Volkswagen Golf GTI Review: భారతీయ కార్ ప్రేమికులు సంవత్సరాలుగా ఎదురు చూసిన హాట్ హ్యాచ్‌బ్యాక్ ఏదైనా ఉందంటే, అది Volkswagen Golf GTI. ట్రాక్‌పై దీని పనితీరు గురించి ఇప్పటికే చాలా విన్నాం. కానీ మన రోజువారీ రోడ్ల మీద – ట్రాఫిక్, స్పీడ్ బ్రేకర్లు, గుంతలు, అసమానమైన రోడ్లు – ఈ కారు ఎలా మేనేజ్ చేస్తుందో అనేది చాలామందికి తెలియని విషయం. అందుకే, వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTIని నిజ జీవితానికి దగ్గరలో ఉన్న మన రోడ్ల మీద ఆటో ఎక్స్‌పర్ట్‌లు పరీక్షించి చూశారు.
పనితీరు: రేస్ ట్రాక్ స్థాయి పవర్ మన రోడ్లపైనా!గోల్ఫ్ GTIలో ఉన్న 2.0-లీటర్ TSI ఇంజిన్ 265hp శక్తిని, 370Nm టార్క్‌ను ఇస్తుంది. కేవలం 5.73 సెకన్లలో గంటకు 0-100km వేగాన్ని అందుకోవడం చిన్న విషయం కాదు. మినీ కూపర్ S కంటే వేగంగా ఉండడం దీని ప్రత్యేకత. క్వార్టర్ మైల్ టైమ్ 13.78 సెకన్లు రావడం గోల్ఫ్ GTI అసలైన దూకుడును చూపిస్తుంది.
రన్నింగ్‌లో కూడా ఇది అద్భుతమే - 20-80km/h స్ప్రింట్‌ను 3.3 సెకన్లు, 40-100km/h 3.78 సెకన్లలో పూర్తి చేస్తుంది. బ్రేకింగ్ పనితీరు కూడా విశ్వసనీయమే, 80km/h నుంచి కేవలం 26 మీటర్లలోనే నిలబడింది.
హ్యాండ్లింగ్ & కంఫర్ట్: స్పోర్ట్ DNA, కానీ మన రోడ్లకు సరిపోయే విధంగాఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్లలో సాధారణంగా కనిపించే అండర్‌స్టీర్‌ను e-diff బాగా నియంత్రిస్తుంది. కార్నర్‌లలో గ్రిప్పీ ఫీలింగ్ GTIని మరింత స్పోర్టీవ్‌గా మారుస్తుంది. స్పోర్ట్ మోడ్‌లో ఎగ్జాస్ట్ సౌండ్ (ఆడియో సిస్టమ్ ద్వారా వచ్చేదైనా) డ్రైవింగ్ థ్రిల్‌ను రెట్టింపు చేస్తుంది.
స్టీరింగ్ లైట్‌గా, షార్ప్‌గా ఉండటం వల్ల ట్రాఫిక్‌లోనూ సులభంగా నడిపించవచ్చు. హై స్పీడ్‌లో స్టీరింగ్ గ్రిప్ బాగుపడటంతో హ్యాండ్లింగ్ మీద నమ్మకం పెరుగుతుంది. బాడీ రోల్ (మలుపుల్లో కారు ఒకవైపు వంగిపోవడం) దాదాపు కనిపించనట్టే ఉంటుంది.
రోజువారీ డ్రైవ్‌లో ఎలా ఉంది?గోల్ఫ్ GTI పొడవు 4.3 మీటర్లు ఉన్నా, హ్యాచ్‌బ్యాక్ కావడంతో చిన్నదిగా అనిపించడం ఒక పెద్ద అదనపు ప్రయోజనం. క్యాబిన్ నుంచి విజిబిలిటీ చక్కగా ఉండటంతో ఇరుకు గల్లీల్లో, రద్దీ రోడ్లలోనూ సులభంగా తీసుకెళ్లవచ్చు.
అయితే ఒక చిన్న మైనస్ - క్రీప్ ఫంక్షన్ కొంచెం ఎక్కువగా పని చేస్తుంది. అలాగే యాక్సిలేటర్ షార్ప్‌గా స్పందించడం మొదట కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు. కానీ అలవాటు పడిపోయిన తర్వాత ఇది కూడా ట్రాఫిక్‌లో ఓ బూస్ట్ లాగానే అనిపిస్తుంది.
మన రోడ్లపై గ్రౌండ్ క్లియరెన్స్ సరిపోతుందా?136mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నప్పటికీ, పెద్ద స్పీడ్ బ్రేకర్ల దగ్గర జాగ్రత్తగా తీసుకుంటే స్క్రాపింగ్ సమస్య ఉండదు. పెద్ద సైజ్‌లో ఉన్న స్పీడ్ బ్రేకర్లను కూడా గోల్ఫ్ GTI బాగానే క్లియర్ చేసింది. తక్కువ స్పీడ్‌లో డ్రైవ్ కొంచెం సస్పెన్షన్ కొంచం పట్టుకుపోయినట్లు అనిపించినా, స్పీడ్ పెరిగిన తర్వాత సాఫ్ట్‌గా మారుతుంది. ముంబైలోని గతుకుల రోడ్లపై కూడా ఆశ్చర్యపరిచే రైడ్ క్వాలిటీ అందించింది.
ఇంటీరియర్ & స్పేస్: చిన్న కారు, పెద్ద యుటిలిటీక్యాబిన్‌లో స్టోరేజ్ స్పేస్ చాలా ఉంది - పెద్ద బాటిళ్లకు డోర్ పాకెట్లు, రెండు మొబైల్ ట్రేలు, కప్ హోల్డర్లు, ఆర్మ్‌రెస్ట్ లోపల స్టోరేజ్. స్పోర్టీ టార్టన్ సీట్లు, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్, మెటల్ పెడల్స్ స్పోర్ట్ ఫీలింగ్‌ను పెంచుతాయి. రియర్ సీట్ స్పేస్ కూడా కంపాక్ట్ SUV స్థాయిలోనే ఉంది. ఇద్దరికి ఇది చాలానే కంఫర్ట్ ఇస్తుంది. 380 లీటర్ల బూట్ స్పేస్ ఒక చిన్న ఫ్యామిలీకి వీకెండ్ ట్రిప్ కోసం సరిపోతుంది.
ఫీచర్లు & సేఫ్టీ12.9 అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్, మ్యాట్రిక్స్ LED హెడ్‌ల్యాంప్స్, హీట్‌డ్ సీట్లు, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే.. విదేశాల్లో లభించే DCC, పవర్ సీట్‌లు, వెంట్‌లేటెడ్ సీట్‌లు భారత్‌లో ఇవ్వలేదు.
7 ఎయిర్‌బ్యాగ్స్, లేన్ కీప్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ADAS సేఫ్టీ టెక్ కూడా ఉంది.
ధరరూ.50 లక్షలకు పైగా ఎక్స్-షోరూమ్ ధర ఉండటం వల్ల ఇది ప్రీమియం హాట్ హ్యాచ్. కానీ, డబ్బు గురించి ఆలోచించకుండా మంచి ఫీల్ కోసం కొనాల్సిన కారు ఇది. ఫన్, స్పోర్టీ, ఎమోషనల్ డ్రైవింగ్ అనుభవం కోరుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.