వోల్వో కంపెనీ జనవరి 21, 2026న భారత మార్కెట్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త ఎలక్ట్రిక్ SUVని తీసుకురానుంది. వోల్వో EX60ని విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కారు అనేక విధాలుగా ప్రత్యేకమైనది. ఎందుకంటే గూగుల్ సరికొత్త, అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ జెమిని AIని కలిగి ఉన్న వోల్వో మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇది. లగ్జరీ, సేఫ్టీ, స్మార్ట్ టెక్నాలజీని ఒకేసారి కోరుకునే వారి కోసం EX60ని ప్రత్యేకంగా రూపొందించారు. వోల్వో EX60 లాంచింగ్ తర్వాత, ఈ SUV వోల్వో ఎలక్ట్రిక్ లైనప్‌లో EX40, EX90 ఉన్నాయని కంపెనీ తెలిపింది.
కారుతో మనిషిలాంటి సంభాషణ
వోల్వో EX60 అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే ఇందులో గూగుల్ జెమిని AI అని అందించారు. సాధారణంగా ఇతర వ్యక్తులతో ఎలా మాట్లాడతామో జెమిని ఏఐతోనూ మాట్లాడి వివరాలు రాబట్టవచ్చు. ఇది చెక్ చేసి కొన్ని వివరాలను మనకు అందించి మన పని తేలిక చేస్తుంది. ఇది ఒక తెలివైన AI అసిస్టెంట్, దీనితో డ్రైవర్ కారుతో సాధారణ భాషలో మాట్లాడవచ్చు. ఇందులో స్థిరమైన వాయిస్ కమాండ్‌లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.
మీరు ఏదైనా చిరునామాను కనుగొనాలని, రోడ్ ట్రిప్ ప్లాన్ చేయమని, సామాను బూట్‌లో వస్తుందా లేదా అని చెప్పమని లేదా కొత్త ఆలోచన గురించి ఆలోచించాలని అడగవచ్చు. ఈ మొత్తం వ్యవస్థ కారులో పూర్తిగా ఇంటిగ్రేట్ చేశారు. తద్వారా డ్రైవర్ ఫోకస్ మొత్తం రోడ్డుపైనే ఉంటుంది. డ్రైవింగ్ మరింత సురక్షితంగా, అత్యంత సౌకర్యవంతంగానూ ఉంటుంది.
పవర్‌ఫుల్ రేంజ్, అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్
వోల్వో ప్రకారం, EX60 ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 810 కిలోమీటర్ల వరకు WLTP రేంజ్ అందిస్తుంది. ఇది ఇప్పటివరకు అత్యంత ఎక్కువ కి.మీ రేంజ్ కలిగిన వోల్వో EVగా నిలిచింది. ఈ SUV ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది 400 కిలోవాట్ల వరకు అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది కేవలం 10 నిమిషాల్లో దాదాపు 340 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దీంతో పాటు, ఇందులో స్మార్ట్ బ్యాటరీ అల్గారిథం అందించారు. దీనిని బ్రీత్ బ్యాటరీ టెక్నాలజీస్‌తో కలిసి అభివృద్ధి చేశారు. తద్వారా బ్యాటరీ పనితీరు, బ్యాటరీ లైఫ్ టైమ్ రెండూ మెరుగ్గా ఉంటాయని పేర్కొంది.