TVS Raider 125 Doctor Doom Edition: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌, తన పాపులర్‌ కమ్యూటర్‌ బైక్‌ రైడర్‌ 125 లో మరో ప్రత్యేక వెర్షన్‌ను పరిచయం చేసింది. మార్వెల్‌ అభిమానులను ఆకట్టుకునేలా రూపొందించిన కొత్త డాక్టర్‌ డూమ్‌ ఎడిషన్‌ను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.95,320గా నిర్ణయించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న సూపర్‌ స్క్వాడ్‌ ఎడిషన్‌ బైక్‌ల మాదిరిగానే ఈ మోడల్‌కు కూడా ప్రత్యేక మార్వెల్‌ థీమ్‌ను అందించారు. అయితే డిజైన్‌లో మాత్రమే మార్పులు ఉండగా, ఇంజిన్‌ & ఇతర మెకానికల్‌ అంశాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

Continues below advertisement

మల్టీ టోన్‌ ఫినిష్‌కొత్త టీవీఎస్‌ రైడర్‌ 125 డాక్టర్‌ డూమ్‌ ఎడిషన్‌కు ప్రత్యేక ఆకర్షణగా స్పెక్ట్రల్‌ గ్రీన్‌ పెయింట్‌ స్కీమ్‌ను అందించారు. ఇది సాధారణ గ్రీన్‌ రంగు కాకుండా కాంతి పడే కోణాన్ని బట్టి ఆకుపచ్చ నుంచి బ్రౌన్‌ రంగులోకి మారుతున్నట్లుగా కనిపించే మల్టీ టోన్‌ ఫినిష్‌తో రూపొందించారు. ఫ్యూయల్‌ ట్యాంక్‌, సైడ్‌ ప్యానెల్స్‌పై డాక్టర్‌ డూమ్‌కు సంబంధించిన ప్రత్యేక గ్రాఫిక్స్‌ను జోడించారు. దీంతో ఈ బైక్‌కు మరింత స్పోర్టీ & ప్రీమియం లుక్‌ వచ్చింది.

టీవీఎస్‌ ఇప్పటికే ఐరన్‌ మాన్‌, బ్లాక్‌ పాంథర్‌, డెడ్‌పూల్‌, వుల్వరిన్‌ థీమ్‌లతో సూపర్‌ స్క్వాడ్‌ ఎడిషన్‌లను విక్రయిస్తోంది. ఇప్పుడు డాక్టర్‌ డూమ్‌ ఎడిషన్‌ చేరడంతో ఈ శ్రేణి మరింత విస్తరించింది. మార్వెల్‌తో కలిసి రూపొందించిన ఈ ప్రత్యేక పోర్ట్‌ఫోలియోకు మార్కెట్‌లో మంచి ఆదరణ లభించిందని కంపెనీ తెలిపింది. రైడర్‌ 125 & ఎన్‌టార్క్‌ స్కూటర్‌లలో అందుబాటులో ఉన్న సూపర్‌ స్క్వాడ్‌ శ్రేణి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 5 లక్షలకు పైగా యూనిట్ల విక్రయాలు నమోదైనట్లు వెల్లడించింది.

Continues below advertisement

ఇది కూడా చదవండి: పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే నో పెట్రోల్‌, డీజిల్‌! కొత్త రూల్‌లోకి వచ్చేస్తోంది!

ఇంజిన్‌ ఈ కొత్త ఎడిషన్‌లో కూడా అదే 124.8సీసీ ఎయిర్‌ & ఆయిల్‌ కూల్డ్‌, సింగిల్‌ సిలిండర్‌, మూడు వాల్వ్‌ ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ ఇంజిన్‌ గరిష్ఠంగా 11.4 హెచ్‌పీ పవర్‌ & 11.7 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగర ప్రయాణాలతో పాటు రోజువారీ వినియోగానికి అనువైన పనితీరును ఈ ఇంజిన్‌ అందిస్తుంది.

ఫీచర్ల పరంగా కూడా ఎలాంటి మార్పులు లేవు. కనెక్టెడ్‌ రివర్స్‌ LCD డిస్‌ప్లేతో పాటు 85కు పైగా కనెక్టెడ్‌ ఫంక్షన్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. అలాగే ఐగో అసిస్ట్‌ టెక్నాలజీ కూడా కొనసాగించారు. ఈ ఫీచర్ల ద్వారా రైడర్లకు మెరుగైన కనెక్టివిటీ & సౌకర్యవంతమైన రైడింగ్‌ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో కంపెనీ ముందుకు సాగుతోంది.

ఇది కూడా చదవండి: 2026 Tata Punch EV కి 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ - పెద్దలు, పిల్లల భద్రతలో టాప్‌ మార్కులు

డాక్టర్‌ డూమ్‌ ఎడిషన్‌ ధర (రూ.95,320, ఎక్స్‌షోరూమ్‌), ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఇతర సూపర్‌ స్క్వాడ్‌ ఎడిషన్‌ వేరియంట్ల ధరతో సమానంగా ఉంది. రాబోయే కొన్ని వారాల్లో దేశవ్యాప్తంగా ఉన్న టీవీఎస్‌ అధీకృత డీలర్‌షిప్‌లలో ఈ ప్రత్యేక ఎడిషన్‌ విక్రయాలకు అందుబాటులోకి రానుంది. ప్రత్యేక డిజైన్‌ను ఇష్టపడే యువతతో పాటు మార్వెల్‌ అభిమానులను ఆకట్టుకునేలా ఈ కొత్త వెర్షన్‌ను టీవీఎస్‌ రూపొందించింది. దీంతో రైడర్‌ 125 అమ్మకాలకు మరింత ఊపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.