Vida VX2 Plus 4.4 kWh Price And Features: దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో హీరో విడా మరో కొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న VX2 Plus 3.4kWh వేరియంట్‌కు తోడుగా ఇప్పుడు 4.4kWh బ్యాటరీతో కొత్త Vida VX2 Plusను విడుదల చేసింది. ఎక్కువ రేంజ్ కోరుకునేవాళ్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.1.44 లక్షలుగా నిర్ణయించింది.

కొత్త Vida VX2 Plusలో రెండు తొలగించగలిగే 2.2kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. మొత్తం బ్యాటరీ సామర్థ్యం 4.4kWh. ఇదే మోడల్‌లో ఇప్పటికే విక్రయిస్తున్న 3.4kWh వేరియంట్ 146 కిలోమీటర్ల IDC రేంజ్ అందిస్తుండగా, కొత్త వేరియంట్ 187 కిలోమీటర్ల IDC రేంజ్ అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. అంటే వాస్తవ వినియోగంలో కూడా దాదాపు 190 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశముంది. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

65 నిమిషాల్లో ఛార్జింగ్‌ఛార్జింగ్ విషయంలో కూడా హీరో అప్‌డేట్స్‌ చేసింది. కొత్త మోడల్‌తో 1kW పోర్టబుల్ ఛార్జర్‌ను అందిస్తోంది. దీని ద్వారా బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు 3 గంటల 17 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. పూర్తి ఛార్జ్ కావడానికి 5 గంటల 8 నిమిషాలు పడుతుంది. DC ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉపయోగిస్తే 0 నుంచి 80 శాతం వరకు కేవలం 65 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. పూర్తి ఛార్జ్ కావడానికి సుమారు 2 గంటల 30 నిమిషాలు మాత్రమే అవసరం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,000కు పైగా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని హీరో విడా తెలిపింది.

ఇది కూడా చదవండి: రాయల్ ఎన్‌ఫీల్డ్ లైట్‌వింగ్ హెల్మెట్ రివ్యూ - స్టైల్, సేఫ్టీ, కంఫర్ట్ ఎలా ఉన్నాయి?

కొత్త బ్యాటరీ వేరియంట్‌లో కూడా 6kW ఎలక్ట్రిక్ మోటార్ కొనసాగుతోంది. ఇది 26Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 90 కిలోమీటర్లుగా కంపెనీ వెల్లడించింది. Eco, Ride & Sport అనే మూడు రైడింగ్ మోడ్‌లతో పాటు అవసరమైన సమయంలో అదనపు శక్తిని అందించే Boost ఫంక్షన్ కూడా ఇందులో ఉంది. 4.3 అంగుళాల TFT డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ & టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఇందులో లభిస్తాయి.

ఆన్‌రోడ్ ధరకొత్త Vida VX2 Plus 4.4kWh వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.44 లక్షలు. అన్ని అవసరమైన ఖర్చులు కలిపి ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఈ స్కూటర్ ఆన్‌రోడ్ ధర రూ.1.58 లక్షల నుంచి రూ.1.66 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. నగరం, స్థానిక పన్నులు & డీలర్ ఛార్జీల ఆధారంగా ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: సీరియస్‌ రైడర్లకు బెస్ట్ బడ్జెట్ ఆప్షన్‌! రైడా రోవర్ రైడింగ్ ప్యాంట్స్ పూర్తి రివ్యూ

హీరో విడా తెలిపిన వివరాల ప్రకారం కొత్త Vida VX2 Plus 4.4kWh వేరియంట్ ఈ నెల (2026 జులై) చివరి నాటికి దేశవ్యాప్తంగా అధికారిక డీలర్‌షిప్‌లలో విక్రయాలకు అందుబాటులోకి వస్తుంది. ఇదే వేరియంట్‌తో దేశవ్యాప్తంగా 52 రోజుల్లో నిరంతరంగా 12,111 కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసి "ఎలక్ట్రిక్ స్కూటర్‌తో అత్యంత సుదీర్ఘ ప్రయాణం" విభాగంలో Asia Book of Recordsలో స్థానం సంపాదించినట్లు కంపెనీ ప్రకటించింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.