Vinfast India 2026 launches: భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌లో వేగం పెరిగింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి, వియత్నాం ఆటోమొబైల్‌ కంపెనీ విన్‌ఫాస్ట్‌ (Vinfast) దూకుడు పెంచుతోంది. 2025 సెప్టెంబర్‌లో భారత మార్కెట్‌లో అడుగుపెట్టిన విన్‌ఫాస్ట్‌... ఇప్పటికే VF6, VF7 ఎలక్ట్రిక్‌ SUVలను విక్రయిస్తోంది. 2026లో మరో రెండు కొత్త మోడళ్లను తీసుకురావడానికి ప్లాన్‌ చేస్తోంది.

Continues below advertisement

భారత్‌లో తయారీతో విన్‌ఫాస్ట్‌ వ్యూహం

విన్‌ఫాస్ట్‌ తమ వాహనాలను తమిళనాడులోని ప్లాంట్‌లో తయారు చేస్తోంది. దీని వల్ల ధరలపై నియంత్రణతో పాటు భారతీయులకు అనుకూలమైన ఉత్పత్తులు అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. 2026లో విడుదల కానున్న మోడళ్లు పూర్తిగా భారత అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు.

Continues below advertisement

2026 Vinfast Limo Green – ఫ్యామిలీలకు కొత్త ఆప్షన్‌

లిమో గ్రీన్‌, విన్‌ఫాస్ట్‌ నుంచి రానున్న తొలి మూడు వరుసల ఎలక్ట్రిక్‌ MPV. కంపెనీ దీనిని పూర్తి స్థాయి 7 సీటర్‌గా కాకుండా 5+2 సీటింగ్‌ లేఅవుట్‌గా చెబుతోంది. అయినప్పటికీ, భారత్‌ మార్కెట్‌లో దీని ప్రధాన ప్రత్యర్థి BYD eMax 7 అవుతుంది.

ఈ MPVలో 60.1kWh బ్యాటరీ ప్యాక్‌ ఇస్తారు. ఒక్కసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే సుమారు 450 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని విన్‌ఫాస్ట్‌ చెబుతోంది. ముందుభాగంలో అమర్చిన మోటార్‌ ద్వారా 201hp శక్తిమంతమైన పవర్‌ అందుతుంది.

ఇంటీరియర్‌లో... విన్‌ఫాస్ట్‌ SUVల మాదిరిగానే మినిమలిస్ట్‌ డిజైన్‌ కనిపిస్తుంది. పెద్ద సెంట్రల్‌ టచ్‌స్క్రీన్‌ ద్వారా చాలా ఫంక్షన్లు కంట్రోల్‌ చేస్తారు. బయటి లుక్‌లో... ముందు, వెనుక భాగాల్లో కనిపించే V ఆకారంలోని ల్యాంప్‌ డిజైన్‌ దీనికి ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది. వెనుక వైపు పైకి లేచిన రూఫ్‌ డిజైన్‌ సఫారి తరహా సిల్హౌట్‌ను గుర్తు చేస్తుంది.

లిమో గ్రీన్‌ 2026 మొదటి త్రైమాసికంలో (Q1) విడుదల అయ్యే అవకాశం ఉంది. దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.22-26 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.

2026 Vinfast VF3 – నగరాల కోసం మైక్రో ఎలక్ట్రిక్‌ కారు

భారత నగరాల్లో MG Comet సాధించిన విజయాన్ని చూసిన విన్‌ఫాస్ట్‌, అదే సెగ్మెంట్‌లో VF3 మైక్రో EVతో పోటీకి దిగుతోంది. చిన్న సైజ్‌, తక్కువ బరువు కారణంగా ఇది ట్రాఫిక్‌లో నడపడం చాలా ఈజీగా ఉంటుంది.

VF3లో 18.6kWh బ్యాటరీ ఇస్తారు. ఇది సింగిల్‌ చార్జ్‌తో 200 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ ఇస్తుంది. సాధారణ ఆఫీస్‌ ప్రయాణాలకు ఇది దాదాపు వారం రోజుల వరకు సరిపోతుంది. 191mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఉండటంతో గతుకుల రోడ్లపై నడపడం కూడా పెద్ద సమస్య కాకపోవచ్చు.

ఈ కారులో 43.5hp పవర్‌ మాత్రమే ఉన్నప్పటికీ, చిన్న సైజ్‌, తక్కువ బరువు కారణంగా నగర వినియోగానికి ఇది సరిపోతుంది. విన్‌ఫాస్ట్‌ కూడా Battery as a Service (BaaS) మోడల్‌ను ఆఫర్‌ చేసే అవకాశం ఉంది. దీనివల్ల కొనుగోలు ధర తగ్గే అవకాశం ఉంటుంది.

VF3 2026 తొలి అర్ధభాగంలో (H1) విడుదల అయ్యే ఛాన్స్‌ ఉంది. దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.8-10 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.

2026తో భారత మార్కెట్‌లో విన్‌ఫాస్ట్‌ తన పోర్ట్‌ఫోలియోను స్పష్టంగా విస్తరించబోతోంది. ఒకవైపు నగర వినియోగదారులకు VF3, మరోవైపు ఫ్యామిలీల కోసం లిమో గ్రీన్‌ MPV… ఇలా రెండు భిన్నమైన సెగ్మెంట్లను టార్గెట్‌ చేస్తోంది. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.