కాలం కొన్ని అద్భుతాలను సృష్టిస్తుంది. మహా మహులు, దిగ్గజ కంపెనీలు చేయలేని పనిని సాధారణ యువకులు చేసి చూపిస్తారు. టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదని నిరూపిస్తారు. తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ రైతు కొడుకు సైతం ఇదే పని చేశాడు. ప్రముఖ వాహనతయారీ కంపెనీలకే సాధ్యం కాని అద్భుత హైడ్రోజన్ కారును తయారు చేశాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేలా దీనిని రూపొందించాడు.


యావత్మాల్ జిల్లాకు చెందిన రైతు కొడుకు హర్షల్ నక్షనే. మెకానికల్ ఇంజినీర్ పూర్తి చేశాడు. ఎప్పటికైనా తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీ ఇచ్చే కారును తయారు చేయాలి అనుకున్నాడు. చాలా రోజులుగా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఎన్నో ప్రయోగాలు చేశాడు. చివరకు అనుకున్నది సాధించాడు. హైడ్రోజన్ తో నడిచి కారును తయారు చేశాడు.  కేవలం రూ. 150 ఇంధనంతో 300 కి.మీ నడిచేలా ఇంట్లో ఈ కారును తయారు చేశాడు. కాలుష్య రహిత వాహనాన్ని తయారు చేయాలనే లక్ష్యంతో ఈ కారును రూపొందించాడు. హర్షల్ తన చిన్ననాటి స్నేహితుడు కునాల్ అసుత్కర్ సహాయంతో ఈ కారును తయారు చేశాడు.  “నేను తయారు చేసిన DIY వాహనం హైడ్రోజన్‌ తో నడుస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీతో ఈ కారును తయారు చేశాను. ఇది ఒక నమూనా మాత్రమే. దీని తయారీకి సుమారు రూ. 25 లక్షలు ఖర్చు అయ్యింది” అని హర్షల్ చెప్పాడు. ప్రస్తుతం హర్షల్ ఇంటర్నెట్ సేవలను అందించే పని చేస్తున్నాడు.


ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన పేటెంట్ రైట్స్ కోసం హర్షల్ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. హైడ్రోజన్ ఇంధన వ్యవస్థ, సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్ రెండింటికీ పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తులను సమర్పించాడు. అంతేకాదు, ఈ కార్లను తనే స్వయంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నాడు. అయితే, తన దగ్గర కనీసం 100 వాహనాల స్టాక్ ఉంటేనే విక్రయాలను జరిపే అవకాశం ఉంటుంది. భారీ ఉత్పత్తి జరిగితే ఈ కారు ధర తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్ధితుల్లో ఈ కారు వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందో? లేదో? కచ్చితంగా తెలియదు. 


హర్షల్ రూపొందించిన హైడ్రోజన్ కారు పలు ప్రత్యేకతలను కలిగి ఉంది. ఈ ప్రోటోటైప్ కారులో సన్‌ రూఫ్‌ లు, సీజర్ డోర్లు, అటానమస్ డ్రైవింగ్‌ తో సహా పలు అత్యాధునిక టెక్నాలజీని కలిగి ఉంది. ఇది డెమో మాత్రమే కావడంతో, అసలు కారు తయారీ వరకు వచ్చే సరికి ఇంకా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. కొంత కాలం క్రితం హైడ్రోజన్‌ తో నడిచే కారును టయోటా మిరాయ్ భారత్ లో ఆవిష్కరించింది. ఒకే ట్యాంక్‌పై 1,359 కిలో మీటర్లు ప్రయాణించి అప్పట్లో ఈ కారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత గ్రీనెస్ట్ కారుగా గుర్తింపు పొందింది. హర్షల్ తయారు చేసిన ఈ స్వదేశీ కారు.. జపాన్ సెడాన్ కారును ప్రామాణికంగా తీసుకుని రూపొందించినట్లు తెలుస్తున్నది.