ప్రస్తుతం హైబ్రిడ్ కార్లకు సైతం డిమాండ్ బాగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం అద్భుతమైన మైలేజీతో పాటు తక్కువ ఇంధన ఖర్చు కావడమే. హైబ్రిడ్ కారులో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటారు ఇంజిన్ లభిస్తుంది. ఇవి రెండూ కలిసి కారును నడిపేలా చేస్తాయి. దీనివల్ల మీకు పెట్రోల్ ఆదా అవుతుంది. అదే సమయంలో వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. అన్ని హైబ్రిడ్ కార్లు ఒకేలా ఉంటాయని అంతా భావిస్తారు. కానీ అందులో నిజం లేదు. మార్కెట్‌లో వివిధ రకాల హైబ్రిడ్ టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి సిస్టమ్ పనిచేసే విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది.
పారలల్ హైబ్రిడ్ (Parallel Hybrid).. అత్యధికంగా వాడే సిస్టమ్ప్రపంచంలో పారలల్ హైబ్రిడ్ సిస్టమ్ అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో మీకు పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటారు రెండూ కలిసి కారును నడిపిస్తాయి. తక్కువ వేగంతో ఉన్నప్పుడు కారు కేవలం బ్యాటరీతో నడుస్తుంది. అదే ఎక్కువ పవర్ అవసరమైనప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌గా ప్రారంభమవుతుంది. ఈ సిస్టమ్ అతిపెద్ద ప్రత్యేకత 'రీజెనరేటివ్ బ్రేకింగ్'. డ్రైవర్ బ్రేక్ వేసినప్పుడు వెలువడే శక్తి మీ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. అందుకే ఈ సిస్టమ్ సిటీ ట్రాఫిక్‌లో అద్భుతమైన మైలేజీని ఇస్తుంది.
మీకు ఏ ఎంపిక సరైనది?
| అవసరం | ఛాయిస్ |
| బడ్జెట్ తక్కువ, మైలేజీ కొంచెం పెరగాలి | మైల్డ్ హైబ్రిడ్ |
| నగరంలో ఎక్కువ తిరుగుతారు, విడిగా ఛార్జింగ్ చేయలేరు | పారలల్ హైబ్రిడ్ |
| రోజూ తక్కువ దూరం ప్రయాణం, ఇంట్లో ఛార్జింగ్ సౌకర్యం ఉంది | ప్లగ్-ఇన్ హైబ్రిడ్ |
| ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌పీరియన్స్ కావాలి కానీ రేంజ్ గురించి ఆందోళన లేదు | సిరీస్ హైబ్రిడ్ |
సిరీస్ హైబ్రిడ్ (Series Hybrid).. ఇంజిన్ పనితీరు సిరీస్ హైబ్రిడ్ సిస్టమ్ కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. ఇందులో పెట్రోల్ ఇంజిన్ నేరుగా వీల్స్ నడపదు. ఇంజిన్ కేవలం బ్యాటరీని ఛార్జ్ చేయడానికి మాత్రమే పనిచేస్తుంది. కారు ఎల్లప్పుడూ ఎలక్ట్రిక్ మోటారుతోనే నడుస్తుంది. ఈ సిస్టమ్ సాధారణ కార్లలో తక్కువగా కనిపిస్తుంది, కానీ పెద్ద ట్రక్కులు, రైలు ఇంజిన్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. చక్రాలకు పవర్ ఎలక్ట్రిక్ మోటారు నుంచి అందడం వల్ల దీని డ్రైవింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది.
ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV).. ఎలక్ట్రిక్ కారు లాంటి సౌకర్యంప్లగ్-ఇన్ హైబ్రిడ్ లేదా PHEVలు నేడు బాగా ఫేమస్ అవుతున్నాయి. ఇందులో పెద్ద బ్యాటరీ ఉంటుంది. దీనిని ఇంట్లో లేదా ఛార్జింగ్ స్టేషన్‌లో ఛార్జ్ చేసుకోవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే, తక్కువ దూర ప్రయాణాలను పెట్రోల్ వాడకుండా కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే పూర్తి చేయవచ్చు. బ్యాటరీ అయిపోయినప్పుడు ఇది సాధారణ హైబ్రిడ్ కారులా పనిచేస్తుంది. మీ ఇంట్లో ఛార్జింగ్ సౌకర్యం ఉంటే, ఈ సిస్టమ్ మీ డబ్బును ఆదా చేస్తుంది.
మైల్డ్ హైబ్రిడ్ (Mild Hybrid).. బడ్జెట్‌లో మంచి ఛాయిస్ మిగిలిన సిస్టమ్‌లతో పోలిస్తే మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ కొంచెం ఈజీ, చౌకైనది. ఇందులో ఎలక్ట్రిక్ మోటారు కారును ఒంటరిగా నడిపేంత పవర్ ఫుల్ ఉండదు. ఇది కేవలం ఇంధనాన్ని ఆదా చేయడానికి ఇంజిన్‌కు హెల్ప్ చేస్తుంది. అందుకే చాలా బడ్జెట్ కార్లలో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని అందిస్తారు. అయితే దీని మైలేజీ ఫుల్ హైబ్రిడ్ అంత ఎక్కువగా ఇవ్వదు.
మీకు ఏ హైబ్రిడ్ కారు బెస్ట్ ?మీరు ఎక్కువ దూరం ప్రయాణిస్తే పారలల్ హైబ్రిడ్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఇంట్లో ఛార్జింగ్ సౌకర్యం ఉండి, రోజూ తక్కువ దూరం ప్రయాణిస్తే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ప్రయోజనకరంగా ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో మెరుగైన మైలేజీ కావాలనుకుంటే మైల్డ్ హైబ్రిడ్ తీసుకోవడం మంచిది.
