Most Popular Bikes Among Taxi Aggregators: గత కొంతకాలంగా మోటార్ సైకిల్స్ ఎంతో మారిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో 100 సీసీ నుంచి 2000 సీసీ వరకు ఎన్నో ఇంజిన్ కెపాసిటీలతో కొత్త బైకులు అందుబాటులో ఉన్నాయి. అలాగే మార్కెట్లో బైక్ ట్యాక్సీలు కూడా మంచి ఇన్‌కమ్ సోర్సులుగా మారాయి. అయితే వీటి కోసం బైకులను ఉపయోగించే వారు ఎక్కువగా 100 నుంచి 200 సీసీ బైక్స్‌నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటిలో బెస్ట్ మోడల్స్ ఏవి? బైక్ ట్యాక్సీలు నడిపేవారు ఏవి వాడుతున్నారో ఇప్పుడు చూద్దాం.
1. హీరో స్ప్లెండర్ (Hero Splendor)
ఈ బిజినెస్‌లో టాప్‌లో ఉండే కార్లలో హీరో స్ప్లెండర్ టాప్‌లో ఉంటుందని అనుకోవచ్చు. హీరో స్ప్లెండర్ లాంచ్ అయినప్పటి నుంచి చూసుకున్నా ఈ బైక్‌లో చాలా మార్పులు వచ్చాయి. లీటరుకు ఏకంగా 80.6 కిలోమీటర్ల మైలేజీని అందించడం దీని స్పెషాలిటీ. ప్రస్తుతం వస్తున్న మోడల్‌లో డిజిటల్ స్పీడోమీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్/ఎస్ఎంఎస్ అలెర్ట్స్ కూడా ఉండనున్నాయి.
2. బజాజ్ ప్లాటినా 100 (Bajaj Platina 100)
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల్లో ఇది కూడా ఒకటి. బజాజ్ ప్లాటినా ఎక్స్-షోరూం ధర రూ.65,856గా ఉంది. 100 సీసీ డీటీఎస్-ఐ ఇంజిన్‌ను ఈ బైకులో అందించారు. ఏకంగా లీటరుకు 100 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించడం దీని స్పెషాలిటీ. ఇది కంఫర్టబుల్ రైడ్‌ను కూడా అందిస్తుంది.
3. టీవీఎస్ రెయిడర్ (TVS Raider 125)
స్ప్లెండర్, ప్లాటినాలతో పోలిస్తే టీవీఎస్ రెయిడర్ కొంచెం ప్రీమియం మోడల్ అని చెప్పవచ్చు. పైన తెలిపిన రెండు బైక్‌లతో పోలిస్తే ఫీచర్లు కూడా అధికంగా ఉన్నాయి. ఎల్ఈడీ హెడ్‌లైట్స్, బ్యాక్‌లిట్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, రైడ్ మోడ్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ఇంజిన్ కూడా పెద్దది. ఎక్కువ పవర్‌ను కూడా అందించనుంది.
4. టీవీఎస్ అపాచీ (TVS Apache)
ఇది ఒక స్పోర్టీ కమ్యూటర్ బైక్. ప్రత్యేకించి ఆర్‌టీఆర్ 160 2వీ మోడల్‌లో మరింత లేటెస్ట్ టెక్నాలజీని అందించారు. ఇందులో 159.7 సీసీ ఇంజిన్‌ను అందిస్తున్నారు. 15.82 బీహెచ్‌పీ, 13.85 ఎన్ఎం టార్క్‌ను ఈ బైక్ అందించనుంది. ఇందులోనే మరింత పవర్‌ఫుల్ వెర్షన్ 160 ఆర్‌టీఆర్ 4వీ కూడా అందుబాటులో ఉంది.
5. బజాజ్ పల్సర్ (Bajaj Pulsar)
బజాజ్ పల్సర్ మార్కెట్లో చాలా పాపులర్ పేరు. టీవీఎస్ అపాచీ తరహాలోనే ఇందులో కూడా వేర్వేరు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. పల్సర్ 150 బైక్ ఎప్పట్నుంచో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇందులో 125 సీసీ మోడల్‌ను కూడా తీసుకువచ్చారు. ఇటీవల లాంచ్ అయిన పల్సర్ పీ150, ఎన్160 ఇంతకు ముందు తరం మోడల్స్ కంటే కొంచెం ఖరీదైనవి. వీటిలో పీ150 మోడల్ ధర రూ.1.2 లక్షలు కాగా, ఎన్160 మోడల్ ధర రూ.1,29,645గా ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూం ధరలే.
6. హోండా యాక్టివా (Honda Activa)
ఈ లిస్ట్‌లో ఉన్న ఒకే ఒక్క స్కూటీ హోండా యాక్టివా. ప్రస్తుతం మన దేశంలో ఎక్కువగా అమ్ముడు పోతున్న ద్విచక్ర వాహనాల్లో ఇది కూడా ఒకటి. దీని సమర్థవంతమైన ఇంజిన్ కారణంగా ఈ స్కూటీని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్కూటీలను నడపడం చాలా సులభం. అందువల్ల హోండా యాక్టివాకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది.
7. బజాజ్ ఎక్స్‌సీడీ (Bajaj XCD)
బజాజ్ ఎక్స్‌సీడీ కూడా మనదేశంలో చాలా పాపులర్ మోడల్. దీని బరువు చాలా తక్కువ. 125 సీసీ ఇంజిన్ ఇందులో ఉండనుంది. ఇది 9.4 బీహెచ్‌పీ, 11.5 ఎన్ఎం టార్క్‌ను అందించనుంది.
8. హీరో గ్లామర్ (Hero Glamour)
టీవీఎస్ రెయిడర్‌తో హీరో గ్లామర్ పోటీ పడుతోంది. అయితే ఇందులో కొంచెం ఫీచర్లు తక్కువ ఉండనున్నాయి. అలాగే ధర కూడా రెయిడర్ కంటే తక్కువే. ఇది లీటర్ పెట్రోలుకు 55 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది.
9. హోండా షైన్ (Honda Shine)
ఈ లిస్ట్‌లో ఉన్న మరో హోండా బైక్ ఇది. దీని ఎక్స్-షోరూం ధర రూ.78,687గా ఉంది. ఇది లీటరుకు 65 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది. ఎక్కువ దూరం ట్రావెల్ చేయడానికి కూడా ఇది సహకరిస్తుంది. కాబట్టి బైక్ ట్యాక్సీ ఓనర్లకు బెస్ట్ ఆప్షన్.