Chinni Serial Today Episode మ్యాడీ, సత్యభామలు మధుని తీసుకురావడం గుర్తు చేసుకొని దేవా రగిలిపోతూ ఉంటాడు. నా శత్రువు ఇంతకాలం నా కళ్లుముందే ఉంటే గుర్తుపట్టలేకపోయాను.. తెలిసిన తర్వాత దాన్ని చంపలేకపోయాను.. నా స్థాయికి ఏ మాత్రం సరిపోని ఆ తిలక్‌ చేతిలో అన్ని కోట్లు పెట్టి.. చిన్నిని చంపించలేకపోయాను.. ఛా.. చిన్నిని నేనే కిడ్నాప్ చేశాను అని.. చిన్నిని నేను చంపాలి అనుకున్నా అని మ్యాడీకి తెలిసే అవకాశం ఉంది.. ఒకవేళ తిలక్ నేను చిన్నిని చంపమని చెప్పానని చెప్పినా.. పార్వతిని నేనే చంపానని తెలిసినా.. నా వ్యక్తిగత జీవితం నా రాజకీయం జీవితం రెండూ నాశనం అయిపోతాయి. అలా జరగకూడదు అంటే అక్కడ తిలక్‌ గాడి నోరు నొక్కేయాలి.. ఇక్కడ చిన్ని పీక నొక్కేయాలి అని అనుకుంటాడు.

నాయక్‌ని పిలిచి అర్జెంటుగా మధుని చంపేయ్ అని అంటాడు. ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది కదా సార్ ఇంట్లో మర్డర్ జరిగితే ప్రాబ్లమ్ ఉవుతుందని నాయక్ అంటే ఏం కాదు.. ప్రతిపక్షం మీద తోసేస్తా అని దేవా చెప్తాడు. దాంతో పాటు ఇంకేదో చెప్తాడు. మరోవైపు మధు తల్లితో మాట్లాడుతుంది. తిలక్‌ నిన్ను కిడ్నాప్ చేయడం వల్లే మ్యాడీకి నీ మీద ఉన్న ప్రేమ బయటకు వచ్చింది. మ్యాడీబాబులో మార్పు వచ్చి నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు సంతోషమే అని అంటుంది. నాకు సంతోషం లేదమ్మా.. మ్యాడీ లవ్ చేస్తుంది మధునే కదా.. చిన్నిని కాదు.. ఈ ప్రేమ అంతా చిన్నికే దక్కాలి.. మ్యాడీ చిన్నిగా కూడా ఇంతే ప్రేమించే రోజు వస్తేనే నేను సంతోషంగా ఉంటాను అని మధు అంటుంది. 

మధు, మ్యాడీలు తిరిగి బయల్దేరుతారు. మధు బాధ పడటం చూసి మధు మనసు మార్చాలి అని ఐస్‌క్రీమ్ బండి దగ్గర ఆపుతాడు. ఇద్దరూ ఐస్‌క్రీమ్‌లు తింటారు. ఇద్దరూ రొమాంటిక్‌గా ఒకర్ని ఒకరు చూసుకుంటూ మధుని మ్యాడీ పట్టుకొని కళ్లల్లోకి చూస్తూ ఉంటాడు. మరోవైపు నాగవల్లి తిలక్ మధుని కిడ్నాప్ చేయడం గురించి ఆలోచిస్తుంది. బాలరాజు ఎక్కడున్నాడో తెలుసుకొని చిన్నికి సాయం చేయాలి అనుకున్న వాడు చిన్నిని ఎందుకు కిడ్నాప్ చేస్తాడు. ఏంటి అంతా అయోమయంగా ఉంది.. ఏది ఏమైనా  మ్యాడీ మధుకి చాలా దగ్గరైపోతున్నాడు.. వాళ్లని దూరం చేయాలి అంటే మధునే చిన్ని అని మ్యాడీకి తెలియాలి.. తిలక్తోనే ఆ విషయం చెప్పించాలి అని అనుకుంటుంది. దేవా దగ్గరకు వెళ్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తిలక్‌ని కలుద్దాం అని అంటుంది. దేవా వద్దని చెప్పినా నాగవల్లి వినకుండా దేవాని పిలుస్తుంది. తిలక్ చెప్పే నిజాలు మనమే కాదు మ్యాడీ, మధులు కూడా వినాలి అని చెప్తుంది. దేవా షాక్ అయిపోతాడు. 

నాగవల్లి వెంటనే మ్యాడీకి కాల్ చేసి డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కి రమ్మని చెప్తుంది. అక్కడికి ఎందుకు అని మ్యాడీ అడిగితే ఆ తిలక్ మధుని ఎందుకు చంపాలి అనుకున్నాడో వాడి నోటి నుంచే విందామని అంటుంది. మధు మనసులో తిలక్ నాకు సాయం చేస్తాడు అని నేను బాలరాజు కూతుర్ని అని చెప్పేశాను.. ఇప్పుడు ఆయన పోలీస్ స్టేషన్లో ఆ నిజం బయట పెడతాడా అని మధు టెన్షన్ పడుతుంది. అందరూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తిలక్‌ని కలుస్తారు. నాగవల్లి తిలక్‌తో నువ్వేంటో నీ రేంజ్ ఏంటో నాకు తెలుసు.. నువ్వు రాజకీయంగా మా బావని దెబ్బతీయాలని చూస్తున్నావ్ అని మాకు తెలుసు అలాంటప్పుడు నువ్వు మా మ్యాడీని కానీ నన్ను కానీ కిడ్నాప్ చేయాలి కానీ మధుని ఎందుకు కిడ్నాప్ చేశావ్.. పోనీ మా ఫ్యామిలీని టెన్షన్ పెట్టాలి అనుకొని చేసుండొచ్చు.. మరి మధుని ఎందుకు చంపాలి అనుకున్నావ్.. మా మీద పగతో మధుని చంపాలి అనుకోలేదు.. వేరే కారణంతోనే మధుని చంపాలి అనుకున్నావ్.. చెప్పు ఎందుకు మధుని కిడ్నాప్ చేశావ్.. ఎందుకు మధుని చంపాలి అనుకున్నావ్ అని అడుగుతుంది. 

దేవా, మధు ఇద్దరూ చెప్పొద్దని తలూపుతారు. మధుని చూపిస్తా అని మ్యాడీని తీసుకొని బాలరాజు దగ్గరకు ఎందుకు తీసుకొచ్చావ్.. బాలరాజుకి నీకు మధుకి మాకు తెలియని ఏదైనా సంబంధం ఉందా అని అడుగుతుంది. లేదంటే బాలరాజుకి నీకు చిన్నికి మధ్య మాకు తెలియని ఏదైనా రిలేషన్ ఉందా..అలాంటప్పుడు నీకు చిన్ని ఎవరో తెలిసే ఉంటుంది కదా అని అడుగుతుంది. మధు చెప్పొద్దని అంటుంది. మధుని మ్యాడీ పెళ్లి చేసుకున్నందుకు మధుని చంపేయమని చిన్ని చెప్పుంటుంది.. అందుకే నువ్వు మా మధుని చంపాలని చూశావ్ అంతేనా అని అడుగుతుంది. దేవా కూడా కవర్ చేయడానికి మధుని ఎవరు చంపమని చెప్పారో చెప్పు అని అడుగుతాడు. ఎవరు ఎంత అడిగినా తిలక్ సైలెంట్‌గా ఉంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.