TVS King Kargo HD EV Price, Range And Features Telugu: మన దేశంలో, రోజురోజుకూ ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతోంది. కార్లు, బైకుల వంటి వ్యక్తిగత వాహనాల్లోనే కాదు.. కార్గో, లాస్ట్ మైల్ డెలివరీ రంగంలో డీజిల్, పెట్రోల్ ఆటోలు క్రమంగా ఎలక్ట్రిక్ ఆటోలకు మారిపోతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ వేవ్‌లో, TVS మోటార్ కంపెనీ, కొత్తగా "TVS కింగ్ కార్గో హెచ్‌డీ ఈవీ"ని మార్కెట్లోకి తీసుకొచ్చింది.
శక్తిమంతమైన బ్యాటరీ, లాంగ్ రేంజ్‌ఈ కొత్త TVS King Kargo HD EV ఆటోలో 10.24 kWh లిథియమ్-ఐయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఒకసారి పూర్తి చార్జ్ చేస్తే 150 కి.మీ. వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. కార్గో అవసరాలకు సరిపోయేలా ఈ ఆటోను ప్రత్యేకంగా రూపొందించారు. అంటే, రోజంతా సరుకు రవాణా చేసే వాళ్లకు మళ్లీ మళ్లీ చార్జింగ్ అవసరం ఉండదు.
భారీ లోడ్ సామర్థ్యంTVS కింగ్ కార్గో హెచ్‌డీ EV ప్రధాన బలం దాని లోడ్ క్యాపాసిటీ. దాదాపు 500 కిలోల వరకు సరుకును ఈ ఆటో తీసుకెళ్లగలదు. ఈ బండి గ్రౌండ్ క్లియరెన్స్ 235 mm కాబట్టి, ఎగుడుదిగుడు రోడ్లపై కూడా ఇబ్బంది లేకుండా నడుస్తుంది. 703 mm లోడింగ్ ప్లాట్‌ఫామ్ కారణంగా పెద్ద పరిమాణంలో కార్గోను లోడ్ చేయవచ్చు. మరో హైలైట్ ఏమింటంటే, అంతేకాక, TVS కింగ్ కార్గో హెచ్‌డీ EV కి 500 mm వాటర్ ఫోర్డింగ్ సామర్థ్యం ఉంది. దీని అర్ధం.. వర్షాకాలంలో నీళ్లతో నిండిన రోడ్లపై కూడా ఈ ఎలక్ట్రిక్ ఆటోను ధైర్యంగా నడపవచ్చు. హోల్‌సేల్ మార్కెట్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఈ-కామర్స్ డెలివరీ పార్టనర్లకు ఈ కొత్త ఎలక్ట్రిక్ ఆటో ఒక పెద్ద అదనపు సౌలభ్యం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య అవసరాల కోసం మంచి ఎంపిక అవుతుంది.
తక్కువ ఆపరేటింగ్ ఖర్చులుడీజిల్, పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఈ ఎలక్ట్రిక్ ఆటో నిర్వహణ ఖర్చులు చాలా తక్కువ. ఒక్క కిలోమీటర్ నడపడానికి 80 పైసల వరకు మాత్రమే ఖర్చు అవుతుందని కంపెనీ వెల్లడించింది. అంటే డ్రైవర్‌లకు, ఓనర్లకు దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ధర వివరాలుTVS కింగ్ కార్గో హెచ్‌డీ EV ను తెలుగు రాష్ట్రాల్లో లాంచ్ చేయలేదు. తొలి విడతలో, దిల్లీ -NCR, బెంగళూరు, రాజస్థాన్‌లో మాత్రమే అమ్ముతోంది. ఆ తర్వాత క్రమంగా తెలుగు రాష్ట్రాల్లోనూ సేల్స్ ప్రారంభిస్తుంది. TVS కింగ్ కార్గో హెచ్‌డీ EV ధర రూ. 3.85 లక్షలు (ఎక్స్-షోరూమ్). బడ్జెట్ ధర కావడం వల్ల చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందాలనుకునే వాళ్లకు ఇది మంచి ఆఫర్ అవుతుంది. తక్కువ పెట్టుబడి పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించే ఆస్కారం ఉంది.
డ్రైవర్ కంఫర్ట్ & డిజైన్‌ఈ బండిలో, డిజైన్ పరంగా కూడా కొత్త తరహా మార్పులు జరిగాయి. విశాలమైన క్యాబిన్, సాఫ్ట్ సీటింగ్, రోల్-ఔట్ విండోలు, తేలికైన హ్యాండ్లింగ్‌తో డ్రైవర్‌కు లాంగ్ జర్నీల్లోనూ కంఫర్ట్‌గా ఉంటుంది. LED హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు కారణంగా రాత్రి వేళ ప్రయాణాల్లో రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది. డిజిటల్ డిస్‌ప్లే, స్మార్ట్ ఫీచర్లు ఉండటం వలన మోడ్రన్ కారును నడుపుతున్న ఫీలింగ్ వస్తుంది. మన దేశంలో, బ్లూటూత్ కనెక్టివిటీతో వచ్చిన తొలి త్రీ-వీలర్ ఇదే. TVS కనెక్ట్ ఫ్లీట్ దీనికి అదనపు ఆకర్షణ, దీనితో కార్గో డెలివెరీలను ఈజీగా నిర్వహించవచ్చు.
వాణిజ్య రంగంలో మార్పుTVS King Kargo HD EV లాంచ్‌తో వాణిజ్య రవాణా రంగం మరింత వేగంగా ఎలక్ట్రిక్ వైపు అడుగులు వేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. లాస్ట్ మైల్ డెలివరీ సర్వీసులు, పండ్లు/కూరగాయల మార్కెట్లు, హోల్‌సేల్ వ్యాపారులు ఈ వాహనాన్ని విస్తృతంగా వాడుకునే అవకాశాలు ఉన్నాయి.