Affordable Cars With Cruise Control 2025: కొంతకాలం క్రితం వరకు, క్రూజ్ కంట్రోల్ అంటే కేవలం లగ్జరీ కార్లకే పరిమితం అన్న భావన ఉండేది. 10 లక్షల రూపాయల పైగా ఉండే కార్లలో మాత్రమే ఈ ఫీచర్‌ కనిపించేది. ఇప్పుడు ఆ సీన్‌ మారిపోయింది. యువత ఎక్కువగా కోరుకునే ఈ ఫీచర్‌ను ఇప్పుడు రూ. 10 లక్షల లోపు హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు, SUVలు కూడా ఆఫర్‌ చేస్తున్నాయి. హైవేపై ఎక్కువ డ్రైవ్‌ చేసే వారికి క్రూజ్ కంట్రోల్ నిజంగా బిగ్ రిలీఫ్‌. ఎందుకంటే మీరు ఒక స్పీడ్‌ సెట్‌ చేసి పెట్టుకుంటే, యాక్సిలేటర్‌పై కాలు ఉంచాల్సిన పని ఉండదు. మీరు సెట్‌ చేసిన వేగంతో కారు ప్రయాణిస్తుంది. ఫ్రెండ్స్‌తో లాంగ్ డ్రైవ్‌కి వెళ్తే ఈ ఫీచర్‌ మీకు చాలా కంఫర్ట్‌ ఇస్తుంది.

క్రూజ్ కంట్రోల్‌తో ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న 5 చౌకైన కార్లు:

1. Tata Tiago - ₹7.40 లక్షల నుంచి

ఈ లిస్ట్‌లో నంబర్ వన్‌గా నిలిచింది టాటా టియాగో. టాప్‌-స్పెక్‌ XZ+ వేరియంట్‌లోనే క్రూజ్ కంట్రోల్ ఫీచర్‌ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ధర రూ. 7.40 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి మొదలవుతుంది. 86hp 1.2 లీటర్‌ పెట్రోల్ ఇంజిన్‌, 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. చిన్న హ్యాచ్‌బ్యాక్ అయినా, క్రూజ్ కంట్రోల్ ఫీచర్‌తో బిగ్ కంఫర్ట్ ఇస్తోంది.

2. Hyundai Grand i10 Nios - ₹7.42 లక్షల నుంచి

హ్యుందాయ్ లైనప్‌లోనే చౌకైన కారు ఇది. మిడ్‌-స్పెక్‌ స్పోర్ట్జ్‌ వేరియంట్ నుంచి క్రూజ్ కంట్రోల్ వస్తుంది. ఏపీ & తెలంగాణలో ధర రూ. 7.42 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). 83hp 1.2 లీటర్‌ పెట్రోల్ ఇంజిన్‌తో 5-స్పీడ్ మాన్యువల్, AMT ఆప్షన్లు ఉంటాయి. రూ. 7.99 లక్షలకు వచ్చే AMT స్పోర్ట్జ్ వేరియంట్, ఇప్పుడు మార్కెట్లో అత్యంత చౌకైన ఆటోమేటిక్ క్రూజ్ కంట్రోల్‌ కారు. డ్యూయల్‌-టోన్ వేరియంట్‌ కోసం రూ. 19,000 అదనంగా చెల్లించాలి.

3. Tata Altroz - ₹7.69 లక్షల నుంచి

ప్రేమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌లో, బేస్ స్మార్ట్ వేరియంట్ మినహా మిగిలిన అన్ని వేరియంట్స్‌లో క్రూజ్ కంట్రోల్ దొరుకుతుంది. దీనిలో 88hp పెట్రోల్, 90hp డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. AMT, మాన్యువల్, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ అన్ని ఆప్షన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. అందుకే ఈ లిస్ట్‌లో వేరియంట్‌ల పరంగా ఆల్ట్రోజ్ నెంబర్ వన్.

4. Tata Tigor - ₹8.00 లక్షల నుంచి

సెడాన్ సెగ్మెంట్‌లో చౌకైన కారు టాటా టిగోర్. XZ+, XZ+ Lux, XZA+ వేరియంట్స్‌లో క్రూజ్ కంట్రోల్ వస్తుంది. తెలుగు నగరాల్లో దీని ధర రూ. 8.00 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి మొదలవుతుంది. 86hp 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో AMT, మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

5. Hyundai Exter - ₹8.21 లక్షల నుంచి

హ్యుందాయ్ లైనప్‌లోని చిన్న SUV అయిన ఎక్స్‌టర్ కూడా SX స్మార్ట్ వేరియంట్ నుంచి క్రూజ్ కంట్రోల్ అందిస్తోంది. ధర రూ. 8.21 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది. 83hp పెట్రోల్ ఇంజిన్‌తో AMT, మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఆప్షన్స్‌ను కంపెనీ అందిస్తోంది. డ్యూయల్‌-టోన్ వేరియంట్స్‌ ధర కొంచెం ఎక్కువ, రూ. 19,000 అదనంగా చెల్లించాలి.

తక్కువ బడ్జెట్‌లో క్రూజ్ కంట్రోల్ ఫీచర్ కావాలంటే టాటా టియాగో బెస్ట్ ఆప్షన్‌. హ్యుందాయ్, టాటా రెండు కంపెనీలు ఈ సెగ్మెంట్‌లో కాంపిటీషన్ పెంచాయి. హ్యాచ్‌బ్యాక్ కావాలన్నా, సెడాన్ కావాలన్నా లేక SUV కావాలన్నా - ఇప్పుడు ఏ బడ్జెట్‌లోనైనా క్రూజ్ కంట్రోల్ దొరుకుతుంది.