Nitin Gadkari Announcement On Toll Fee Reduction India: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, వెహికల్‌ ఓనర్లకు గుడ్‌ న్యూస్‌ చెబుతూ ఒక సెన్సేషనల్‌ అనౌన్స్‌మెంట్‌ చేశారు. టోల్‌ ఫీజ్‌ కేవలం 15 రూపాయలు మాత్రమే వసూలు చేస్తారని ప్రకటించారు. ఈ రోజు (మంగళవారం, సెప్టెంబర్ 16, 2025), ABP రీషేపింగ్ ఇండియా కాన్‌క్లేవ్‌ (ABP Reshaping India Conclave) లో కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి పాల్గొన్నారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నుండి ఎలక్ట్రిక్ వాహనాల వరకు చాలా ముఖ్యమైన విషయాల గురించి నితిన్ గడ్కరీ మాట్లాడారు. ఈ సందర్భంగా టోల్‌ రుసుముల గురించి కూడా ప్రస్తావించారు. టోల్‌ ఫీజ్‌ రూ. 150-200 కు బదులుగా కేవలం రూ. 15 మాత్రమే వసూలు చేస్తారని, ఇది సామాన్యులకు & దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.         

ఆటో పరిశ్రమ అత్యధిక GST చెల్లిస్తోంది- నితిన్ గడ్కరీదేశంలో, లేదా ఏదైనా రాష్ట్రంలో ఎవరైనా అత్యధిక జీఎస్టీ చెల్లిస్తున్నారు అంటే, అది ఆటోమొబైల్ పరిశ్రమేనని నితిన్ గడ్కరీ అన్నారు. పెట్రోల్ కంటే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 15 శాతం ఎక్కువగా అమ్ముడవుతున్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. దీనివల్ల, క్రమంగా కాలుష్యం కూడా సున్నాకి తగ్గుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ & పెట్రోల్ - డీజిల్ కార్ల ధరలు దాదాపు ఒకే విధంగా ఉంటాయని వివరించారు. అంటే, పెట్రోల్‌-డీజిల్‌ రేట్ల స్థాయికి ఎలక్ట్రిక్ కార్ల రేట్లు దిగొస్తాయని హింట్‌ ఇచ్చారు.​​​​​​​

రోడ్డు ప్రమాదాల గురించి గడ్కరీ ఏం చెప్పారంటే..?రోడ్డు ప్రమాదాలకు సంబంధించి అనేక అంశాలపై దృష్టి సారించామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కార్లకు ఇప్పుడు రెండు & నాలుగు ఎయిర్‌ బ్యాగ్‌లకు బదులుగా ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు వస్తున్నాయని గడ్కరీ అన్నారు. బైక్‌ & స్కూటర్‌ రైడర్ల గురించి కూడా కేంద్ర మంత్రి మాట్లాడారు. బైకులు, స్కూటర్లు నడుపుతున్న ప్రజలు హెల్మెట్ ధరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బైక్ కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు హెల్మెట్‌లు తీసుకోవడం ఇప్పుడు తప్పనిసరి చేశామని వివరించారు. హెల్మెంట్‌ ధరించకపోతే విధించే జరిమానా కూడా పెంచినట్లు చెప్పారు. ప్రజలు రెడ్ లైట్‌ పడినప్పుడు ఆగడం లేదన్న నితిన్ గడ్కరీ, ప్రజలకు సరైన అవగాహన వచ్చే వరకు ఈ సమస్య ఉంటుందన్నారు.​​​​​​​​​​​​​​​​​​​​       

రోడ్డు భద్రత ప్రచారంలో ప్రతి ఒక్కరూ సాయం చేయడం ముఖ్యమని నితిన్ గడ్కరీ పిలుపున్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలను ఆపలేకపోయామని అంగీకరించిన కేంద్ర మంత్రి, ప్రజల్లో అవగాహన పెరగకపోతే ప్రభుత్వం ఏం చేయగలదని అన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు నితిన్ గడ్కరీ చెప్పారు.