ANU Mega Job Mela : నిరుద్యోగులకు అండగా నిలబడేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో మూడో జాబ్ మేళా నిర్వహింస్తున్నామని ప్రకటించారు. తిరుపతి, విశాఖ జాబ్ మేళాలో 30,407 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. నాగార్జున వర్సిటీ జాబ్ మేళాలో 210 కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. 97 వేల మంది నిరుద్యోగులు ఇప్పటికే రిజిష్ట్రేషన్ చేసుకున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. వివిధ కంపెనీలలో 26,289 ఖాళీలు ఉన్నాయని, ఈ జాబ్ మేళాలో ఆ ఖాళీలు భర్తీ చేస్తా్మన్నారు. ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్, కనస్ట్రక్షన్స్ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయన్నారు.
జాబ్ రాని వారికి శిక్షణ
నిరుద్యోగులకు ఇబ్బంది లేకుండా యూనివర్సిటీ ముందు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశామని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ప్రతి బ్లాక్ లో రిసెప్షన్ ఉంటుందని, ఉచితంగా ఆహారం, మంచినీరు అభ్యర్థులకు అందిస్తామన్నారు. వైసీపీ ట్రేడ్ యూనియన్ ద్వారా 800 మందికి సహకారం అందిస్తున్నామని తెలిపారు. జాబ్ మేళా నిరంతర ప్రక్రియ అని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తుంటామని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఉద్యోగం దక్కని అభ్యర్థులకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి వారిని వచ్చే జాబ్ మేళాకు సిద్ధం చేస్తాన్నారు.
"రాజకీయలకు అతీతంగా జాబ్ మేళాలు నిర్వహిస్తాం. మొక్కుబడి కార్యక్రమంగా కాకుండా నిరుద్యోగులకు ఉపయోగపడేలా చేస్తున్నాం. జాబ్ మేళాలో ఉద్యోగం వచ్చిన వారికి స్థాయిని బట్టి 15 వేల నుంచి లక్ష రూపాయల వరకు జీతం ఉంటుంది" అని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.
మే 7, 8 తేదీల్లో జాబ్ మేళా
ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మెగా జాబ్‌మేళాలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన నిరుద్యోగుల కోసం మే 7, 8 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 175కిపైగా కంపెనీలు, సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు, పరిశ్రమలు, తయారీ రంగ కంపెనీలు, ఉత్పత్తి సంస్థలు జాబ్ మేళాలో భాగస్వాములు అవుతున్నాయి. ఏఎన్‌యూ వేదికగా 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని నిర్వహకులు అంటున్నారు. నెలకు కనీసం రూ.14 వేల వేతనం నుంచి సంవత్సరానికి రూ.12.5 లక్షల ప్యాకేజీ వరకు ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.