Automobile Latest News :  బీ అలెర్ట్.. మీ దగ్గర 20 ఏళ్ల‌కి పైబ‌డిన వాహ‌నం ఉన్న‌ట్ల‌యితే, దాన్ని రీ రిజిస్ట్రేష‌న్ చేయించేముందు ఒక విషయం గుర్తుంచుకోండి. బండి కొని, 20 సంవత్స‌రాల వ్య‌వ‌ధి దాటిన వాహ‌నాల‌ను తిరిగి రిజిస్ట్రేష‌న్ చేసిన‌ట్ల‌యితే జేబుకు చిల్లు భారీగా ప‌డ‌నుంది.  20 సంవత్సరాల కంటే పాత మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ చార్జీని కేంద్ర‌ రవాణా మంత్రిత్వ శాఖ పెంచింది. 20 సంవత్సరాల పైబ‌డిన‌ పాత తేలికపాటి మోటారు వాహనాల (LMVలు) రిజిస్ట్రేష‌న్ చార్జిని రూ.5,000 నుండి రూ.10,000కి పెంచినట్లు కేంద్ర‌ రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఒక నోటిఫికేషన్‌లో ప్రకటించింది. అంటే ఇది గ‌తంలో ఉన్న అమౌంట్ కు రెట్టింపు కావ‌డం గ‌మ‌నార్హం. నోటిఫికేషన్ ప్రకారం, 20 సంవత్సరాల పైబ‌డిన పాత మోటార్‌సైకిళ్లకు, రిజిస్ట్రేష‌న్ చార్జీని రూ.1,000 నుండి రూ.2,000కి పెంచ‌గా, త్రీ వీలర్లు మరియు నాలుగు చ‌క్రాల వాహ‌నాల‌కు రిజిస్ట్రేష‌న్ చార్జిని రూ.3,500 నుండి రూ.5,000కి ఖరారు చేసింది.

ఇంపొర్టెడ్ వాహ‌నాల‌కు..20 సంవత్స‌రాల పైబ‌డిన‌ దిగుమతి చేసుకున్న ద్విచక్ర , త్రిచక్ర వాహనాల రిజిస్ట్రేషన్  ఖర్చు రూ. 20,000 గా ఖ‌రారు చేశారు. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చక్రాలు కలిగిన దిగుమతి చేసుకున్న వాహనాలకు రూ. 80,000గా రిజిస్ట్రేష‌న్ చార్జిని నిర్ణ‌యించారు. ఈ సవరణ ముసాయిదాను ఫిబ్రవరిలో జారీ చేసి ఆగస్టు 21న తాజాగా వెల్ల‌డించారు.  నిజానికి కేంద్రం  అక్టోబర్ 2021లో, మోటార్ సైకిళ్ళు, త్రిచక్ర వాహనాలు మరియు కార్ల రిజిస్ట్రేషన్ , పునరుద్ధరణ రుసుమును పెంచింది. 

కోర్టు స్టే..ఇక పాత వాహ‌నాల వాడ‌కంపై స్ట్రిక్టుగా ఉన్న ఢిల్లీ ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు కాస్త బ్రేకులు వేసింది. ఈ నెల ప్రారంభంలో, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో 10 సంవత్సరాల కంటే పైబ‌డిన‌ డీజిల్ వాహనాలు ,15 సంవత్సరాల కంటే పైబ‌డిన‌ పాత పెట్రోల్ వాహనాల యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. వాహనాలకు లైఫ్ టాక్స్ అమలు చేస్తున్నప్పుడు వాటి తయారీ సంవత్సరాన్ని మాత్రమే కాకుండా వాస్తవ వినియోగాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం కోర్టును కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఏదేమైనా పాత వాహ‌నాలను మ‌ళ్లీ వాడాలంటే జేబుకు చిల్లు ప‌డ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రోవైపు కేంద్ర నిర్ణ‌యంతో పాత వాహ‌నాల వాడ‌కం త‌గ్గి, కాలుష్యానికి కాస్త చెక్ ప‌డుతుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు.