రోజురోజుకూ రోడ్లపై పెరుగుతున్న కాలుష్యం, పెట్రోల్, డీజిల్ ధరలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) ప్రోత్సహిస్తోంది. పన్ను మినహాయింపులు, పలు రకాల ఇన్సెంటివ్‌లు ఇస్తున్నా వినియోగదారులు షోరూమ్‌కు వెళ్లి ఈవీల ధరలు చూసి షాక్ అవుతున్నారు. సాధారణ పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బైక్‌ల ధరలు ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ సబ్సిడీల తగ్గింపు, బ్యాటరీల ఉత్పత్తి వ్యయం, మోడ్రన్ టెక్నాలజీ వ్యయాలే కారణమని ఆటో నిపుణులు చెబుతున్నారు.
ఫేమ్ సబ్సిడీ తగ్గిస్తున్న ప్రభుత్వం
ఎలక్ట్రిక్ వాహనాల ధరలు అధికంగా ఉండటానికి మొదటి కారణం ప్రభుత్వం మొదట్లో ఇచ్చే 'ఫేమ్' (FAME) పథకం సబ్సిడీలను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. సబ్సిడీలు తగ్గడంతో వాహన తయారీ కంపెనీలు ఆ భారాన్ని నేరుగా వినియోగదారులపైనే వేస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం ఈవీలలో ప్రమాదాలను అరికట్టడానికి బ్యాటరీ భద్రత, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను అత్యంత కఠినతరం చేసింది. ఈ కొత్త సేఫ్టీ నిబంధనలను పాటించడానికి బ్యాటరీ తయారీ వ్యయం మరింత పెరిగింది.
భారంగా మారుతున్న ఈవీ బ్యాటరీల ధర
రెండవ విషయం అత్యంత ముఖ్యమైనది బ్యాటరీల ధర. ఎలక్ట్రిక్ వాహనం మొత్తం ధరలో దాదాపు 40 శాతం వాటా ఒక్క బ్యాటరీదే ఉంటుందనితెలిసిందే. మన దేశంలో వాహనాల అసెంబ్లింగ్ జరుగుతున్నప్పటికీ, బ్యాటరీ తయారీకి కావలసిన లిథియం- అయాన్ సెల్స్, లిథియం, కోబాల్ట్ వంటి ముడి సరుకులను భారత్ ఇప్పటికీ చైనా, ఇతర దేశాలపై ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇవి రేట్లు పెరగడం, దిగుమతి సుంకాల ప్రభావంతో బ్యాటరీల ధరలు తగ్గడం లేదు. భారత్‌లోనే పెద్ద ఎత్తున ఈ సెల్స్ ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు ఇవి సామాన్యుడికి అందుబాటు బడ్జెట్‌లోకి రావడం కష్టమ అని చెప్పవచ్చు.
Also Read: 2026 Maruti Brezza మైలేజ్ నంబర్లు ఇవిగో - పెట్రోల్, టర్బో, CNG వేరియంట్ల పూర్తి వివరాలు
వీటికి తోడు ఎలక్ట్రిక్ వాహనాలలో వినియోగించే మోడ్రన్ సాఫ్ట్‌వేర్, సెన్సార్లు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D) ఖర్చులు కూడా వాహనం ధరపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. కేవలం వాహనం కొనడమే కాకుండా, ఇంట్లో ఫాస్ట్ ఛార్జర్ ఏర్పాటు చేసుకోవడానికి వీలు లేకపోవడం, 3-ఫేజ్ కరెంట్ కనెక్షన్ తీసుకోవడం, అధిక ఇన్సూరెన్స్ ప్రీమియం వంటి అదనపు లేదా దాగి ఉన్న ఖర్చులు కూడా ఈవీ కొనాలనుకున్న కస్టమర్లపై అదనపు భారంగా మారుతున్నాయి. ఇవన్నీ కలిపి ఎలక్ట్రిక్ వాహనాలను సాధారణ పెట్రోల్, డీజిల్ కార్ల కంటే చాలా ఖరీదైనవిగా మారుస్తున్నాయి.
