Challan on Steel Bumper Guard: ట్రాఫిక్‌లో తరచూ జరిగే చిన్న చిన్న ప్రమాదాలను నివారించడానికి కార్లకు చాలా మంది స్టీల్ బంపర్‌లు అమరుస్తూ ఉంటారు. ముందు నుంచి వెనుక నుంచి వచ్చి వాహనాలు తగిలినా కారుకు ఎక్కువ డ్యామేజీ లేకుండా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేస్తారు. కార్లను మరింత బలంగా సురక్షితంగా మార్చుకోవడానికి ఇలాంటి వాటిని అమరుస్తుంటారు. వీటిని సాధారణంగా బుల్ బార్స్ అని అంటారు. ఇవి మీ కారుని రక్షిస్తుందేమో కానీ మీ జేబుకు మాత్రం చిల్లు పెడుతుంది. ఈ అనుబంధ పరికరం ఇప్పుడు చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. భారత్‌లో రహదారి భద్రతను నిర్దారించడానికి ప్రభుత్వం ఇటువంటి గార్డులపై కఠినమైన నిబంధనలను విధించింది. ఎందుకంటే ఇవి పాదచారులకు ఇతర వాహనాలకు ప్రమాదకరంగా మారగలవు.
స్టీల్ బంపర్‌లను ఎందుకు నిషేధించారు?
స్టీల్ బంపర్ గార్డ్ దృఢంగా కనిపించినప్పటికీ ప్రమాదం జరిగినప్పుడు అది భారీ నష్టాన్ని మిగులుస్తుంది. ఒక వేళ కారు పాదచారిని ఢీకొంటే, అది తీవ్రమైన గాయానికి కారణం కావచ్చు. అంతేకాకుండా ఇది కారు ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్‌లు సకాలంలో తెరుచుకోవు. దీని వల్ల కారులోని ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. ఈ కారణంగానే ప్రభుత్వం దీనిని చట్టవిరుద్ధమని ప్రకటించింది.
జరిమానా ఎంత విధిస్తారు?
మీ కారు స్టీల్ బంపర్ గార్డ్ ఉన్నట్టు తేలితే, ట్రాఫిక్ పోలీసులు మీకు జరిమానా విధించవచ్చు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం, దీనికి సాధారణంగా వెయ్యి వరకు జరిమానా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా వాహనానికి ఇతర చట్టవిరుద్ధమైన మార్పులు చేసినట్టు అయితే జరిమానా ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. ఆ గార్డ్‌ను వెంటనే తొలగించమని కూడా పోలీసులు మిమ్మల్ని అడగవచ్చు.
ఏ మార్పులు చట్టవిరుద్ధమైనవి?
బంపర్ గార్డులు మాత్రేమే కాదు, కారుకు చేసే అనేక మార్పులు నిబంధనలకు విరుద్ధం. మితమీరిన శబ్దం చేసే హారన్, తప్పుడు నెంబర్ ప్లేట్, అనుమతిలేని లైట్లు, బాడీ మార్పులు వంటివి కూడా జరిమానాకు దారితీయవచ్చు. అందువల్ల ఏమైనా మార్పులు చేసే ముందు నిబంధనలు గురించి తెలుసుకోవాలి.
చలాన్ రాకుండా ఉండాలంటే ఏంచేయాలి.?
మీ కారు స్టీల్ బంపర్ గార్డు అమర్చి ఉంటే దానిని తీసివేయడం ఉత్తమం. ఇది మిమ్మల్ని జరిమానాల చి కాపాడటమే కాకుండా మీ రోడ్డు భద్రతను కూడా మెరుగుపరుస్తుంది. మీ కారు అసలు డిజైన్‌ను ఎల్లప్పుడూ అలాగే ఉంచడానికి ప్రయత్నించండి. ఇది వాహనాన్ని సురక్షితంగా ఉంచుతుంది. ఎలాంటి చట్టపరమైన చిక్కులు ఉండవు.
