VinFast EV Sales India December 2025: భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో డిసెంబర్ 2025 నెల అనూహ్యమైన మలుపు తీసుకుంది. ఇప్పటివరకు టాటా, MG, మహీంద్రా వంటి బ్రాండ్ల ఆధిపత్యమే కనిపించిన EV సెగ్మెంట్‌లో... వియత్నాం కంపెనీ VinFast ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. కేవలం రెండు మోడళ్లతోనే, డిసెంబర్ 2025లో VinFast, భారత EV సేల్స్‌లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాదు, తన సేల్స్ స్పీడ్‌తో హ్యుందాయ్, కియా లాంటి పాత, స్థిరమైన బ్రాండ్లను సైతం వెనక్కి నెట్టింది.
డిసెంబర్ 2025 EV సేల్స్‌లో టాప్ 4లో VinFast
వాహన్ పోర్టల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం... డిసెంబర్ 2025లో భారత EV మార్కెట్‌లో టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ నెలలో టాటా మొత్తం 6,434 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. JSW MG Motor India 3,555 యూనిట్లతో రెండో స్థానంలో నిలవగా, మూడో స్థానాన్ని Mahindra Electric Automobile Ltd 3,065 యూనిట్లతో దక్కించుకుంది.
ఈ పోటీ మధ్యలోనే VinFast Auto India Pvt Ltd 375 యూనిట్ల విక్రయాలతో నాలుగో స్థానంలోకి దూసుకొచ్చింది. సంఖ్యపరంగా మహీంద్రాతో చాలా పెద్ద గ్యాప్ ఉన్నప్పటికీ... హ్యుందాయ్, కియా వంటి అనుభవజ్ఞులైన బ్రాండ్లను వెనక్కు నెట్టడం VinFast ప్రత్యేకత.
హ్యుందాయ్, కియా ఎన్ని EVలు అమ్మాయి?
డిసెంబర్ 2025లో Hyundai Motor India కేవలం 262 EVలను మాత్రమే విక్రయించగా, Kia India 313 యూనిట్లకు పరిమితమైంది. ఈ రెండు బ్రాండ్లను VinFast దాటేయడం భారత EV మార్కెట్‌లో ఒక కీలక సంకేతంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
టాటా, MG, మహీంద్రా ముందుండటానికి కారణాలు
టాటా ముందంజలో ఉండటానికి ప్రధాన కారణం... అందుబాటు ధరల్లో ఉన్న పెద్ద EV పోర్ట్‌ఫోలియో. Punch EV (ఎక్స్-షోరూమ్ ధర ₹9.99 లక్షల నుంచి), Nexon EV (ఎక్స్-షోరూమ్ ధర ₹12.49 లక్షల నుంచి) వంటి మోడళ్లు పట్టణాలతో పాటు సెమీ-అర్బన్ యూజనర్లకు సైతం చేరువయ్యాయి.
MG రెండో స్థానంలో నిలవడానికి కూడా ధరల వ్యూహమే కీలకం. Comet EV (ఎక్స్-షోరూమ్ ధర ₹7.49 లక్షల నుంచి), Windsor EV (ఎక్స్-షోరూమ్ ధర ₹13.99 లక్షల నుంచి) మోడళ్లు ఈ కంపెనీకి స్థిరమైన నెలవారీ సేల్స్‌ను తీసుకొచ్చాయి.
మహీంద్రా వద్ద చాలా ఎలక్ట్రిక్ మోడళ్లు ఉన్నప్పటికీ, వాటి ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. కంపెనీ అత్యల్ప ధర EV అయిన XUV400 (ఎక్స్-షోరూమ్ ధర ₹17.49 లక్షల నుంచి) మిడ్-రేంజ్ సెగ్మెంట్‌కే పరిమితమవుతోంది.
రెండు మోడళ్లతోనే VinFast ఎలా ముందుకెళ్లింది?
ప్రస్తుతం VinFast భారత్‌లో కేవలం రెండు ఎలక్ట్రిక్ SUVలను మాత్రమే విక్రయిస్తోంది. అవి:
VF6 - ఎక్స్-షోరూమ్ ధర ₹17.29 లక్షల నుంచి
VF7- ఎక్స్-షోరూమ్ ధర ₹21.89 లక్షల నుంచి
ధరలు ప్రీమియం రేంజ్‌లో ఉన్నప్పటికీ, VinFast స్థానిక తయారీ వ్యూహం ఈ కంపెనీ ప్లస్ పాయింట్ అయ్యింది. దీనివల్ల, ఇతర అంతర్జాతీయ ప్రీమియం EV బ్రాండ్లతో పోలిస్తే తక్కువ ధరల్లో కార్లను అందించగలిగింది. డిసెంబర్ నెలలో మంచి సేల్స్‌కు ఇదే ప్రధాన బలం అయ్యింది.
లగ్జరీ EV బ్రాండ్ల కంటే ముందే
డిసెంబర్ 2025లో BMW India 343 యూనిట్లు, Mercedes-Benz India 237 యూనిట్లు విక్రయించగా, Tesla India కేవలం 68 యూనిట్లతోనే పరిమితమైంది. ఈ గణాంకాలు చూస్తే, భారత మార్కెట్‌కు కొత్త అయినప్పటికీ VinFast ఇప్పటికే చాలా లగ్జరీ బ్రాండ్ల కంటే ముందుంది.
మొత్తంగా చూస్తే, డిసెంబర్ 2025 VinFastకు భారత EV మార్కెట్‌లో బ్రాండ్ గుర్తింపు పెంచుకున్న నెలగా నిలిచింది. రాబోయే నెలల్లో కొత్త మోడళ్లు వస్తే, ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.