ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్‌ను ప్రారంభించిన 24 గంటల్లోనే లక్ష మంది స్కూటర్ కోసం రిజర్వ్‌ చేసుకున్నారని సంస్థ వెల్లడించింది. ఇది భారతదేశ ఆటో ఇండస్ట్రీలో సరికొత్త రికార్డని ఓలా పేర్కొంది. ఇప్పటివరకు ఏ సంస్థా తొలి 24 గంటల్లో లక్ష బుకింగ్స్‌ను అందుకోలేదని గుర్తుచేసింది.


ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు వచ్చిన స్పందనపై సంస్థ సీఈవో భవిష్‌ అగర్వాల్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారనే విషయం దీని ద్వారా అర్థమవుతోందని అన్నారు. 






ప్రీ బుకింగ్ @రూ.499..
ఎలక్ట్రిక్ బైక్స్ కోసం ఎదురుచూసే వారి కోసం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని కోసం అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభించింది. త్వరలో విడుదల చేయబోయే ఈ స్కూటర్‌కు బుకింగ్ ఫీజుగా రూ.499 చెల్లించాలని తెలిపింది. olaelectric.com ద్వారా ఆన్‌లైన్‌లో వీటిని బుక్ చేసుకోవ‌చ్చని పేర్కొంది. ఈ డబ్బు పూర్తిగా రీఫండబుల్ అని చెప్పింది.  దేశవ్యాప్తంగా 400 పట్టణాల్లో హైపర్ చార్జర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.


ఓలా స్కూటర్ ప్రచారం కూడా భారీ హైప్‌తో సాగింది. సంస్థ సీఈవో స్వయానా బండిని నడుపుతూ ప్రచారం చేయడం మరింత బజ్ ను తెచ్చిపెట్టింది. ఒక ట్వీట్ చదివేంత సమయంలో ఈ బైక్ 0 నుంచి 60 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుందని సంస్థ సీఈవో పేర్కొన్నారు. 






ఈ స్కూటర్ ఫీచర్లు, వేరియంట్ల వివరాలు అధికారికంగా విడుదల చేయనప్పటికీ, దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మొత్తం మూడు వేరియంట్లలో ఈ స్కూటర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. 


లీకుల ప్రకారం.. ఓలా సిరీస్ S, S1, S1 ప్రో అనే మూడు పేర్లతో వేరియంట్లు రాబోతున్నట్లు తెలిసింది. సిరీస్ ఎస్ అనేది అధికారిక పేరు కాగా, ఎస్ 1, ఎస్ 1 ప్రో వేరియంట్లుగా ఉండనున్నాయి. యాపిల్ ఐఫోన్ల మాదిరిగా ఒకే మోడల్‌తో వేర్వేరు వేరియంట్లు తీసుకురానుంది. ఎస్ 1ను బేస్ వేరియంట్‌గా, ఎస్ 1 ప్రో టాప్ వేరియంట్‌గా ఉండనుంది. 




ఈ బండిని ఒకసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అలాగే జీరో శాతంగా ఉన్న స్కూటర్ చార్జింగ్ కేవలం 18 నిమిషాల్లోనే 50 శాతం వరకు చేరుతుంది. ఓలా స్కూటర్ గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగాన్ని కలిగి ఉంటుంది. ఈ ఓలా స్కూటర్ ధ‌ర రూ.ల‌క్ష నుంచి రూ. 1.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉండే అవకాశం ఉంది. 
10 వేల మందికి ఉపాధి.. 
తమిళనాడులోని ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీలో ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ ప్రారంభం కానున్నట్లు సంస్థ ప్రకటించింది. ఏటా కోటి స్కూటర్లను తయారు చేసేలా ఇందులో వసతుల్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఓలా స్కూటర్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వాటి తయారీకి మరో 10 వేల మందిని నియమించనున్నట్లు తెలుస్తోంది.