టాటా మోటార్స్ మనదేశంలో ఈ నెల 11వ తేదీన కొత్త కారు లాంచ్ చేయనున్నట్లు గతంలోనే ప్రకటించింది. అయితే ఆ కారు ఏదో ఇంతవరకు తెలియరాలేదు. ఇప్పుడు టాటా ఆ సస్పెన్స్‌కు తెరదించింది. నెక్సాన్‌లోనే ఫ్లాగ్ షిప్ వేరియంట్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. దానికి నెక్సాన్ ఈవీ మ్యాక్స్ అని పేరు పెట్టింది.

Continues below advertisement


ఇందులో 40 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అందించనున్నారు. ఇది మరింత పవర్‌ను అందించనుంది. అయితే పవర్ కంటే మెరుగైన విషయం ఏంటంటే... కారు రేంజ్ పెరగనుంది. నెక్సాన్ ఈవీ స్టాండర్డ్ వేరియంట్ 312 కిలోమీటర్ల రేంజ్‌ను మాత్రమే అందించనుండగా... మ్యాక్స్ మాత్రం ఏకంగా 400 కిలోమీటర్ల రేంజ్ అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.


దీంతోపాటు స్టాండర్డ్ వేరియంట్ కంటే డిజైన్ పరమైన మార్పులు కూడా చేయనుంది. వెనకవైపు డిస్క్ బ్రేకులు, వెంటిలేటెడ్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫయర్ వంటి కొత్త ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి. ప్రీమియం ఎలక్ట్రానిక్ వాహనాల్లో అందించే ఫీచర్లు కూడా ఈ కారులో అందించనున్నారు.


దీని ధర రూ.19 లక్షల రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. అప్పుడు ఇది ఎంజీ జెడ్ఎస్ ఈవీతో పోటీ పడనుంది. ప్రస్తుతం ఇందులో టాప్ ఎండ్ ట్రిమ్ వేరియంట్ ధర రూ.25 లక్షలకు పైనే ఉంది. కొత్త జెడ్ఎస్ ఈవీ 461 కిలోమీటర్ల రేంజ్‌లో ఉండనుంది.


నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలను ఇష్టపడే వినియోగదారులు టార్గెట్‌గా లాంచ్ కానుంది. త్వరలో నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌కు సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు స్టాండర్డ్ వెర్షన్‌ను కూడా విక్రయించనున్నారు. త్వరలో దీని గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.