ఇండియన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ కొత్తపుంతలు తొక్కుతోంది. 2022లో పలు తయారీ సంస్థలు తమ ఆల్-టైమ్ సేల్స్ రికార్డును బద్దలు కొట్టాయి. చిన్న కార్లు, SUVలే కాదు, లగ్జరీ, పోర్షే లాంటి స్పోర్ట్స్ కార్ల తయారీదారులు కూడా అత్యుత్తమ అమ్మకాలు కొనసాగించారు. కార్ల తయారీ కంపెనీలు ఈ జోరును 2023లో కొనసాగించాలనుకుంటున్నాయి. వచ్చే ఏడాది ఇండియన్ ఆటో ఎక్స్‌ పో షెడ్యూల్‌ తో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించే కొత్త కార్ల సంఖ్య 2022 కంటే ఎక్కువగానే ఉండబోతోంది. 2023లో రూ. 5-10 లక్షలతో అందుబాటులోకి వచ్చే టాప్ కార్ల గురించి ఇప్పుడు చూద్దాం..   


2023 హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్


హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యుందాయ్ ఇండియా నుండి వచ్చిన చిన్న హ్యాచ్‌బ్యాక్. అంతేకాదు, అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌ బ్యాక్‌లలో ఒకటి. రాబోయే కారుకు సంబంధించి ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ అంచనా ప్రారంభ ధర రూ. 6 లక్షలు.


2023 మారుతి సుజుకి స్విఫ్ట్


మారుతి సుజుకి స్విఫ్ట్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.  భారతీయ మార్కెట్లో  థర్డ్ జెనెరేషన్ వెర్షన్ కొనసాగుతోంది.  స్విఫ్ట్ తాజా వెర్షన్ కారు ఇండియన్ ఆటో ఎక్స్‌పో 2018లో ప్రారంభించబడింది.  ఇండియన్ ఆటో ఎక్స్‌పో 2023లో స్విఫ్ట్ కొత్త తరం లేదంటే ఫేస్‌ లిఫ్ట్‌ ను పరిచయం చేయాలని చూస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 6 లక్షలు ఉండే అవకాశం ఉంది. 


హ్యుందాయ్ మైక్రో SUV


హ్యుందాయ్ ఇండియా, టాటా పంచ్ వంటి వాటితో పోటీగా  మైక్రో SUVని ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది.  మైక్రో SUV హ్యాచ్‌బ్యాక్‌కు మెరుగైన ప్రత్యామ్నాయంగా ఉండవచ్చు. టెస్ట్ మ్యూల్  రూపాన్ని బట్టి, ఈ మైక్రో SUV అంతర్జాతీయంగా విక్రయించబడిన హ్యుందాయ్ క్యాస్పర్ వెర్షన్ గా కనిపిస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 6.5 లక్షలుగా అంచనా వేయబడింది.


సిట్రోయెన్ eC3


సిట్రోయెన్ తన రెండవ కారును ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసింది. ఎలక్ట్రిక్ వెర్షన్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేయవలసి ఉంది. కానీ, ఈ ఈవెంట్‌ను షెడ్యూల్ చేశారు. కాబట్టి,  C3 ఎలక్ట్రిక్ వెర్షన్ 2023లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  Citroen eC3 భారతీయ మార్కెట్లో టాటా టియాగో EV వంటి వాటితో పోటీపడుతుంది. eC3 ధర రూ. 10 లక్షలలోపు ఉండే అవకాశం ఉంది.


హోండా సబ్-4M SUV


2022లో హోండా చక్కటి దూకుడును కనబర్చింది. 2023లో భారత మార్కెట్లో సబ్-4M SUVని పరిచయం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. హోండా సబ్-4ఎమ్ ఎస్‌యూవీ ధర దాదాపు రూ. 8 లక్షల వరకు ఉండవచ్చు.


హోండా బ్రయో


భారతీయ కార్ల మార్కెట్లో ప్రస్తుతం 40 శాతం SUVలు, 40 శాతం హ్యాచ్‌బ్యాక్‌లు ఉన్నాయి. కాబట్టి, చిన్న హ్యాచ్‌బ్యాక్‌ను ప్రవేశపెట్టడం వల్ల భారత మార్కెట్లో హోండాకు మళ్లీ లాభం కలిగే అవకాశం ఉంటుంది. కంపెనీ ఇప్పటికే ఒక SUVని ప్లాన్ చేస్తున్నందున, హ్యాచ్‌బ్యాక్‌తో జత కడితే మరింత ఆదరణ దక్కవచ్చు. హోండా బ్రియో భారత మార్కెట్లోకి అడుగు పెడితే అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధర రూ. 5 లక్షలుగా అంచనా వేయబడింది.


సియాజ్ ఆధారిత టయోటా బెల్టా సెడాన్


టయోటా,మారుతి సుజుకి మధ్య ఒప్పందంలో భాగంగా వారు తమ ఉత్పత్తి టెక్నాలజీ,  ప్లాట్‌ ఫారమ్‌లు,  పవర్‌ ట్రెయిన్‌లు సహా పలు అంశాలను పంచుకుంటున్నాయి.  టయోటా అంతర్జాతీయ మార్కెట్ కోసం మారుతి సుజుకి సియాజ్ ఆధారంగా సెడాన్‌ను అభివృద్ధి చేసింది. దానికి టయోటా బెల్టా అని పేరు పెట్టింది. తేలికపాటి, బలమైన హైబ్రిడ్ టెక్నాలజీతో టయోటా బీటా సెడాన్‌ను 2023లో దేశీయ మార్కెట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధర రూ. 9 లక్షలుగా అంచనా వేయబడింది.


Read Also: మీరు విమానాశ్రయాల దగ్గర నివసిస్తున్నారా? ఇప్పట్లో 5Gని పొందలేరు, ఎందుకో తెలుసా?