ప్రారంభ ధర రూ. 18.30 లక్షలు
దిగ్గజ వాహన తయారీ సంస్థ టయోటా సరికొత్త కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఇన్నోవా హైక్రాస్’ పేరుతో మొత్తంగా 5 వేరియెంట్స్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇన్నోవా హైక్రాస్ G, GX, VX, ZX, ZX(O) వేరియంట్స్ పరిచయం చేసింది. కారు ప్రారంభ ధర రూ. 18.30 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 28.97 లక్షలుగా నిర్ణయించింది. ఇందులో సెల్ఫ్ చార్జింగ్ హై బ్రిడ్ వర్షన్ ధర వేరియంట్ ను బట్టి రూ. 24 లక్షల నుంచి 28.97 లక్షల వరకు ఉంది. సాధారణ వర్షన్ ధర వేరియంట్ ను బట్టి రూ. 18.30 లక్షల నుంచి 19.20 లక్షల వరకు ఉంటుంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయి. కొనుగోలు చేయాలి అనుకునే వాళ్లు రూ. 50 వేలు చెల్లించి ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి రెండో వారం నుంచి డీలర్ల దగ్గర అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఇన్నోవా క్రిష్టాను విక్రయిస్తున్న టయోటా, ఇప్పుడు హైక్రాస్ ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. హైక్రాస్ టాప్ ఎండ్ వేరియంట్ ధర ఇన్నోవా క్రిస్టా డీజిల్ వేరియంట్ ధర కంటే దాదాపు రూ. 2 లక్షలు ఎక్కువగా ఉంది.
ఆకట్టుకునే డిజైన్
ఈ కొత్త హైక్రాస్ అదిరిపోయే డిజైన్ తో పాటు లేటెస్ట్ ఫీచర్స్ ను కలిగి ఉంది. చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. హైక్రాస్ హెక్సా గోనల్ గ్రిల్ మధ్యలో బ్రాండ్ లోగోను కలిగి ఉంటుంది.ఇంటి గ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో పాటు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్, రియర్ బంపర్లను కలిగి ఉంది. సైడ్ ప్రొఫైల్ లో 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ కనిపిస్తాయి. బ్యాక్ సైడ్ స్పోర్ట్స్ ర్యాప్ రౌండ్ టెయిల్ లైట్ తో పాటు ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ను కలిగి ఉంది.
అత్యాధునిక ఫీచర్లు
సరికొత్త హైక్రాస్ ఇంటీరిర్ డ్యూయెల్ టోన్ థీమ్ ను కలిగి ఉండటం మూలంగా ప్రీమియం ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే 10.1 అంగుళాల ఫ్లోటింగ్ ట చ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటోతో పాటు ఆపిల్ కార్ ప్లేకు సపోర్టు చేస్తోంది. సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ 4.2 అంగుళాల MID స్క్రీన్ తో ఉంటుంది. కారుకు సంబంధించిన అన్ని వివరాలను అందుబాటులో ఉంచుతుంది. మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 9 స్పీకర్స్ ఆడియో సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ సహా పలు ఫీచర్లను కలిగి ఉంటుంది. పనోరమిక్ సన్ రూఫ్ ఫీచర్ ను కూడా కలిగి ఉంది. సీటింగ్ విషయానికి వస్తే హైక్రాస్ 7 సీట్లు, 8 సీట్లలో అందుబాటులో ఉంది. 7 సీట్స్ కారులో మధ్య వరుస కోసం సెగ్మెంట్ ఫస్ట్ ఒట్టోమన్ ఫంక్షన్‌తో రెండు కెప్టెన్ సీట్స్ ఉంటాయి. 8 సీట్స్ కారులో రెండు, మూడు వరుసల్లో బెంచ్ సీట్లు పొందుతుంది.
అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లు
సేఫ్టీ ఫీచర్స్ చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాయి. ADAS టెక్నాలజీ అందుబాటులో ఉంది. డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ లాంటి అత్యాధునిక ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు 6 ఎయిర్ బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం లాంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
ఇంజిన్ ప్రత్యేకతలు
ఇక ఇంజిన్ విషయానికి వస్తే పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్ రకాలు ఉన్నాయి. డీజిల్ ఇంజిన్ ఆప్షన్ లేదు. ఇందులో స్టాండర్డ్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 172 బిహెచ్‌పి పవర్, 205 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇక 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్ 150 బిహెచ్‌పి, 87 బిహెచ్‌పి పవర్ ను అందిస్తుంది. సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ 111 బిహెచ్‌పి, 205 ఎన్ఎమ్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తోంది. పవర్ అవుట్ పుట్ 184 బిహెచ్‌పికి పరిమితం చేయబడి ఉంటుంది. ఇది కేవలం 9.5 సెకన్లలో 0-100 కిమీ వేగాన్ని అందుకుంటుంది.
ఏ కార్లతో పోటీ అంటే?
ఈ లేటెస్ట్ హైక్రాస్ ప్రస్తుతం భారత మార్కెట్లో ఉన్న మహీంద్రా XUV700, టాటా సఫారీ లాంటి కార్లతో పోటీ పడనుంది. అమ్మకాల పరంగానూ గట్టిపోటీని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
Read Also: 2022లో భారత మార్కెట్లో విడుదలైన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!