How And When To Refinance A Vehicle: మన దగ్గర, కార్, స్కూటర్ లేదా బైక్ కొనేవాళ్లు ఏదైనా బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థ నుంచి లోన్ తీసుకోవడం సాధారణ విషయమే. కానీ, ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, నెలవారీ EMI భారంగా అనిపించినా, బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గినా… రీఫైనాన్స్ అనే ఆప్షన్ మీకు చాలా బాగా ఉపయోగపడవచ్చు. అయితే, అసలు ఈ రీఫైనాన్స్ అంటే ఏంటి?, నిజంగా ఇది ఉపయోగపడుతుందా?, ఈ కథనంలో చూద్దాం.
వెహికల్ రీఫైనాన్స్ అంటే ఏమిటి?వాహన రీఫైనాన్స్ అనేది మీ ప్రస్తుత వాహన రుణాన్ని కొత్త రుణంతో మార్చుకునే ప్రక్రియ. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే... మీరు ఇప్పటికే తీసుకున్న కార్ లేదా బైక్ లోన్‌కు బదులుగా మరో బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ నుంచి ఇంకా తక్కువ వడ్డీ రేటుతో కొత్త లోన్ తీసుకోవడం. దీనివల్ల అధిక వడ్డీ రేటు ఉన్న పాత లోన్‌ను పూర్తిగా తీరిపోతుంది, మీరు తక్కువ వడ్డీ రేటుతో కొత్త బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీకి EMI లు కట్టాల్సి ఉంటుంది. దీనివల్ల మీ డబ్బు ఆదా అవుతుంది.
ఎప్పుడు రీఫైనాన్స్ అవసరం వస్తుంది?
ప్రస్తుతం ఉన్న లోన్ వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు
నెలవారీ EMI కట్టడం కష్టంగా అనిపించినప్పుడు
మీ క్రెడిట్ స్కోర్ మెరుగై, ఇప్పుడు తక్కువ వడ్డీకి లోన్ వస్తుందనిపించినప్పుడు
మరింత కాలం పాటు లోన్ పొడిగించాలనుకునే పరిస్థితుల్లో
కొన్ని సందర్భాల్లో అదనంగా నగదు అవసరం ఉన్నప్పుడు కూడా (టాప్-అప్ రీఫైనాన్స్ ద్వారా)
రీఫైనాన్స్ వల్ల ప్రయోజనాలు ఏంటి?
తక్కువ వడ్డీ రేట్లు: క్రెడిట్ స్కోర్ మెరుగై ఉంటే, మీరు మరింత తక్కువ వడ్డీతో కొత్త లోన్ పొందవచ్చు.
EMI తగ్గుతుంది: పాత లోన్ కన్నా తక్కువ వడ్డీ లేదా ఎక్కువ కాలవ్యవధితో తీసుకుంటే EMI భారం తగ్గుతుంది.
డబ్బు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది: కొన్ని సంస్థలు రీఫైనాన్స్‌తో పాటు టాప్-అప్ లోన్ కూడా ఇస్తుంటాయి.
క్యాష్ రీబ్యాలెన్సింగ్: మీ ఫైనాన్స్ ప్లాన్‌ను మళ్లీ కొత్తగా, మీకు అనుకూలంగా ఏర్పాటు చేసుకునే అవకాశం.
విధివిధాలుగా ఆప్షన్లు: ఇప్పుడు చాలా బ్యాంకులు, NBFCలు, ఇతర ఫైనాన్స్ కంపెనీలు వెహికల్ రీఫైనాన్స్ ఆఫర్లు ఇస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కాంపిటీషన్ వల్ల మీరు మంచి ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
రీఫైనాన్స్ ముందు మీరు కచ్చితంగా చేయాల్సిన పనులు:
మీ ప్రస్తుత లోన్ వివరాలను సక్రమంగా చూసుకోవాలి
క్రెడిట్ స్కోర్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి
కొత్త వడ్డీ రేట్లు, ఫీజులు, ప్రాసెసింగ్ ఛార్జీలు వంటివి పోల్చుకోవాలి
ఎక్కడైనా ముందస్తు రీపేమెంట్ ఫైన్ ఉంటే దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి
చివరగా…వాహన రీఫైనాన్స్ కొన్ని సందర్భాల్లో నిజంగా బాగా ఉపయోగపడుతుంది. అయితే ప్రతి ఒక్కరికీ ఇది అవసరం కాదు. మీరు ప్రస్తుతం ఉన్న లోన్ మీద సంతృప్తిగా ఉన్నారంటే తప్పనిసరిగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ EMI భారం ఎక్కువగా అనిపిస్తే, తక్కువ వడ్డీ రేట్ల అవకాశాలు కనిపిస్తే, రీఫైనాన్స్ వల్ల లాభమే. అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటే మీకు ఆర్థికంగా ఊరట లభిస్తుంది.