Elon Musk Visit India: టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ త్వరలో భారతదేశాన్ని సందర్శించబోతున్నారు. ఎలాన్ మస్క్ స్వయంగా తన ఎక్స్/ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని పోస్టు చేశారు. ఎలాన్ మస్క్ చేసిన ఈ ప్రకటనతో ఆయన భారత పర్యటన, ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. టెస్లా సీఈవో తన పర్యటన సందర్భంగా కంపెనీ ఎలక్ట్రిక్ కారును భారత్‌లోకి లాంచ్ చేయడం గురించి కూడా ప్రకటన చేయవచ్చు. టెస్లా కార్లను ఇష్టపడే వారు ఇప్పుడు 'మేక్ ఇన్ ఇండియా' టెస్లా కోసం ఎదురుచూస్తున్నారు.


టెస్లా కారు ధర ఎంత?
ప్రపంచవ్యాప్తంగా టెస్లా వాహనాల ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో మోడల్ 3 బేస్ వేరియంట్ ధర 40,000 డాలర్ల (సుమారు రూ. 33.5 లక్షలు) కంటే ఎక్కువగానే ఉంది. అదే సమయంలో టెస్లా మోడల్‌లో కొన్ని మార్పులతో కాస్త తక్కువ ధరలో దీనిని భారత మార్కెట్లో విడుదల చేయవచ్చు. ఎలాన్ మస్క్ మొట్టమొదటి భారతదేశ పర్యటన సందర్భంగా టెస్లా నుంచి ఇలాంటి ఒక ముఖ్యమైన ప్రకటన కోసం కారు లవర్స్ కచ్చితంగా ఎదురు చూస్తున్నారు.


టెస్లా ధర ఎలా తగ్గుతుంది?
మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్‌లోని సీనియర్ విశ్లేషకుడు సౌమెన్ మండల్ తెలుపుతున్న దాని ప్రకారం... భారతదేశంలో టెస్లా తన తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసినప్పుడు అది కారు దిగుమతి సుంకాన్ని తొలగిస్తుంది. అలాగే గ్లోబల్ మార్కెట్‌తో పోలిస్తే కాస్త తక్కువ ఫీచర్లతో ఈ కారును ఇండియాకు తీసుకురావచ్చు. టెస్లా ఈవీలో ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (FSD) మోడ్‌ను తొలగించవచ్చు. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) లెవల్ 2ని చేర్చవచ్చు. దీని కారణంగా కారు ధరలో గణనీయమైన తగ్గింపు ఉండవచ్చు. ఈ విషయాలు ఇంకా కన్ఫర్మ్ కానప్పటికీ ఇదే జరగవచ్చని చాలా మంది భావిస్తున్నారు.


టెస్లా కారు ధర ఎంత? రేంజ్ ఎలా ఉంటుంది?
టెస్లా భారతదేశంలో ఈవీ ఉత్పత్తిని రూ. 20 లక్షల ధరతో ప్రారంభించవచ్చు. కార్ల తయారీ కంపెనీలు భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయగలవు. టెస్లా ఈ కారులో 50 వేల వాట్ల కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీ ప్యాక్‌ను అందించగలదు. అదే సమయంలో గ్లోబల్ మార్కెట్‌లో లభించే కార్లతో పోలిస్తే తక్కువ పవర్‌తో కూడిన ఎలక్ట్రిక్ మోటారును కూడా కారులో అందించవచ్చు.


భారత ప్రభుత్వ కొత్త ఈవీ విధానం
ప్రధాన నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గత నెలలో దేశంలో కొత్త ఈవీ విధానాన్ని ప్రకటించింది. దీని కింద ప్రభుత్వం ఇంపోర్టెడ్ కార్లపై కస్టమ్స్ సుంకాన్ని 100 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. అయితే దీనికి కొన్ని షరతులను విధించింది. అలాగే మనదేశంలో ఈవీ ఉత్పత్తిని స్థాపించడానికి, కనీసం రూ.4,150 కోట్ల పెట్టుబడి (సుమారు 500 మిలియన్ డాలర్లు) అవసరం అవుతుంది. ఇండస్ట్రీ నిపుణుల అభిప్రాయం ప్రకారం టెస్లా 2030 నాటికి కేవలం భారతదేశంలోనే కనీసం 3.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించగలదు.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!