Tata Motors: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల (CV) వినియోగదారులకు షాక్ ఇచ్చింది. తన పోర్ట్‌ఫోలియోలోని అన్ని రకాల కమర్షియల్ వాహనాల ధరలను సవరించాలని నిర్ణయించింది. ఈ కొత్త ధరలు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం వాహనాల ధర గరిష్టంగా 1.5 శాతం వరకు పెరగనుంది. పరిశ్రమపై ప్రభావం చూపుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, కమోడిటీ ధరల పెరుగుదలను అరికట్టే లక్ష్యంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రతి మోడల్, వేరియంట్ ఆధారంగా ధరల పెంపు భిన్నంగా ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. అన్ని వాహనాలపై ఒకే రకమైన పెంపు కాకుండా, క్యాలిబ్రేటెడ్ విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపింది. గత కొన్ని నెలలుగా పెరుగుతున్న ముడిసరుకు ధరలు, ఇతర ఉత్పత్తి వ్యయాల భారంతో ఈ నిర్ణయం తప్పనిసరైందని సంస్థ పేర్కొంది. తయారీదారులు ఇంతకాలం ఈ అదనపు భారాన్ని భరిస్తూ వచ్చినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో కొంత భాగాన్ని కస్టమర్లపైకి బదిలీ చేయక తప్పడం లేదని వివరించింది. ముఖ్యంగా మెటల్ ధరలలో అస్థిరత, లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ మార్జిన్‌లపై ఒత్తిడి పెరుగుతోంది.
అదే బాటలో ఇతర కంపెనీలు..
కేవలం టాటా మోటార్స్ మాత్రమే కాకుండా, ఆటోమొబైల్ రంగంలోని ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల, కరెన్సీ హెచ్చుతగ్గుల కారణంగా ఏప్రిల్ 2026 నుండి ఆడి, మెర్సిడెస్ వంటి సంస్థలు కూడా తమ వాహనాల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు ఇప్పటికే ధృవీకరించాయి. ధరల పెరుగుదల ఉన్నప్పటికీ, టాటా మోటార్స్ తన వాణిజ్య వాహన విభాగంలో వృద్ధి, ఆవిష్కరణలపై దృష్టి సారిస్తోంది.
భారీగా పెట్టుబడులు..
సాంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల వంటి ప్రత్యామ్నాయ ఇంధన విభాగాలను బలోపేతం చేయడానికి సంస్థ భారీగా పెట్టుబడులు పెడుతోంది. పట్టణ రవాణా, లాస్ట్-మైల్ లాజిస్టిక్స్ కోసం అధునాతన వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. వీటితో పాటు కనెక్టెడ్ వెహికల్ టెక్నాలజీస్, ఫ్లీట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. దీనివల్ల కస్టమర్లకు నిర్వహణ ఖర్చులు తగ్గి, పనితీరు మెరుగుపడుతుందని కంపెనీ భావిస్తోంది. ఏప్రిల్ 1 నుండి న్యూ ఫైనాన్షియల్ స్టార్ట్ కానున్న నేపథ్యంలో , మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ధరలను రేషనలైజ్ చేస్తోంది. సాంకేతిక పురోగతి, కస్టమర్ సర్వీస్ ఇనిషియేటివ్స్‌ను కొనసాగిస్తూనే పెరుగుతున్న ఖర్చులను స్టెబిలైజ్ చేయడం ఈ వ్యూహంలో ప్రధాన భాగమని విశ్లేషకులు అంటున్నారు.
