Verge TS Pro Electric Bike Battery: ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో, కొత్త టెక్నాలజీ విషయంలో, ఇప్పటి వరకు కార్లపైనే ఎక్కువ దృష్టి ఉండేది. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్స్ భవిష్యత్‌ను పూర్తిగా మార్చే టెక్నాలజీతో ఒక కొత్త మోడల్ తెరపైకి వచ్చింది. ఫిన్లాండ్‌కు చెందిన Verge Motorcycles కంపెనీ తయారు చేసిన Verge TS Pro, ప్రపంచంలోనే తొలి ప్రొడక్షన్ ఎలక్ట్రిక్ బైక్‌గా నిలిచింది. దీనిలో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే - ఇందులో సాలిడ్ స్టేట్ బ్యాటరీను ఉపయోగించడం.
సాలిడ్ స్టేట్ బ్యాటరీ అంటే ఏమిటి?ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న ఎక్కువ ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లు లిథియం-ఐయాన్ లేదా LFP బ్యాటరీలతో వస్తున్నాయి. వీటిలో ద్రవం లేదా జెల్ ఆధారిత ఎలక్ట్రోలైట్ ఉంటుంది. Verge TS Proలో మాత్రం సాలిడ్ ఎలక్ట్రోలైట్‌ను ఉపయోగించే సాలిడ్ స్టేట్ బ్యాటరీని అమర్చారు. దీనివల్ల అగ్ని ప్రమాదాల రిస్క్ తగ్గుతుందని కంపెనీ చెబుతోంది. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి దశలో ఉన్న ఈ టెక్నాలజీ ఇప్పుడు ఈ బైక్ రూపంలో నిజమైంది.
10 నిమిషాల్లో 80% ఛార్జింగ్Verge TS Pro మరో పెద్ద హైలైట్ CCS2 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఈ బైక్ గరిష్టంగా 200kW వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. సరైన ఛార్జర్ లభిస్తే కేవలం 10 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఎలక్ట్రిక్ బైక్స్‌పై ఉన్న “ఛార్జింగ్ టైమ్” భయాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది.
రెండు బ్యాటరీ ఆప్షన్లు, భారీ రేంజ్Verge TS Proను రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో అందిస్తున్నారు.
20.2kWh బ్యాటరీ - గరిష్టంగా 35 0km రేంజ్
33.3kWh బ్యాటరీ - గరిష్టంగా 600 km రేంజ్
ఈ రేంజ్ గణాంకాలు ఎలక్ట్రిక్ బైక్స్ విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌గా చెప్పొచ్చు.
హబ్‌లెస్ మోటార్ మాయVerge TS Proలో కనిపించే మరో ప్రత్యేకత హబ్‌లెస్ మోటార్. వీల్ మధ్యలో సంప్రదాయ మోటార్ లేకుండా, చక్రం లోపల ఉన్న ఎలక్ట్రోమాగ్నెట్లు, బయట ఉన్న శాశ్వత మాగ్నెట్ల సహాయంతో వీల్ తిరుగుతుంది. ఈ మోటార్ 102kW (సుమారు 138hp) పవర్ & 1,000Nm టార్క్ కూడా ఇస్తుంది. ఒక టూవీలర్ విషయంలో ఈ నంబర్లు నిజంగానే షాక్ ఇస్తాయి. ఫలితంగా ఈ బైక్ 0 నుంచి 100 kmph వేగాన్ని కేవలం 3.5 సెకన్లలో చేరుకుంటుంది.
రైడింగ్ మోడ్‌లు, భద్రతఈ శక్తిమంతమైన ఔట్‌పుట్‌ను నియంత్రించడానికి Verge TS Proలో ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ABS, అడ్జస్టబుల్ రీజెనరేటివ్ బ్రేకింగ్ ఉన్నాయి. రైడింగ్‌కు Range, Zen, Beast, Custom అనే నాలుగు మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. లాంగ్ రైడ్స్ కోసం క్రూయిజ్ కంట్రోల్, హీటెడ్ గ్రిప్స్ కూడా ఉన్నాయి.
ప్రీమియం హార్డ్‌వేర్‌సస్పెన్షన్ విషయంలో Ohlins/Wilbers ఫుల్లీ అడ్జస్టబుల్ యూనిట్స్, బ్రేకింగ్‌కు Brembo మోనోబ్లాక్ కాలిపర్స్, టైర్లకు Pirelli రబ్బర్ ఇచ్చారు. సీట్ కింద చిన్న స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ కూడా ఉండటం ఉపయోగకరం.
ధర ఎంతంటే?Verge TS Pro ధర 29,900 యూరోలు (ట్యాక్స్, రిజిస్ట్రేషన్ అదనం). అంతర్జాతీయ మార్కెట్లలో ఇది దాదాపు Ducati Streetfighter V4 ధర స్థాయిలోనే ఉంటుంది.
Verge TS Pro కేవలం ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ మాత్రమే కాదు. సాలిడ్ స్టేట్ బ్యాటరీ, అతి వేగవంతమైన ఛార్జింగ్, భారీ రేంజ్ - ఈ మూడు కలిసిన ఒక కొత్త భవిష్యత్తు. పెట్రోల్ బైక్స్‌కు నిజమైన ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ బైక్స్ నిలబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయనడానికి Verge TS Pro ను బలమైన ఉదాహరణగా చెప్పొచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.