Nexon EV Price Cut: టాటా మోటార్స్‌లో ఈవీ కారు కొందామనే యోచనలో ఉన్నారా? ముఖ్యంగా నెక్సాన్ ఈవీ లేదా పంచ్ ఈవీ కొనుగోలు చేద్దామని అనుకుంటున్నారా? అయితే, మీకో శుభవార్త. ఈ రెండు మోడళ్ల ధరలను టాటా మోటార్స్ భారీగా తగ్గించింది. దాదాపు టాటాలోని ఐసీఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) మోడల్స్ ధరలకు చేరువ చేసింది. రాబోయే పండుగ సీజన్ కోసం ఈ రెండు మోడళ్లపై టాటా మోటర్స్ ఏకంగా రూ.3 లక్షల దాకా తగ్గింపు ఇస్తోంది. అంతేకాక, టాటా పవర్ ఛార్జింగ్ స్టేషన్లలో ఆరు నెలలు ఫ్రీ ఛార్జింగ్ వెసులుబాటును కూడా అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం అయిన ఫేమ్ (FAME) ద్వారా ప్రోత్సహకాలు తగ్గడంతో కాస్త వెనకబడ్డ ఈవీ అమ్మకాలు.. ఈ ధరల తగ్గింపుతో పుంజుకుంటాయని భావిస్తున్నారు.
పంచ్ ఈవీ లాంచ్ అయినప్పుడు ప్రారంభ వేరియంట్ ధరనే రూ.11 లక్షల నుంచి అని నిర్ణయించారు. ఇప్పుడు దాని ప్రారంభ ధర రూ.10 లక్షల కన్నా తక్కువకే రానుంది. అటు నెక్సాన్ కూడా రూ.12.49 లక్షల నుంచే మొదలు కానుంది. నెక్సాన్ లో టాప్ ఎండ్ రూ.16.2 లక్షలు కాగా అందులో భారీగా తగ్గింపు వర్తించనుంది. ఫలితంగా ఈవీ ధరలు దాదాపుగా పెట్రోల్, డీజిల్ కార్ల రేంజ్ చేరువకు వచ్చాయి.
ఐసీఈలో నెక్సాన్ ధర రూ.8 నుంచి 15.8 లక్షల మధ్య ఉంది. అయితే వీటి టాప్ ఎండ్ వేరియంట్‌లు ఈవీ ధరలకు సమానం కానున్నాయి. ఇక పంచ్ ఐసీఈ అయితే ఇప్పటికీ చౌకగా ఉంది పెట్రోల్ పంచ్‌కు ప్రారంభ ధర రూ.6.13 లక్షలు కాగా.. టాప్ ఎండ్ రూ.10 లక్షలుగా ఉంది. పెట్రోల్ కార్లతో పోలిస్తే ఈవీలు తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఉంటాయి. ప్రతిరోజూ ఉపయోగించేవారికి ప్రతి కిలో మీటర్ కి అతి తక్కువ ఖర్చు ఈవీ ద్వారా సాధ్యపడుతుంది.
పైగా పెట్రోల్ కార్లతో పోలిస్తే, ఈవీలు నడపడానికి చాలా స్మూత్‌గా, సున్నితంగా ఉంటాయి. అంటే అవి నగరంలో తిరిగేవారికి చాలా అనుకూలమైనవి. ఏదేమైనప్పటికీ ఛార్జింగ్ వంటి మౌలిక సదుపాయాలు ఇప్పటికీ ఒక సమస్యగా మిగిలిపోయింది. కొంత వరకు రీసేల్ విలువతో పాటు రేంజ్ పరంగా సుదూర డ్రైవింగ్ కూడా ఈవీల ద్వారా సాధ్యం అవుతోంది. దీంతో ఈవీలను సిటీలో ఉపయోగించినట్లయితే ఇంట్లో ఛార్జ్ చేయడం ద్వారా చాలా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి, అలాంటి వారికి ఈ రెండు ఈవీలు చౌకగా ఉండటం వల్ల సిటీ వినియోగానికి కన్సిడర్ చేయవచ్చు. ఈ ఆఫర్ అక్టోబరు 31 వరకు అమలవుతుందని కంపెనీ తెలిపింది.