తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం 'బాహుబలి'. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. జపాన్, చైనా లాంటి దేశాల్లో సైతం సత్తా చాటింది. చిత్రబృందం కూడా ఇంటర్నేషనల్ రేంజ్ లో తమ సినిమాను ప్రమోట్ చేసి ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా చూశారు. 'బాహుబలి ది బిగినింగ్', 'బాహుబలి ది కంక్లూజన్' ఈ రెండు భాగాలు విడుదలైనప్పటి నుండి ఈ సినిమాకి సంబంధించిన ప్రీక్వెల్ వస్తుందని అన్నారు. 



ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సంస్థ 'బాహుబలి బిఫోర్ ది బిగినింగ్' పేరుతో ప్రీక్వెల్ ను వెబ్ సిరీస్ రూపంలో విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. తాజాగా అసలు మాహిష్మతి సామ్రాజ్యం ఎలా ఏర్పడింది..? దీనిలో శివగామి పాత్ర ఎంత ఉంది..? అసలు ఆమె ఈ రాజ్యంలో ఎలా ఎంట్రీ ఇచ్చిందనే అంశాలతో ఈ సిరీస్ ను రూపొందించాలనుకుంటున్నారు. 



దాదాపు తొమ్మిది ఎపిసోడ్లతో ఈ సిరీస్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే శివగామి పాత్ర కోసం ముందుగా బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ ను తీసుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమెకి బదులుగా మరో నటి వామికా గబ్బిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ తెలుగులో 'భలే మంచి రోజు' అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. మరి శివగామి లాంటి పాత్రకు ఏ మేరకు న్యాయం చేస్తుందో చూడాలి. 





ఇప్పుడు ఈ ప్రీక్వెల్ కు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార కీలకపాత్రలో కనిపించనుందని సమాచారం. అయితే ఆమె ఏ పాత్రలో కనిపించబోతుంది..? ఆ పాత్ర ఇతివృత్తం ఏంటనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. కానీ నయనతార నటించడం మాత్రం ఖాయమని అంటున్నారు. గతంలో నయన్ నటించిన 'అమ్మోరు తల్లి' సినిమా ఓటీటీలో రిలీజయింది. ఇందులో ఆమె దేవతగా కనిపించింది. 



అయితే తొలిసారిగా ఆమె 'బాహుబలి' ప్రీక్వెల్ తో ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతుందని చెప్పాలి. చాలా మంది స్టార్ హీరోయిన్లు ఈ మధ్యకాలంలో డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. కానీ నయన్ మాత్రం క్రేజీ కాన్సెప్ట్ తో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. మరో రెండు, మూడు నెలల్లో మొదలయ్యే ఈ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ లో నయన్ పాల్గొనబోతుందట. 





2017లో ఆనంద్ నీలకంఠన్ అనే రచయిత రాసి 'ది రైజ్‌ ఆఫ్‌ శివగామి' అనే నవల ఆధారంగా ఈ సిరీస్‌ తెరకెక్కించనున్నారు. నెట్ ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారట. ఆర్కా మీడియా బ్యానర్ పై  ప్రసాద్‌ దేవినేని, రాజమౌళి ఈ సిరీస్‌ నిర్మించనున్నారని.. దేవకట్టా, ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది!