Skoda India 2026 Launches: 2025 సంవత్సరం స్కోడా ఇండియాకు చాలా కీలకంగా నిలిచింది. ఈ ఏడాదిలోనే కంపెనీ కొత్త తరం కొడియాక్‌ ప్రీమియం SUV, ఆక్టావియా RS పెర్ఫార్మెన్స్‌ సెడాన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అయితే ప్రీమియం సెగ్మెంట్‌తో పాటు, పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగే మిడ్‌ సెగ్మెంట్‌లోనూ ప్రతాపం చూపించాలనే లక్ష్యంతో, స్కోడా, 2026లో భారీ ప్లాన్‌తో ముందుకు వస్తోంది. ముఖ్యంగా Skoda Kushaq Facelift, Skoda Slavia Facelift పేరిట పెద్ద అప్‌డేట్స్‌ సిద్ధమవుతుండగా, ఒక కొత్త ఎలక్ట్రిక్‌ SUV రాకపై కూడా చర్చ సాగుతోంది.

Continues below advertisement

 Skoda Kushaq Facelift 2026

2021లో లాంచ్‌ అయిన కుషాక్‌కు ఇది మొదటి పెద్ద అప్‌డేట్‌. 2026 మొదటి త్రైమాసికంలో ఈ SUV ఫేస్‌లిఫ్ట్‌ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. తాజా స్పై ఫొటోలు చూస్తే, ముందు, వెనుక భాగాల్లో చిన్న మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తి వెడల్పు LED లైట్‌ బార్‌ వచ్చే అవకాశం కూడా ఉంది.

Continues below advertisement

ఇంటీరియర్‌లో... ట్రిమ్స్‌, మెటీరియల్స్‌, కలర్‌ స్కీమ్‌లో స్వల్ప మార్పులు ఉంటాయి. అయితే ఫీచర్లలో మాత్రం పెద్ద దూకుడు కనిపించనుంది. సెగ్మెంట్‌లో తొలిసారిగా వెనుక సీట్లకు మసాజ్‌ ఫంక్షన్‌, కొత్త డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ గ్రాఫిక్స్‌, అప్‌డేటెడ్‌ టచ్‌స్క్రీన్‌ అందించే అవకాశముంది.

సేఫ్టీ విషయంలో కూడా కుషాక్‌ మరో మైలురాయి దాటనుంది. లెవల్‌ 2 ADAS, 1.5 TSI వేరియంట్లకు ఆల్‌ వీల్‌ డిస్క్‌ బ్రేకులు, 360 డిగ్రీ కెమెరా రావచ్చని సమాచారం. ప్రస్తుత మోడల్‌లో AC పనితీరుపై వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని కూలింగ్‌ను కూడా మెరుగుపరిచింది. అంతేకాదు, చాలా కాలంగా ఎదురుచూస్తున్న పానోరమిక్‌ సన్‌రూఫ్‌ కూడా ఈసారి రావచ్చు.

ఇంజిన్‌ ఎంపికలు మారే అవకాశం లేదు. 1.0 TSI (115hp), 1.5 TSI (150hp) కొనసాగుతాయి. అయితే 1.0 TSIలో ఉన్న 6 స్పీడ్‌ ఆటోమేటిక్‌ స్థానంలో 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ రావచ్చని సమాచారం.

Skoda Slavia Facelift 2026

స్లావియా ఫేస్‌లిఫ్ట్‌ 2026 నాలుగో త్రైమాసికంలో వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో  Honda City, Hyundai Verna, కూడా అప్‌డేట్స్‌ పొందనున్నాయి. అలాగే Volkswagen Virtus కూ ఫేస్‌లిఫ్ట్‌ వచ్చే ఛాన్స్‌ ఉంది.

బాడీ డిజైన్‌లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. స్పై టెస్ట్‌ కార్లు చూసినప్పుడు ప్రస్తుత స్లావియాతో దాదాపు ఒకే ఆకృతి కనిపించింది. అయితే హెడ్‌ల్యాంప్స్‌, బంపర్లు, అల్లాయ్‌ వీల్స్‌లో స్వల్ప మార్పులు ఖాయం. కుషాక్‌ మాదిరిగానే స్లావియాకు కూడా ADAS, అప్‌డేటెడ్‌ డిస్‌ప్లేలు వచ్చే అవకాశం ఉంది. ఇది స్లావియాకు చాలా కీలకమైన అప్‌డేట్‌, ఎందుకంటే ప్రత్యర్థి కార్లలో ఈ సేఫ్టీ ఫీచర్‌ ఇప్పటికే అందుబాటులో ఉంది.

ఇంజిన్‌ విషయంలో పెద్ద మార్పు ఉండదు. అయితే 1.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌లో 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ప్రవేశించే అవకాశం ఉంది.

Skoda Elroq Electric SUV

స్కోడా నుంచి అధికారిక ధృవీకరణ లేకపోయినా, ఎల్రోక్‌ ఎలక్ట్రిక్‌ SUV 2026 రెండో భాగంలో భారత్‌లోకి రావచ్చని అంచనా. ఇది Hyundai Ioniq 5, BMW iX1 LWB వంటి కార్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది.

యూరప్‌లో ఎల్రోక్‌ మూడు బ్యాటరీ ఆప్షన్లలో వస్తోంది. గరిష్టంగా 560 కిలోమీటర్ల రేంజ్‌, 0–100 కి.మీ. వేగాన్ని 6.6 సెకన్లలో సాధించే సామర్థ్యం దీనికి ఉంది. స్కోడా కొత్త Modern Solid డిజైన్‌తో ఈ SUV చాలా షార్ప్‌గా కనిపిస్తుంది. సైజ్‌ పెద్దగా ఉండటం వల్ల కేబిన్‌ స్పేస్‌ కూడా ఎక్కువగా ఉంటుంది.

2026 స్కోడా ఇండియాకు కీలక సంవత్సరం కానుంది. పెట్రోల్‌ కార్ల ఫేస్‌లిఫ్ట్‌లతో పాటు, ఎలక్ట్రిక్‌ సెగ్మెంట్‌లో అడుగుపెట్టే ప్రయత్నం చేయడం స్కోడా వ్యూహంలో పెద్ద మార్పుగా చెప్పొచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.