Skoda Kylaq Review Telugu: భారత కాంపాక్ట్‌ SUV మార్కెట్‌ రోజురోజుకూ వేడెక్కుతోంది. ఈ సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్‌, మహీంద్రా XUV 3XO, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్‌, కియా సైరాస్‌, మారుతి సుజుకి బ్రెజ్జా వంటి బలమైన పోటీ కార్లు ఉన్నాయి. ఈ రేస్‌ మధ్యలో, చెక్‌ కార్‌ మేకర్‌ స్కోడా, తన కొత్త ఎంట్రీ మోడల్‌ కైలాక్‌ (Kylaq) ను నవంబర్‌ 2024లో లాంచ్‌ చేసింది. ఇప్పుడు ఇది స్కోడా ఇండియా లైనప్‌లోనే అత్యంత చవకైన SUV గా నిలిచింది. దీనిని ఎందుకు కొనాలి, ఏయే కారణాల వల్ల ఆలోచించాలి అనేది వివరంగా తెలుసుకుందాం.

కొనడానికి 3 కారణాలు

1. పోటీదారుల స్థాయిలోనే ధర

తెలుగు రాష్ట్రాల్లో, స్కోడా కైలాక్‌ ధరలు రూ. 8.25 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి మొదలవుతున్నాయి. ఈ సెగ్మెంట్‌లోని ఎక్కువ మోడళ్ల కన్నా ఈ రేటు కాస్త ఎక్కువగా ఉన్నా, బ్రెజ్జా కన్నా రూ. 44,000 తక్కువ, సైరోస్‌ కన్నా రూ.1.25 లక్షలు తక్కువగా ఉంది. అంటే బడ్జెట్‌ కాంపాక్ట్‌ SUV కొనాలనుకునే వారికి కైలాక్‌ మంచి డీల్‌ అవుతుంది.

2. బలమైన బాడీ, పూర్తి సేఫ్టీ ఫీచర్లు

స్కోడా ఎప్పటి లాగే బిల్డ్‌ క్వాలిటీలో రాజీ పడలేదు. బేస్‌ వేరియంట్‌ నుంచే 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌, ESC, ABS+EBD, ఓవర్‌స్పీడ్‌ అలర్ట్‌, రియర్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌, బ్రేక్‌ అసిస్ట్‌, ఎలక్ట్రానిక్‌ డిఫరెన్షియల్‌ లాక్‌ వంటి ఫీచర్లు ఇస్తుంది.హయ్యర్‌ వేరియంట్స్‌లో టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, హిల్‌-హోల్డ్‌ కంట్రోల్‌, రియర్‌ వ్యూ కెమెరా కూడా లభిస్తాయి. అంతేకాక, కైలాక్‌ 5-స్టార్‌ భారత్‌ NCAP సేఫ్టీ రేటింగ్‌ సాధించింది. సేఫ్టీకి ప్రాధాన్యం ఇచ్చే ఫ్యామిలీలకు ఇది పెద్ద ప్లస్‌ పాయింట్‌.

3. డ్రైవింగ్‌లో ఫన్‌ ఫ్యాక్టర్‌

స్కోడా కైలాక్‌ రోడ్‌పై నడిపినప్పుడు మీరు నిజంగా SUV డ్రైవ్‌ చేస్తున్న ఫీలింగ్‌ వస్తుంది. 189 mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఉన్నప్పటికీ, బాడీ రోల్‌ బాగా కంట్రోల్‌ చేస్తుంది. స్టిఫ్‌ చాసిస్‌, క్విక్‌ సస్పెన్షన్‌ సెటప్‌ కారణంగా కారు కార్నర్స్‌లోకి కూడా ఈజీగా వెళ్లిపోతుంది. కాంపాక్ట్‌ SUV సెగ్మెంట్‌లో డ్రైవింగ్‌ ఫన్‌ ఇచ్చే మోడల్స్‌లో ఇది ఒకటిగా నిలుస్తుంది.

వదిలేయడానికి 2 కారణాలు

1. లో-రేవ్స్‌లో టర్బో ల్యాగ్‌

కైలాక్‌లో ఇచ్చిన 1.0 లీటర్‌ 3-సిలిండర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ (115hp, 178Nm) మంచి పవర్‌ ఇస్తుంది. కానీ 2000rpm కంటే తక్కువ రేవ్స్‌లో టర్బో ల్యాగ్‌ స్పష్టంగా కనిపిస్తుంది. ట్రాఫిక్‌లో తరచుగా డౌన్‌షిఫ్ట్‌ చేయాల్సి రావచ్చు. ఇది డైలీ సిటీ డ్రైవింగ్‌లో కాస్త ఇబ్బంది కలిగించవచ్చు.

2. రిఫైన్‌మెంట్‌ లోపం

3-సిలిండర్‌ ఇంజిన్‌ కారణంగా కైలాక్‌ రిఫైన్‌మెంట్‌లో కొంత వెనుకబడుతుంది. ఐడిల్‌లో కంపనలు, ఇంజిన్‌ సౌండ్‌ కేబిన్‌లోకి రావడం స్పష్టంగా తెలుస్తుంది. సోనెట్‌, వెన్యూ లాంటి మోడళ్లలో లభించే 4-సిలిండర్‌ ఇంజిన్‌ ఆప్షన్‌ ఇక్కడ లేదు. కాబట్టి NVH లెవల్స్‌కి ప్రాధాన్యం ఇచ్చే వారికి ఇది ఒక మైనస్‌ పాయింట్‌.

ఫైనల్‌గా...

స్కోడా కైలాక్‌ ధర, సేఫ్టీ, డ్రైవింగ్‌ ఫన్‌ వంటి పాయింట్స్‌లో కాంపాక్ట్‌ SUV మార్కెట్‌లో బలంగా నిలబడుతుంది. అయితే టర్బో ల్యాగ్‌, రిఫైన్‌మెంట్‌ లోపం లాంటి చిన్న మైనస్‌లు ఉన్నాయి. మీరు సేఫ్టీకి, డ్రైవింగ్‌ థ్రిల్‌కి ప్రాధాన్యం ఇస్తే కైలాక్‌ బెస్ట్‌ ఛాయిస్‌ అవుతుంది. స్మూత్‌ రిఫైన్‌మెంట్‌, సిటీ ట్రాఫిక్‌లో ఈజీ డ్రైవ్‌ కావాలనుకుంటే ఇతర ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించాలి.