Maruti Baleno Bharat NCAP Safety Rating: మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న & ఎక్కువ మంది ఇష్టపడుతున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ల్లో మారుతి బాలెనో ఒకటి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.67 లక్షల యూనిట్ల మారుతి బాలెనో కార్లు అమ్ముడయ్యాయి. ఇటీవల, 'భారత్ ఎన్‌క్యాప్‌' (Bharat NCAP) కింద క్రాష్ టెస్ట్‌లో మారుతి బాలెనోను పరీక్షించినప్పుడు ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఒకే కారుకు రెండు వేర్వేరు భద్రత రేటింగ్స్‌ లభించాయి - ఒకటి 4-స్టార్, మరొకటి 5-స్టార్.

ఒకే కారుకు రెండు రేటింగ్స్‌ ఎందుకు? వేర్వేరు వేరియంట్లను పరీక్షించినందున మారుతి బాలెనోకు భారత్ NCAPలో రెండు వేర్వేరు సేఫ్టీ రేటింగ్స్‌ లభించాయి. మారుతి బాలెనో సిగ్మా & డెల్టా వంటి బేస్ వేరియంట్స్‌లో కేవలం రెండు ఎయిర్‌ బ్యాగ్‌లు మాత్రమే ఉన్నాయి. ఈ కారణంగా వాటికి 4-స్టార్ రేటింగ్ లభించింది. మారుతి బాలెనో జీటా & ఆల్ఫా వంటి టాప్ వేరియంట్స్‌లో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు (డ్యూయల్ ఫ్రంట్, సైడ్ & కర్టెన్) అందించారు. ఈ కారణంగా వాటికి 5-స్టార్ రేటింగ్ లభించింది.

NCAP పరీక్షకు మూడు ప్రధాన ప్రమాణాలుభారత్ NCAP క్రాష్ టెస్టింగ్ మూడు ప్రధాన పారామితులపై (Parameters) ఆధారపడి ఉంటుంది - ఒకటి.. AOP (వయోజన ప్రయాణీకుల రక్షణ), రెండోది.. COP (పిల్లల రక్షణ) & మూడోది.. ESC, సీట్ బెల్ట్ రిమైండర్ & స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి భద్రతా సహాయ సాంకేతికతలు.

పరీక్షలో ఏ ఇంపాక్ట్స్‌ను చేర్చారు?ఈ పరీక్షలో మూడు రకాల ఇంపాక్ట్స్‌ ఉన్నాయి - గంటకు 64 కి.మీ. వేగం వద్ద ఫ్రంటల్ ఆఫ్‌సెట్ క్రాష్, గంటకు 50 కి.మీ. వేగం వద్ద సైడ్ ఇంపాక్ట్ & గంటకు 29 కి.మీ వేగం వద్ద సైడ్ పోల్ ఇంపాక్ట్. మారుతి బాలెనో టాప్‌ వేరియంట్లయిన జీటా & ఆల్ఫాలో సైడ్ & కర్టెన్ ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉండటం వలన సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో నష్టాన్ని సమర్థవంతంగా అడ్డుకుని బాగా పని చేశాయి.

ఈ రేటింగ్స్‌ను ఎలా అర్ధం చేసుకోవాలి?ఈ రేటింగ్స్‌ అర్థం... మీరు తక్కువ ధరను చూసి బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే, మీకు తక్కువ ఎయిర్‌ బ్యాగులు & తక్కువ భద్రత స్థాయి లభిస్తుంది. రేటు కాస్త ఎక్కువైనా జీటా లేదా ఆల్ఫా వంటి టాప్ వేరియంట్‌ కొనుగోలు చేస్తే, ఆరు ఎయిర్‌ బ్యాగులు & అధిక భద్రత స్థాయి లభిస్తుంది.

మారుతి బాలెనో సేఫ్టీ ఫీచర్లుESC, పాదచారుల భద్రతా వ్యవస్థ (Pedestrian safety system), సీట్ బెల్ట్ రిమైండర్, ABS+EBD & స్పీడ్ అలర్ట్ వంటి భద్రత లక్షణాలు అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా ఉంటాయి, ఇవి బేస్ మోడల్‌ను కూడా సురక్షితమైన కారుగా మార్చాయి. కాబట్టి, కారు కొనుగోలు చేసేటప్పుడు మోడల్‌ను మాత్రమే కాకుండా వేరియంట్ & దానిలో అందించిన సేఫ్టీ ఫీచర్లను కూడా తెలుసుకోండి.