Tata vehicles with Honda badge: భారత ఆటోమొబైల్ రంగంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశీయ దిగ్గజ సంస్థ టాటా గ్రూప్‌తో అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీలు భాగస్వామ్యానికి ఆసక్తి చూపుతున్నాయి. ముఖ్యంగా హోండా, హ్యుందాయ్ సంస్థలు టాటా గ్రూప్‌తో చేతులు కలపాలని భావిస్తున్నాయి. వాహనాల తయారీ, ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాల్లో సహకార అవకాశాలపై చర్చలు జరిపినట్లు సమాచారం.
ఈ చర్చల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం.. టాటా అభివృద్ధి చేసిన కార్లను హోండా తన బ్రాండ్ పేరుతో భారత్‌లో విక్రయించే అవకాశం. అంటే కారు తయారీ, ప్లాట్‌ఫామ్ టాటాదైనా.. దానిపై హోండా బ్యాడ్జ్ ఉండే అవకాశం ఉందన్నమాట. అయితే, దీనిపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదు. ఏ మోడల్‌ను సరఫరా చేయాలి, తయారీ విధానం ఎలా ఉండాలి, ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
హోండాతో టాటా చర్చలు ఎక్కడివరకు వచ్చాయి?
2025లో, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ జపాన్‌లో హోండా సీనియర్ యాజమాన్యాన్ని కలిశారు. ఈ సమావేశంలో హోండా మోటార్ కంపెనీ ప్రెసిడెంట్ తోషిహిరో మిబే, తోషియుకి యనగిసావా పాల్గొన్నట్లు సమాచారం. యనగిసావా గతంలో హోండా ఇండియా స్ట్రాటజిక్ డెవలప్మెంట్ ఆఫీస్‌కు నాయకత్వం వహించారు. 2026 అక్టోబర్ 1న హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్ & సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.
హోండా చర్చలు కేవలం టాటా మోటార్స్‌కే పరిమితం కాలేదు. టాటా ఆటోకాంప్, బ్యాటరీ తయారీ సంస్థ అగ్రటాస్, టాటా టెక్నాలజీస్, TCS, టాటా ఎలక్సీ వంటి సంస్థలతోనూ వివిధ రంగాల్లో సహకార అవకాశాలను పరిశీలించినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా TCS, టాటా టెక్నాలజీస్‌తో చర్చలు మరింత ముందుకు వెళ్లినట్లు సమాచారం. టాటా మోటార్స్‌తో మాత్రం చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో సరికొత్త రవాణా వ్యవస్థ.. డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు రాబోతున్నాయ్!
హోండాకు ఎందుకు ఉపయోగం?
జపాన్, ఉత్తర అమెరికాతో పాటు భారత్‌ను కూడా కీలక వృద్ధి మార్కెట్‌గా హోండా గుర్తించింది. భారత్ కోసం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని డిజైన్ చేస్తోంది. దీనిని 2028లో లాంచ్ చేయాలని భావిస్తోంది.
ఇప్పటికే అభివృద్ధి చేసిన టాటా వాహనం లేదా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుంటే హోండాకు కొత్త మోడళ్ల అభివృద్ధి ఖర్చు తగ్గే అవకాశం ఉంది. అంతేకాదు, కొత్త కార్లను మార్కెట్లోకి వేగంగా తీసుకురావచ్చు. మరోవైపు, టాటా మోటార్స్‌కు అదనపు వాహనాల విక్రయాల ద్వారా ఇంజినీరింగ్‌పై పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకునే అవకాశం ఉంటుంది.
అయితే, టాటా తన సొంత మోడళ్ల ఉత్పత్తిని కూడా పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హోండాకు ఎంత ఉత్పత్తి సామర్థ్యాన్ని కేటాయించగలదన్నది ఒప్పందంలో కీలక అంశం కానుంది. ఈ చర్చలపై స్పందించేందుకు హోండా కార్స్ ఇండియా నిరాకరించింది. ఊహాగానాలపై వ్యాఖ్యానించడం తమ విధానం కాదని తెలిపింది.
1985లోనే టాటా-హోండా ప్రయత్నం
టాటా, హోండా సంస్థల మధ్య కార్ల తయారీ భాగస్వామ్య ప్రయత్నాలు కొత్తవేమీ కావు. 1985లోనే ఈ రెండు సంస్థలు కలిసి కార్ల తయారీ ప్రాజెక్టును చేపట్టాలని ప్రయత్నించాయి. ఆ ఏడాది జులై 10న హోండా ప్రెసిడెంట్ తదాషి కుమే, TELCO తరఫున సుమంత్ మూల్గావ్కర్ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు టాటా సెంట్రల్ ఆర్కైవ్స్ రికార్డులు చెబుతున్నాయి. అయితే, ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ టాటా అభివృద్ధి చేసిన కారును హోండా తన బ్రాండ్ పేరుతో విక్రయించే అంశంపై చర్చలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: కారు ప్రయాణంలో టైర్ పంక్చర్ అయితే ఏది ఆదుకుంటుంది? స్పేస్ సేవర్ వీల్, రిపేర్ కిట్ మధ్య అసలు తేడాలివే!
హ్యుందాయ్తోనూ భాగస్వామ్య అవకాశాలు
హోండాతో పాటు హ్యుందాయ్ మోటార్ గ్రూప్ కూడా టాటా గ్రూప్‌తో వ్యాపార సహకార అవకాశాలను పరిశీలిస్తోంది. హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ప్రెసిడెంట్ & సీఈఓ జోస్ మునోజ్ ముంబైలోని చంద్రశేఖరన్ కార్యాలయానికి వెళ్లారు. ఇది మర్యాదపూర్వక భేటీగా జరిగినప్పటికీ, వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చి ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
భారత్‌లో స్థానిక భాగస్వాములను గుర్తించి, ప్రత్యేక పెట్టుబడి సంస్థను ఏర్పాటు చేయాలని హ్యుందాయ్ భావిస్తోంది. టాటా గ్రూప్‌నకు వాహన తయారీ నుంచి విడిభాగాలు, బ్యాటరీలు, ఇంజినీరింగ్, సాఫ్ట్వేర్, డిజిటల్ సేవల వరకు విస్తృతమైన వ్యాపార సామర్థ్యాలు ఉన్నాయి. ఇవి హ్యుందాయ్‌కు కూడా ఉపయోగపడే అవకాశముంది.
జీప్తో ఇప్పటికే ఖరారైన టెక్నాలజీ ఒప్పందం
హోండా, హ్యుందాయ్ చర్చలు ఇంకా ప్రాథమిక దశలో ఉండగా.. జీప్ బ్రాండ్‌కు చెందిన స్టెల్లాంటిస్ మాత్రం టాటాతో వాహనాలు, టెక్నాలజీ భాగస్వామ్యంపై ఖరారు చేసిన ఒప్పందాన్ని ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో స్టెల్లాంటిస్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థలు వాహన టెక్నాలజీ & ఉత్పత్తి అభివృద్ధికి సంబంధించి తుది ఒప్పందం చేసుకున్నాయి.
టాటా సియెర్రా ARGOS ఆర్కిటెక్చర్ ఆధారంగా కొత్త జీప్ SUVని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ భాగస్వామ్యంలో తొలి వాహనం 2028లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
