Price Reduction Of Electric Vehicles: భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు రోడ్డుపై ఒకట్రెండు ఎలక్ట్రిక్ కార్లు కనిపించేవి కానీ ఇప్పుడు మాత్రం పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి. అందుకే దీనికి అనుగుణంగా ప్రభుత్వాలు కూడా తమ పాలసీలు మార్చుకుంటున్నాయి. తెలంగాణలో అయితే ఏకంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పూర్తిగా రద్దు చేసింది. ఇప్పుడు కేంద్రం కూడా లోకల్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంది. 

Continues below advertisement


దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు మరింత పెంచేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 25 మార్చి 2025 మంగళవారం కీలక ప్రకటన చేశారు. దీనిలో భారత ప్రభుత్వం ఈవీ బ్యాటరీల ఉత్పత్తిలో ఉపయోగించే 35 క్యాపిటల్ గుడ్స్‌పై ఎటువంటి దిగుమతి సుంకం విధించడం లేదని తెలిపారు.


ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకం లేదు
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ మొన్నే పార్లమెంట్‌లో 2025 ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టారు. ఈవీ బ్యాటరీలపై దిగుమతి సుంకాన్ని తగ్గించే నిర్ణయంపై ఆర్థికమంత్రి స్పందించారు. 'దేశంలో దేశీయ ఈవీ ఉత్పత్తిని పెంచాలనుకుంటున్నాం. ముడిపదార్థాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడం ద్వారా ఎగుమతి పోటీని కూడా పెంచాలనుకుంటున్నాం' అని అన్నారు. భారతదేశం ఇతర దేశాల నుంచి 35 వస్తువులను కొనుగోలు చేస్తుంది. వీటిని ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారు.


అమెరికా విధించే రియాక్షన్ పన్నుపై కూడా కేంద్రం స్పందించింది. దీన్ని తగ్గించే ఆలోచన చేస్తున్నట్టు పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2, 2025 నుంచి ప్రపంచంలోని అనేక దేశాలపై దిగుమతి సుంకాలు విధించే ప్రకటన చేశారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం..."భారత ప్రభుత్వం అమెరికాతో జరిగే వాణిజ్య ఒప్పందం, మొదటి దశలో సుంకాలను తగ్గించడం గురించి చర్చిస్తుంది. భారత ప్రభుత్వం అమెరికా నుంచి దిగుమతి అయ్యే 1.9 లక్షల కోట్ల రూపాయలు విలువైన వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంపై ఆలోచిస్తుంది."


ఎలక్ట్రిక్ కార్లు చౌకగా
గత వారం జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈవీ బ్యాటరీలు, మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ఉపయోగించే బ్యాటరీలపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఈవీ బ్యాటరీలపై దిగుమతి సుంకం తొలగించడం వల్ల ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గే అవకాశం ఉంది.  


బడ్జెట్‌లో కూడా ఎలక్ట్రిక్ కార్లపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఇస్తున్న సబ్సిడీకి అదనంగా మరిన్ని వెసులుబాటులు కల్పిస్తామన్నారు. లిథియం బ్యాటరీలు, సంబంధిత రంగాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఇస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. లోకల్ మార్కెట్‌ను ప్రోత్సహించేలా చర్యలు ఉంటాయని చెప్పుకొచ్చారు. లిథియం బ్యాటరీల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తామన్నారు. అన్నట్టుగానే ఇప్పుడు కీలక నిర్ణయం ప్రకటించారు.


కోబాల్ట్, లిథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్, సీసం, జింక్ సహా  12 ఇతర పదార్థాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని భారత ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. ఈ పదార్థాలన్నీ బ్యాటరీలు, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధన పరికరాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ పదార్థాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం (BCD) తొలగింపు ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు క్లీన్ ఎనర్జీ ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహిస్తుంది.