టొయోటా గ్లాంజా, హైరైడర్ సీఎన్‌జీ కార్లతో సీఎన్‌జీ రంగంలో కూడా అడుగుపెట్టింది. గ్లాంజా సీఎన్‌జీ వేరియంట్ ఎస్, జీ గ్రేడ్స్ అందుబాటులో ఉండనుంది. దీంతోపాటు అర్బన్ క్రూజర్ హైరైడర్ కూడా సీఎన్‌జీ వేరియంట్లో మార్కెట్లో అందుబాటులో ఉంది. గ్లాంజ్ కేజీ ఫ్యూయల్‌కు 30.61 కిలోమీటర్లు, హైరైడర్ 26.1 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనున్నాయి.
టొయోటా గ్లాంజా జీ గ్రేడ్ ధర రూ.8.43 లక్షల నుంచి, ఎస్ గ్రేడ్ రూ.9.46 లక్షల నుంచి ప్రారంభం కానుంది. టొయోటా హైరైడర్ సీఎన్‌జీ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. ఎస్‌యూవీల్లో మొదటి సీఎన్‌జీ కారు హైరైడర్ సీఎన్‌జీనే కానుంది.
టొయోటా హైరైడర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ హైబ్రిడ్ వెర్షన్ ధరను కంపెనీ సెప్టెంబర్‌లో అధికారికంగా ప్రకటించింది. ఎంట్రీ లెవల్ ఎస్-ట్రిమ్ ధర రూ.15.11 లక్షలుగా ఉంది. అదే ప్రారంభ ధర. ఇక టాప్ ఎండ్ వీ ట్రిమ్ ధరను రూ.18.99 లక్షలుగా నిర్ణయించారు. ఇక జీ వేరియంట్ ధరను రూ.17.49 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.
ఈ హైబ్రిడ్ అర్బన్ క్రూజర్ హైరైడర్ 27.97 కిలోమీటర్ల మైలేజీని అందించనుందని కంపెనీ ప్రకటించింది. ఇందులో ఎలక్ట్రిక్ మోడ్ కూడా అందించారు. దీంతోపాటు హైరైడర్ మరో ఇంజిన్ ఆప్షన్ కూడా అందించారు. ఇది 1.5కే సిరీస్ పెట్రోల్ మోడల్. టొయోటా ఇందులో టాప్ ఎండ్ వీ ఆటోమేటిక్ ధరను రూ.17.09 లక్షలుగా నిర్ణయించింది. ఏడబ్ల్యూడీ సిస్టం, మాన్యువల్ గేర్ బాక్స్ ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి.
మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకోవడానికి హైరైడర్ ధరను వీలైనంత రీజనబుల్‌గానే నిర్ణయించారు. ఈ కారు అద్భుతమైన మైలేజ్‌ను అందించనుంది. టాప్ ఎండ్ హైరైడర్ మోడల్లో హెడ్స్ అప్ డిస్‌ప్లే, 360 డిగ్రీ వ్యూ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. 9 అంగుళాల టచ్ స్క్రీన్ కూడా అందించారు. రూ.20 లక్షల్లోపు బెస్ట్ కార్ల లిస్ట్ తీస్తే ఇది కూడా కచ్చితంగా ఉండనుంది.
టొయోటా మనదేశంలో కొత్త అర్బన్ క్రూజర్‌ను జులైలో మనదేశంలో లాంచ్ చేసింది. అదే టొయోటా హైరైడర్. ఇది ఒక సెల్ఫ్ చార్జింగ్ ఎలక్ట్రిక్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టం ఉన్న కారు. ఈ విభాగంలో లాంచ్ అయిన మొట్టమొదటి పూర్తిస్థాయి హైబ్రిడ్ కారు ఇదే. ఇందులో 1.5 లీటర్ కే-సిరీస్ ఇంజిన్‌ను అందించారు. ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ కూడా ఇందులో ఉంది. ఈ ఇంజిన్ పవర్ అవుట్‌పుట్ 100 హెచ్‌పీ కాగా, పీక్ టార్క్ 135 ఎన్ఎంగా ఉంది. ఇంజిన్, హైబ్రిడ్ మోటార్ పవర్‌ను కలిపినపుడు దీని పవర్ అవుట్‌పుట్ 113 హెచ్‌పీగా ఉండనుంది.
ఈ విభాగంలో ఆల్ వీల్ డ్రైవ్ ఫీచర్ ఉన్న మొదటి కారు టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడరే. ఇందులో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లు అందించారు. ఇదే హైబ్రిడ్ టెక్నాలజీ టొయోటా హైఎండ్ ప్రొడక్ట్స్ అయిన కామీ, వెల్‌ఫైర్‌ల్లో కూడా ఉంది.
యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ చార్జర్, తొమ్మిది అంగుళాల ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం, వెంటిలేటెడ్ డ్యూయల్ టోన్ సీట్ల వంటి ప్రీమియం ఫీచర్లను టొయోటా ఇందులో అందించింది. ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, డీసెంట్, ఆల్ వీల్ డిస్కులు వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఏడు మోనోటోన్ కలర్ ఆప్షన్లు, నాలుగు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో ఈ కారును కొనుగోలు చేయవచ్చు.