Cyclone Akvan Moves Towards Odisha Relief for AP:   ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రజలకు వాతావరణ శాఖ , విపత్తు నిర్వహణ సంస్థ భారీ ఊరటనిచ్చే వార్తను ప్రకటించాయి. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా కొనసాగుతున్న  అక్వాన్ తన దిశను మార్చుకుని ఒడిశా వైపు పయనిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌కు పెనుముప్పు తప్పినట్లయింది. ఉప ఉష్ణమండల అధిక పీడన  ప్రభావం వల్ల తుపాను గమనంలో ఈ కీలక మార్పు చోటుచేసుకుందని వాతావరణ శాఖ నిపుణులు స్పష్టం చేశారు. ఇటీవల వరుస తుపాన్ల భయంతో ఆందోళన చెందుతున్న కోస్తాంధ్ర ప్రజలు, ముఖ్యంగా అన్నదాతలు ఈ తాజా పరిణామంతో ఊపిరి పీల్చుకున్నారు.

Continues below advertisement

ఆర్టీజీఎస్ ,  ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ  విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం  , పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అక్వాన్ తీవ్ర తుపాను గత 6 గంటల్లో గంటకు కేవలం 5 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతోంది. ప్రస్తుతానికి ఇది ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురానికి 470 కిలోమీటర్లు, కళింగపట్నంకు 490 కిలోమీటర్లు, చెన్నైకి 570 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే సమయంలో ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 580 కిలోమీటర్లు, పూరీకి 640 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, ఈ తీవ్ర తుపాను నవంబర్ 20 మధ్యాహ్నానికి నరసాపురం – పూరీ మధ్య తీరాలను దాటే అవకాశం ఉంది. తుపాను ఒడిశా తీరం వైపు మళ్లినందున దాని తీవ్రత ఏపీపై గణనీయంగా తగ్గింది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.  

Continues below advertisement

తుపాను నేరుగా ఏపీ తీరాన్ని తాకనప్పటికీ, దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై కొంతమేర ఉండనుంది. ముఖ్యంగా నేడు, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో  తెలిపారు. అలాగే, తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఎలాంటి అజాగ్రత్తకు తావివ్వకుండా అప్రమత్తంగా ఉండాలని  సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని కఠిన ఆదేశాలు జారీ చేశారు. వరి కోతల సమయం కావడంతో వర్ష సూచన ఉన్న ఉత్తరాంధ్ర రైతులు తమ పంటలను రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు.