని యూనిట్లలో బ్రేక్ లివర్ ఫంక్షన్‌ సమస్యను పరిష్కరించడం కోసమే వీటిని రీకాల్ చేశామని కంపెనీ తెలిపింది. ఈ సమస్యతో బాధపడుతున్న వినియోగదారులకు రీప్లేస్‌మెంట్ పార్ట్స్‌ను ఉచితంగా అందించనున్నారు.


కస్టమర్లు ఏం చేయాలి?
రీకాల్ కోసం అర్హత ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ యమహా స్కూటర్‌ల యజమానులు ఇండియా యమహా మోటార్ వెబ్‌సైట్‌లోని సర్వీస్ విభాగానికి లాగిన్ చేసి, ఆపై 'ఎస్సీ 125 వాలంటరీ రీకాల్'కి నావిగేట్ చేసి తదుపరి దశకు వెళ్లడానికి వారి ఛాసిస్ నంబర్‌, మరిన్ని వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. కస్టమర్‌లు సహాయం కోసం వారి సమీప యమహా సేవా కేంద్రాన్ని కూడా సందర్శించవచ్చు లేదా టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు.


రెండు స్కూటర్లలో దాదాపు మూడు లక్షల యూనిట్లను రీకాల్ చేశారు. ఇది ఇప్పటి వరకు ఇండియా యమహా మోటార్‌కి అతిపెద్ద రీకాల్. 2012 జూలైలో సియామ్ స్వచ్ఛంద రీకాల్ కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి కంపెనీ మొత్తం 63,977 యూనిట్లను రీకాల్ చేసింది. కంపెనీ ఇంతకుముందు 2013 జూలైలో 56,082 సిగ్నస్ రే స్కూటర్లను, 2014 మార్చిలో 138 R1 మోటార్‌సైకిళ్లను, 2019 డిసెంబర్‌లో 7,757 ఎఫ్‌జెడ్ 150 బైక్‌లను రీకాల్ చేసింది. భారతదేశంలో యమహా మొత్తం రీకాల్ ఇప్పుడు 3,63,977 యూనిట్లకు పెరిగింది.


రెండో అతిపెద్ద రీకాల్
2021 మేలో హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియాలో విక్రయించిన 6,15,666 యూనిట్లను రీకాల్ చేసింది.  ఇందులో యాక్టివా 5జీ/6జీ/125, సీబీ షైన్, సీబీ 300R, హెచ్'నెస్ సీబీ350, ఎక్స్-బ్లేడ్, హార్నెట్ ఉన్నాయి. దీని తర్వాత ఇది రెండో అతిపెద్ద రీకాల్.


మరోవైపు మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేయడానికి టాటా మోటార్స్ రాబోయే సంవత్సరాలలో వివిధ విభాగాలలో అనేక కొత్త మోడళ్లను విడుదల చేయనుంది. ఈ ప్రణాళికలో ఫేస్‌లిఫ్ట్, స్పెషల్ ఎడిషన్, కొత్త ఎస్‌యూవీ, ఈవీలు కూడా ఉండటం విశేషం. గత సంవత్సరం కంపెనీ నెక్సాన్, నెక్సాన్ ఈవీ, హారియర్, సఫారీ ఎస్‌యూవీలను మార్కెట్లో విడుదల చేసింది. ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ 2024లోనే విడుదల కానుందని తెలుస్తోంది. ఇది కాకుండా 2025లో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను కూడా కంపెనీ మార్కెట్లోకి తీసుకురానుంది.


టాటా అల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ కారు 2019లో మొదటిసారిగా లాంచ్ అయింది. ఇప్పుడు ఈ కారుకు మిడ్ లైఫ్ అప్‌డేట్‌ను అందించనున్నారు. కొత్త మోడల్‌లో చిన్నపాటి బ్యూటీ ఛేంజెస్, అనేక కొత్త ఫీచర్లు లభిస్తాయని అంచనా. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన పెద్ద 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు కూడా ఇందులో ఉన్నాయి.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!