Telangana New Vehicle Registration Charges Hike: తెలంగాణ రాష్ట్రంలో కొత్త కారు లేదా కొత్త బైక్ కొనాలంటే మీరు మరింత ఎక్కువ డబ్బు చెల్లించాలి. తెలంగాణ రవాణా శాఖ, వాహనదారులపై కొత్త భారం మోపింది. కొత్తగా కొనుగోలు చేసే కార్లు, బైక్‌లపై లైఫ్ ట్యాక్స్ శ్లాబులను మార్చింది. ఖరీదైన వాహనాలపైనా టాక్స్ శాతాలు పెంచింది. అలాగే, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు మార్చుకునే పాత వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా పెరిగాయి. ఫ్యాన్సీ (స్పెషల్) నంబర్ల ఫీజులను కూడా తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ విడిచిపెట్టలేదు, భారీ పెంచింది. ఈ మార్పులు ప్రస్తుతం ప్రిలిమినరీ నోటిఫికేషన్ రూపంలో జారీ అయ్యాయి, త్వరలో అమల్లోకి రానున్నాయి.
నాలుగు చక్రాల వాహనాలపై లైఫ్ ట్యాక్స్‌కామన్ మ్యాన్‌కు ఊరట ఏమిటంటే, ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల లోపు ఉన్న కార్లకు అదనపు భారం ఉండదు. ఎక్స్-షోరూమ్ రేటు రూ. 10 లక్షలు దాటితే 1% అదనపు లైఫ్ ట్యాక్స్ విధిస్తారు. రూ. 20 లక్షలు దాటితే 2%, రూ. 50 లక్షలు దాటితే 3% వరకు అదనంగా చెల్లించాలి. కంపెనీలు, సంస్థలకు చెందిన 10 సీట్ల లోపు వాహనాల కూడా ట్యాక్స్ పెంచారు. రూ. 20-50 లక్షల మధ్య ఉన్న వాహనాలకు 22%, రూ. 50 లక్షలకు పైగా ఉన్న వాటికి 25% లైఫ్ ట్యాక్స్ వర్తిస్తుంది.
ద్వి చక్రాల వాహనాలపై లైఫ్ ట్యాక్స్‌చిన్న టూవీలర్ల విషయంలోనూ సర్కారు కనికరం చూపింది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 1 లక్షలోపు ఉన్న బైక్‌లపై అదనపు భారం లేదు, ప్రస్తుత రేట్లే వర్తిస్తాయి. అయితే.. బైక్ ఎక్స్-షోరూమ్ రేటు రూ. 1 లక్ష దాటితే 3%, రూ. 2 లక్షలు దాటితే 6% లైఫ్ ట్యాక్స్ పెరుగుతుంది. ఉదాహరణకు, రూ. 1.10 లక్షల విలువైన బైక్ కోసం ఇంతకు ముందు రూ. 13,200 ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. కొత్త రేట్ల ప్రకారం ఇది మరో రూ.3,300 పెరిగి రూ. 16,500 అవుతుంది.
పాత వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులుఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై కొంతకాలం తర్వాత తెలంగాణకు మారే వాహనాలపై కూడా భారం పెరిగింది. వాహనం విలువ ఆధారంగా 1% నుంచి 6% వరకు అదనపు రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేస్తారు.
ఫ్యాన్సీ నంబర్ల ఫీజులుతెలంగాణ ప్రభుత్వం, ఫ్యాన్సీ నంబర్ల ఫీజుల్లో భారీగా పెంచింది. ఇంతకుముందు 5 శ్లాబులు (రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు & రూ.5 వేలు) ఉండగా, ఇప్పుడు 7 శ్లాబులుగా (రూ.1.50 లక్షలు, రూ.1 లక్ష, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు & రూ.6 వేలు) విస్తరించారు. “9999” వంటి నంబర్లకు ఇప్పుడు కనీసం రూ. 50,000 చెల్లించాల్సి ఉండగా, ఇకపై కనీసం రూ. 1.50 లక్షలు కోట్ చేయాలి. “1” లేదా “9” వంటి నంబర్లకు రూ. 1 లక్ష, ఇతర ప్రీమియం నంబర్లకు రూ. 50,000 నుంచి రూ. 6,000 వరకు రేట్లు నిర్దేశించారు.
వాహన యజమానులపై ప్రభావంఈ కొత్త రేట్లు అమలులోకి వస్తే, రూ. 1 లక్ష లోపు (ఎక్స్-షోరూమ్) బైక్‌లు, రూ. 10 లక్షల లోపు (ఎక్స్-షోరూమ్) కార్లను కొనేవాళ్లపై కొత్తగా ఎలాంటి భారం పడదు. దీనికి మించి ఖరీదైన కార్లు, బైక్‌లు కొనుగోలు చేసే వారిపై గణనీయమైన భారం పడుతుంది. ఫ్యాన్సీ నంబర్ల రేట్లు పెరగడం వల్ల, ప్రత్యేక నంబర్లకు డిమాండ్ ఉన్నవారు కచ్చితంగా మరింత ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాత వాహనాలను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే వారు కూడా అదనపు రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
తెలంగాణ రవాణా శాఖ, ఈ నిర్ణయాలను వాహనాల విలువ పెరుగుదల, వాహన మార్కెట్‌లో మార్పులు, ఆదాయం పెంపు అవసరం దృష్ట్యా తీసుకుంది.