Kia India 2026 launches: 2026లో కియా ఇండియా మార్కెట్‌లో దూకుడు పెంచేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది మొత్తం మీద మూడు కీలక మోడళ్లను విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేసింది. వాటిలో ముందుగా.. సెకండ్-జెనరేషన్ కియా సెల్టోస్ (2nd-Gen Kia Seltos 2026), ఆ తర్వాత సైరోస్ ఎలక్ట్రిక్ (Syros EV), చివరగా పెద్ద 7-సీటర్ సోరెంటో SUV (Kia Sorento 2026) ఉన్నాయి. ఇవి కియా బ్రాండ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లే మోడళ్లుగా భావిస్తున్నారు.
2026 కియా సెల్టోస్: కొత్త రూపం, ఎక్కువ కంఫర్ట్
సెకండ్-జెన్ కియా సెల్టోస్‌ను కంపెనీ ఇప్పటికే డిసెంబర్ 10న అధికారికంగా పరిచయం చేసింది. జనవరి 2, 2026న ఇది భారత మార్కెట్‌లో లాంచ్ కానుంది. ధరలు సుమారు రూ.12 లక్షల నుంచి రూ.22 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ధర) ఉండొచ్చని అంచనా.
కొత్త సెల్టోస్ డిజైన్ పూర్తిగా మారింది. ముందుభాగంలో నిటారుగా ఉన్న నోస్, నిలువుగా పేర్చిన DRLsతో మరింత అగ్రెసివ్ లుక్ కనిపిస్తుంది. పరిమాణంలో కూడా పెరగడం వల్ల లోపల కేబిన్ స్పేస్ మరింత మెరుగైంది. ఇంటీరియర్‌లో ట్రినిటీ పానోరమిక్ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఫిట్ అండ్ ఫినిష్ కూడా గత మోడల్‌తో పోలిస్తే స్పష్టంగా మెరుగైంది.
ఇంజిన్ ఆప్షన్లలో పెద్ద మార్పులు లేవు. 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, అలాగే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కొనసాగుతాయి. అయితే రాబోయే కాలంలో నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్‌కు హైబ్రిడ్ టెక్నాలజీ వచ్చే అవకాశం ఉంది.
కియా సైరోస్ ఎలక్ట్రిక్: Q2లో ఎంట్రీ
2026 రెండో త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్ కాలం) కియా సైరోస్ ఎలక్ట్రిక్ మార్కెట్‌లోకి రానుంది. దీని ధర రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్ ధర) ఉండొచ్చని అంచనా.
ఈ ఎలక్ట్రిక్ SUV, గ్లోబల్ మార్కెట్‌లో ఉన్న హ్యుందాయ్ ఇన్‌స్టర్ EVతో ఒకే ప్లాట్‌ఫామ్‌ను షేర్ చేసుకుంటుంది. 42kWh, 49kWh బ్యాటరీ ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది. బాక్సీ డిజైన్‌ను అలాగే ఉంచుతూ, బ్లాంక్ గ్రిల్, ముందు ఫెండర్‌పై ఛార్జింగ్ పోర్ట్ వంటి ఎలక్ట్రిక్ ప్రత్యేక అంశాలు ఇందులో కనిపిస్తాయి. నగర వినియోగానికి సరైన ఎలక్ట్రిక్ SUVగా సైరోస్ EV నిలవనుంది.
కియా సోరెంటో: ఫుల్-సైజ్ SUV ప్లాన్
2026 రెండో భాగంలో కియా సోరెంటో లేదా అదే ప్లాట్‌ఫామ్‌పై తయారైన కొత్త SUV భారత మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ.35 లక్షల దగ్గర (ఎక్స్-షోరూమ్ ధర) ఉండొచ్చని అంచనా.
7 సీట్ల సామర్థ్యంతో వచ్చే ఈ SUV, జీప్ మెరిడియన్, టయోటా ఫార్చ్యూనర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. పెద్ద కేబిన్, ఆధునిక ఫీచర్లు, లెవల్ 2 ADAS వంటి సేఫ్టీ టెక్నాలజీతో ఇది ప్రీమియం కస్టమర్లను ఆకర్షించనుంది.
మొత్తంగా చూస్తే, 2026లో కియా ఇండియా లైనప్ చాలా బలంగా మారనుంది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ – మూడు సెగ్మెంట్లలోనూ కొత్త ఆప్షన్లతో తెలుగు రాష్ట్రాల కార్ కొనుగోలుదారులకు మంచి ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.