Tesla Y in India: టెస్లా ఎప్పుడొస్తుంది.. ఇండియన్ రోడ్లపై ఆ కార్లు ఎప్పుడు దూసుకెళతాయని లగ్జరీ కార్ల ఔత్సాహికులంతా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్‌ అందుబాటులో ఉంటే టెస్లాను సొంతం చేసుకోవాలని కోరుకునే వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ తరుణం దాదాపు వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో వాణిజ్య పరంగా టెస్లా వాహనాలు ఇండియన్ రోడ్లపై తిరగనున్నాయి.  టెస్లా మోడల్ Y  ధర సుమారు ₹50 లక్షల నుంచి ₹60 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ప్రైస్ రేంజ్ లో ఇది తమ డైరెక్ట్ కాంపిటీటర్ అయిన  BYD సీలియన్ 7, BMW iX1 వంటి లగ్జరీ ఎలక్ట్రిక్ SUVలతో పోటీ పడనుంది.

 సరికొత్త డిజైన్, అద్భుతమైన పనితీరు

టెస్లా మోడల్ Y అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాళ్ల బెస్ట్ సెల్లర్. అయితే ఇండియాలో దానికి అప్డేటెడ్ వెర్షన్‌ తీసుకొస్తున్నారు. టెస్లా మోడల్ Y కేవలం ఒక అప్‌డేట్ కాదు, ఇది పూర్తిగా కొత్తగా రూపొందిన వాహనంలా అనిపిస్తుంది. దీని డిజైన్‌లో ముందుభాగంలో ఒకే LED స్ట్రిప్ లైట్‌తో సరికొత్త లుక్‌ వస్తుంది. వీల్స్, సస్పెన్షన్, టైర్లలో చేసిన మార్పులు వల్ల ఈ కొత్త టెస్లా లుక్ పూర్తిగా మారిపోతుంది

 500 కి.మీ. రేంజ్‌తో లాంగ్ రేంజ్ AWD వేరియంట్

భారత్‌లో లాంగ్ రేంజ్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్‌ని పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ వేరియంట్ 19 ఇంచ్ వీల్స్‌తో ఒక్కసారి ఛార్జ్‌తో 500 కి.మీ. పైగా రేంజ్ ఇస్తుంది. అంతేకాదు, కేవలం 4.3 సెకన్లలో 0-100 కి.మీ./గం వేగాన్ని అందుకునే ఈ వెహికల్.. వేగంగా దూసుకెళ్లాలనుకునే వారిని కూడా ఆకట్టుకుంటుంది.

.ఇంటీరియర్‌లో టాప్. లోపల చూస్తే మతిపోవలసిందే

 దాదాపు 50లక్షల పైన కాస్ట్ ఉండే కార్లకు ఇంటీరియర్ అంటే ఓ రేంజ్‌లో ఉండాల్సిందే. అంత రేట్ పెట్టి కొన్నాక ఆ మాత్రం ఫీచర్స్ ఇచ్చి తీరాలి. ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న హై ఎండ్ కార్లన్నింటిలోనూ అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. వాటికి గట్టిపోటీ ఇచ్చేలా టెస్లా తన ఇంటీరియర్‌ను తీసుకొస్తోంది.  డ్రైవర్, ఫ్రంట్ ప్యాసెంజర్ కోసం 15.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, ఇది నావిగేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, వెహికిల్ కంట్రోల్ సిస్టమ్‌లను కస్టమర్‌లకు అత్యంత సౌలభ్యంగా అందిస్తుంది. రియర్ ప్యాసెంజర్ల కోసం కూడా  ప్రత్యేక టచ్‌స్క్రీన్ కూడా ఉంది. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా. ఎంత లాంగ్ జర్నీ అయినా కూడా చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది.  లగ్జరీ ప్రీమియం సీట్లు, టాప్ క్వాలిటీ సౌండ్ సిస్టమ్ ఎలాగూ ఉన్నాయి. ఇవి కాకుండా టెస్లా సిగ్నేచర్ ఫీచర్స్ లాంటి ఆటోపైలట్, ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, అధునాతన డ్రైవర్-అసిస్టెన్స్ టెక్నాలజీలు ఈ వాహనాన్ని తన క్లాస్‌లో టాప్ రేంజ్‌లో నిలుపుతాయి.

టెస్లా ధర  ₹50 లక్షల నుంచి ₹60 లక్షల వరకు

భారత్‌లో మోడల్ Y ధర వేరియంట్, ఫీచర్స్ ఆధారంగా మారవచ్చు. బేస్ మోడల్ ₹50 లక్షల నుంచి ప్రారంభం కాగా, పూర్తి ఫీచర్స్‌తో కూడిన టాప్-ఎండ్ వేరియంట్ ₹60 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఈ ధరలు భారత్‌లోని భారీ దిగుమతి సుంకాలను కలిపితే మరింత పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ, భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న EV మార్కెట్‌ని గెలుచుకోవడానికి టెస్లా పోటీ ధరల వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది.

 పోటీదారులతో సమరం: BMW iX1, BYD సీలియన్ 7

మోడల్ Y ని ఇండియాలో తయారు చేయడం లేదు.  ప్రస్తుతానికి దిగుమతి చేసుకోవలసిందే. అయినా, ఈ ధరల వద్ద ఇది BMW iX1, BYD సీలియన్ 7 వంటి బలమైన పోటీదారులతో తలపడనుంది. Tesla  బ్రాండ్ వాల్యూ,  టెక్నాలజీ ఆధారిత ఫీచర్స్ వల్ల ఈ పోటీలో ఇదే పైచేయిగా ఉంటుందని భావిస్తున్నారు.  

 భారత మార్కెట్‌లో Tesla గేమ్ చేంజర్

ఇప్పటికే కొన్ని టెస్లాలు ఇండియన్ రోడ్లపై ఉన్నాయి. వీటిని యుఎస్‌ నుంచి భారీ సుంకాలతో దిగుమతి చేసుకుని కొంతమంది నడుపుతున్నారు. టెస్లా అధికారికంగా తమ ఔట్‌లెట్‌లను ప్రారంభించలేదు. ఇప్పుడు నేరుగా టెస్లానే ఇక్కడ విక్రయిస్తుండటంతో మార్కెట్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి ఉంది.

మోడల్ Y రాకతో భారత్‌లో టెస్లా అధికారికంగా ప్రవేశించనుంది. భారత్‌లో సస్టైనబుల్ మొబిలిటీకి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌తో టెస్లా ఈ మార్కెట్‌పై దృష్టి సారించింది. అత్యాధునిక టెక్నాలజీ, అసాధారణ పనితీరు, పర్యావరణ అనుకూల ఫీచర్స్‌తో ఈ SUV భారత మార్కెట్‌లో గేమ్-ఛేంజర్‌గా నిలవనుంది. రెగ్యులేటరీ అడ్డంకులు, దిగుమతి సవాళ్లను దాటుకుని టెస్లా ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ SUVని ఎలా ధర నిర్ణయిస్తుంది, ఎలా పొజిషన్ చేస్తుందనేది ఆసక్తికరంగా ఉంది. EV ఔత్సాహికులు, లగ్జరీ కార్  లవర్స్ ఈ గ్రాండ్ ఎంట్రీ కోసం చూస్తున్నారు.