PRTS Network In Hyderabad: బాగా అభివృద్ధి చెందిన సిటీల తరహాలో, హైదరాబాద్‌లోనూ డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలను మనం చూసే అవకాశం ఉంది. మహానగరంలో 35 కిలోమీటర్ల పొడవైన 'పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్' (Personal Rapid Transit System - PRTS) ఏర్పాటు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ వ్యవస్థను పాడ్ ట్యాక్సీల పేరుతోనూ పిలుస్తారు. తొలి దశలో కూకట్‌పల్లి నుంచి నాలెడ్జ్ సిటీ వరకు రాయదుర్గం, బయోడైవర్సిటీ పార్క్ మీదుగా ఈ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ మార్గంలో మొత్తం 64 స్టేషన్లు ప్రతిపాదించారు.

Continues below advertisement

బుధవారం, ఈ ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమక్షంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.

2050 నాటికి రోజుకు 10 లక్షల మంది ప్రయాణికులు?

Continues below advertisement

హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు PRTSతో పాటు ఇతర రవాణా వ్యవస్థల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశారు. నగరంలో ప్రజా రవాణా అవసరాలు రాబోయే సంవత్సరాల్లో భారీగా పెరుగుతాయని అంచనా వేశారు. వారి అంచనాల ప్రకారం 2030 నాటికి రోజువారీ ప్రయాణికుల సంఖ్య 3.94 లక్షలకు చేరవచ్చు. 2040 నాటికి ఈ సంఖ్య 7.96 లక్షలకు, 2050 నాటికి 10 లక్షలకు చేరే అవకాశం ఉందని అధికారులు ప్రజెంటేషన్‌లో వివరించారు.

పాడ్ ట్యాక్సీలు ఎందుకు?

పాడ్‌ టాక్సీ వ్యవస్థ.. మెట్రోకు అనుబంధంగా పని చేస్తుంది. ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న ప్రజలు.. ట్రైన్‌ దిగిన తర్వాత ఆయా స్టేషన్ల నుంచి ఆఫీస్‌ లేదా ఇంటికి వెళ్లడానికి మళ్లీ ట్రాఫిక్‌ కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా పాడ్ ట్యాక్సీల ప్రతిపాదన తెచ్చారు. అంటే, మెట్రో స్టేషన్‌ దిగిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా గమ్యస్థానం చేరడానికి పాడ్‌ టాక్సీలను ఉపయోగించుకోవచ్చు.

ఇది కూడా చదవండి: కారు ప్రయాణంలో టైర్ పంక్చర్ అయితే ఏది ఆదుకుంటుంది? స్పేస్ సేవర్ వీల్, రిపేర్ కిట్ మధ్య అసలు తేడాలివే!

పాడ్ ట్యాక్సీలు ఎలా పనిచేస్తాయి?

PRTSలో పాడ్ ట్యాక్సీలు ప్రయాణించేందుకు ప్రత్యేక ట్రాక్‌లు ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ ప్రతిపాదనలో, మెట్రో తరహాలోనే పాడ్ ట్యాక్సీల కోసం కూడా ఎలివేటెడ్ ట్రాక్‌ల నిర్మాణానికి అధికారులు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అంటే రోడ్లపై కాకుండా ఎత్తుగా నిర్మించిన మార్గాలపై ఈ వాహనాలు రాకపోకలు సాగిస్తాయి.

ఈ పాడ్ ట్యాక్సీలకు డ్రైవర్లు ఉండరు. మెట్రో రైలు తరహాలోనే కేంద్రీకృత కంట్రోల్ వ్యవస్థ ద్వారా ఆటోమేటిక్‌గా నడుస్తాయి. చిన్న కారు ఆకారంలో ఉండే ఒక్కో పాడ్‌లో నలుగురు నుంచి ఆరుగురు ప్రయాణించవచ్చు. అవసరాన్ని బట్టి ఒకేసారి 15 నుంచి 20 మంది ప్రయాణించేలా గ్రూప్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (GRT) వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రయాణికులు పాడ్‌లోకి ఎక్కిన తర్వాత అందులోని టచ్‌ప్యాడ్ ద్వారా తమ గమ్యస్థానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఆ ఆదేశం ప్రకారం వాహనం ప్రయాణిస్తుంది.

కాలుష్యం తగ్గించే రవాణా వ్యవస్థ?

పాడ్ ట్యాక్సీలు బ్యాటరీతో నడుస్తాయి. అందువల్ల ప్రయాణ సమయంలో నేరుగా కాలుష్య ఉద్గారాలు ఉండవు. గంటకు 35 నుంచి 44 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవని అందుబాటులో ఉన్న వివరాలను బట్టి తెలుస్తోంది. మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలోని ఐటీ పార్కులు, కార్యాలయాలు, నివాస ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడే అవకాశం ఉంది. మెట్రో దిగిన తర్వాత గమ్యస్థానానికి ‍‌(ఇల్లు, ఆఫీస్‌ వంటివి) చేరుకోవడానికి ఎదురయ్యే చివరి దశ ప్రయాణ సమస్యకు పాడ్ ట్యాక్సీలు ప్రత్యామ్నాయంగా నిలవొచ్చు.

ఇది కూడా చదవండి: Tata Sierra EV: సేఫ్టీలో సత్తా చాటిన టాటా సియెర్రా ఈవీ: పెద్దలు, పిల్లల రక్షణ పరీక్షల్లో బెస్ట్ స్కోర్లు సొంతం

మూడు మార్గాల్లోనూ పాడ్ ట్యాక్సీల ప్రతిపాదన

హైదరాబాద్‌లో PRTS ఏర్పాటుపై రూపొందించిన ప్రణాళికలో.. కూకట్‌పల్లి-బయోడైవర్సిటీ, ఎల్బీ స్టేడియం-రాణిగంజ్, అసెంబ్లీ-బేగంపేట మార్గాలను కూడా పరిశీలించినట్లు సంబంధిత వివరాల్లో పేర్కొన్నారు. ఈ మార్గాల్లో ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ కోసం డిసెంబర్ నాటికి టెండర్ల దశను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైల్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అయితే 35 కిలోమీటర్ల తొలి దశలో కూకట్‌పల్లి నుంచి నాలెడ్జ్ సిటీ వరకు 64 స్టేషన్లతో కూడిన ప్రతిపాదన ప్రస్తుతం అధికారుల పరిశీలనలో ఉంది.

ప్రపంచంలో ఎనిమిది రకాల సాంకేతికతలు

ప్రపంచంలోని కొన్ని నగరాల్లో వివిధ రకాల గైడ్‌వేలు, స్టేషన్ల డిజైన్లతో PRTS సేవలు అందుబాటులో ఉన్నాయి. భూమిపై నిర్మించిన ట్రాక్‌లతో పాటు, కేబుల్స్ ద్వారా గాల్లో ప్రయాణించే వాహనాలు, ఎత్తైన (ఎలివేటెడ్) ట్రాక్‌లపై నడిచే పాడ్‌లు వంటి ఎనిమిది రకాల సాంకేతికతలు ఉన్నాయి.

ప్రస్తుతం, ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC)లో 8.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ PRTS ప్రాజెక్టును చేపట్టారు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.