Access 125 Vs Activa 125 Comparison: భారత్‌లో 125సీసీ స్కూటర్‌ సెగ్మెంట్‌ ఎప్పటినుంచో చాలా హాట్‌గా ఉంది. రోజువారీ ఆఫీస్‌ ప్రయాణాలు, కాలేజీ వెళ్లే యువత, కుటుంబ అవసరాలు - ఇలాంటి కారణాలతో ఈ సెగ్మెంట్‌కు డిమాండ్‌ ఎప్పుడూ తగ్గదు. ఇలాంటి సమయంలో, సుజుకి, తన యాక్సెస్‌ 125 ని అప్‌డేట్‌ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరి ఈ కొత్త సుజుకి యాక్సెస్‌ 125 కి పోటీ ఇస్తోంది 'హోండా యాక్టివా 125'. వీటిని పోల్చి చూస్తే ఏది బెస్ట్‌?, ఇక్కడ తెలుసుకుందాం.

ఇంజిన్‌ & పనితీరు

సుజుకి యాక్సెస్‌ 125 లో 124cc, ఎయిర్‌ కూల్డ్‌, సింగిల్‌ సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 8.4 hp పవర్‌, 10.2 Nm టార్క్‌ ఇస్తుంది. నగర ట్రాఫిక్‌లో స్మూత్‌గా నడిపించుకోవడానికి ఇది సరిపోతుంది. 

హోండా యాక్టివా 125 లో 123.9cc, ఎయిర్‌ కూల్డ్‌, సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ ఉంటుంది. పవర్‌ 8.4 hp ఒకేలా ఉన్నా, టార్క్‌ 10.5 Nm వరకు ఉంటుంది. అంటే స్టార్ట్‌ సమయంలో యాక్టివా కాస్త మెరుగైన పికప్‌ ఇస్తుంది. కానీ రోజువారీ వాడకంలో ఈ రెండు స్కూటర్లు కూడా దాదాపు సమానంగా అనిపిస్తాయి.

ఫీచర్లు - ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్‌?

ఈ విషయంలోనే పోటీ ఆసక్తికరంగా మారుతుంది. యాక్సెస్‌ 125 లో 4.2 అంగుళాల TFT డిజిటల్‌ డిస్‌ప్లే ఉంటుంది. రైడ్‌ కనెక్ట్‌ టెక్నాలజీ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ అందిస్తుంది. ఫుల్‌ LED లైటింగ్‌, USB పోర్ట్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా, కొత్త వేరియంట్‌లో సింగిల్‌ ఛానల్‌ ABS ఇచ్చింది. 125cc స్కూటర్‌ సెగ్మెంట్‌లో ABS ఇచ్చిన మొదటి మోడల్‌గా ఇది నిలిచింది.

యాక్టివా 125 లో హోండా H-Smart కీ సిస్టమ్‌ ఉంటుంది. స్మార్ట్‌ అన్‌లాక్‌, స్మార్ట్‌ స్టార్ట్‌, స్మార్ట్‌ ఫైండ్‌ వంటి ఫీచర్లు అందిస్తుంది. అలాగే 4.2 అంగుళాల TFT డిస్‌ప్లే, హోండా రోడ్‌సింక్‌ యాప్‌ ద్వారా నావిగేషన్‌, కాల్‌, SMS అలర్ట్స్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఫుల్‌ LED లైటింగ్‌ కూడా ఇస్తుంది. అంటే టెక్నాలజీ పరంగానూ ఈ రెండు స్కూటర్లు కూడా ఇప్పుడు చాలా ఆధునికంగా మారాయి.

ధర - హైదరాబాద్‌, విజయవాడలో ఎంత?

ధర విషయంలో యాక్సెస్‌ 125 కొంచెం అందుబాటులో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్‌-షోరూమ్‌ ధర సుమారు రూ. 80,284 నుంచి ప్రారంభమవుతుంది. టాప్‌ Ride Connect TFT ABS వేరియంట్‌ ధర సుమారు రూ. 95,977(ఎక్స్‌-షోరూమ్‌) వరకు ఉంటుంది. హైదరాబాద్‌, విజయవాడలో ఆన్‌రోడ్‌ ధరలు RTO, ఇన్సూరెన్స్‌ ఆధారంగా మారుతాయి.

యాక్టివా 125 ధర సుమారు రూ. 92,791 నుంచి ప్రారంభమై రూ. 97,234 (ఎక్స్‌-షోరూమ్‌) వరకు ఉంటుంది. అంటే, బేస్‌ వేరియంట్ల ధరలో యాక్సెస్‌ 125 తో కాస్త డబ్బు మిగులుతుంది. కానీ టాప్‌ వేరియంట్‌ ధరలు చాలా దగ్గరగా ఉంటాయి.

ఏది ఎంచుకోవాలి?

మీరు తక్కువ ప్రారంభ ధర, ABS వంటి సేఫ్టీ ఫీచర్‌ కోరుకుంటే యాక్సెస్‌ 125 మంచి ఆప్షన్‌. బ్రాండ్‌ నమ్మకం, స్మార్ట్‌ కీ ఫీచర్లు, మెరుగైన రీసేల్‌ విలువ కోరుకుంటే యాక్టివా 125 కూడా బలమైన ఎంపికే. మొత్తానికి, ఈ రెండు స్కూటర్లు కూడా 125cc సెగ్మెంట్‌లో బలమైన పోటీదారులే, దేనినీ తక్కువ చేసి చెప్పలేం. మీ అభిరుచి, అవసరం, బడ్జెట్‌ను బట్టి సరైనది ఎంచుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.