Skoda Kushaq Facelift Details Telugu: స్కోడా ఇండియా తమ తొలి మిడ్‌సైజ్‌ SUV అయిన కుషాక్‌కు దాదాపు ఐదేళ్ల తర్వాత భారీ ఫేస్‌లిఫ్ట్‌ను అందించింది. 2026 స్కోడా కుషాక్‌ ఫేస్‌లిఫ్ట్‌లో బాహ్య రూపం నుంచి ఇంటీరియర్‌, ఫీచర్లు, ఇంజిన్‌ గేర్‌బాక్స్‌ వరకు పలు కీలక మార్పులు కనిపిస్తున్నాయి. మరి ఈ కొత్త కుషాక్‌ పాత మోడల్‌తో పోలిస్తే ఎంత మారింది? అసలు తేడాలు ఏంటి? ఇప్పుడు వివరంగా చూద్దాం.

Continues below advertisement

ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌: ముందు భాగంలోనే ఎక్కువ మార్పులు

కొత్త కుషాక్‌ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రధాన మార్పులు ముందు భాగంలోనే కనిపిస్తాయి. పాత మోడల్‌తో పోలిస్తే ఇప్పుడు వెడల్పైన గ్రిల్‌, క్రోమ్‌ లైనింగ్‌తో కూడిన స్లాట్స్‌, సన్నని సర్రౌండ్స్‌ ఇచ్చారు. గ్రిల్‌ మధ్యలో లైట్‌ స్ట్రిప్‌ జోడించారు. ఇది కొత్త కోడియాక్‌ నుంచి ప్రేరణ పొందింది.

Continues below advertisement

LED హెడ్‌ల్యాంప్స్‌ ఇప్పుడు ఐబ్రో తరహా DRLs‌తో వస్తున్నాయి. పాత మోడల్‌లో ఉన్న L ఆకారపు సిగ్నేచర్‌ను పూర్తిగా తొలగించారు. ఫాగ్‌ ల్యాంప్స్‌ పరిమాణం తగ్గించి, కాస్త కిందికి మార్చారు. బంపర్‌ను కొత్తగా డిజైన్‌ చేసి, పెద్ద ఎయిర్‌డ్యామ్‌, రిడ్జ్డ్‌ స్కిడ్‌ ప్లేట్‌ ఇచ్చారు.

సైడ్‌ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు లేవు. కొత్త అలాయ్‌ వీల్‌ డిజైన్‌లు మాత్రమే కనిపిస్తాయి. అయితే వెనుక భాగంలో మాత్రం స్పష్టమైన తేడా ఉంది. పాత టెయిల్‌ ల్యాంప్స్‌ స్థానంలో ఇప్పుడు పూర్తి వెడల్పున LED లైట్‌ బార్‌, వెలిగే ‘SKODA’ లెటరింగ్‌, సీక్వెన్షియల్‌ ఇండికేటర్లు వచ్చాయి. రిఫ్లెక్టర్లను బంపర్‌లోకి మార్చి, అక్కడ కూడా అదనపు క్లాడింగ్‌, స్కిడ్‌ ప్లేట్‌ ఇచ్చారు.

కలర్‌ ఆప్షన్లలో కూడా మార్పు చేశారు. చెర్రీ రెడ్‌, శిమ్లా గ్రీన్‌, స్టీల్‌ గ్రే అనే మూడు కొత్త రంగులు చేరడంతో మొత్తం ఎనిమిది రంగుల్లో కుషాక్‌ లభిస్తోంది.

ఇంటీరియర్‌, ఫీచర్లు: లేఅవుట్‌ అదే, అనుభూతి కొత్తది

ఇంటీరియర్‌ లేఅవుట్‌ పరంగా పెద్ద మార్పులేమీ లేవు. కానీ కలర్‌ థీమ్‌లు మాత్రం కొత్తగా ఉన్నాయి. ప్రెస్టీజ్‌ వేరియంట్‌లో ఇప్పుడు బేజ్‌ అప్హోల్స్టరీ ఇచ్చారు. మాంటే కార్లో వేరియంట్‌లో బ్లాక్‌ - క్రిమ్సన్‌ కలర్‌ స్కీమ్‌ కనిపిస్తుంది. కొన్ని గ్లోస్‌ బ్లాక్‌ ట్రిమ్‌ పీసులను కూడా మార్చారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంటీరియర్‌ లేఅవుట్‌ మార్చకుండా కూడా స్కోడా బూట్‌ స్పేస్‌ను పెంచింది. కొత్త కుషాక్‌లో బూట్‌ సామర్థ్యం 491 లీటర్లు. ఇది పాత మోడల్‌ కంటే 106 లీటర్లు ఎక్కువ.

పానోరమిక్‌ సన్‌రూఫ్‌, కొత్త డిజిటల్‌ డిస్‌ప్లే

హయ్యర్‌ వేరియంట్లలో ఇప్పుడు పూర్తిగా కొత్త 10.25 ఇంచుల డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది పాత 8 ఇంచుల యూనిట్‌తో పోలిస్తే పెద్దదే కాకుండా, కొత్త గ్రాఫిక్స్‌తో వస్తుంది. ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌ కూడా కాస్త పెరిగి 10.1 ఇంచులైంది.

ముఖ్యమైన అప్‌గ్రేడ్‌ పానోరమిక్‌ సన్‌రూఫ్‌. పాత మోడల్‌లో సింగిల్‌ పేన్‌ సన్‌రూఫ్‌ మాత్రమే ఉండేది.

కొత్త ఫీచర్లు: సెగ్మెంట్‌లోనే తొలిసారి

కొత్త కుషాక్‌ ఫేస్‌లిఫ్ట్‌లో అతిపెద్ద హైలైట్‌ రియర్‌ సీట్‌ మసాజ్‌ ఫీచర్‌. ఇది ఈ సెగ్మెంట్‌లో తొలిసారి అందించారు. అంతేకాదు, ఫ్రంట్‌ పార్కింగ్‌ సెన్సర్లు, రైన్‌ సెన్సింగ్‌ వైపర్లు, డ్యూయల్‌ కలర్‌ అంబియంట్‌ లైటింగ్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌లో గూగుల్‌ జెమినీ ఇంటిగ్రేషన్‌ వంటి అదనపు సౌకర్యాలు వచ్చాయి.

ఇంజిన్‌, గేర్‌బాక్స్‌లో మార్పులు

ఇంజిన్‌ ఆప్షన్లలో మార్పు లేదు. 1.0 లీటర్‌ TSI (115 హెచ్‌పీ), 1.5 లీటర్‌ TSI (150 హెచ్‌పీ) ఇంజిన్‌లు కొనసాగుతున్నాయి. కానీ 1.0 TSIకి ఉన్న 6 స్పీడ్‌ ఆటోమేటిక్‌ను తొలగించి, కొత్త 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను ఇచ్చారు.

1.0 TSI మాన్యువల్‌ ఆప్షన్‌ కొనసాగుతుంది. 1.5 TSI మాత్రం 7 స్పీడ్‌ DSG ఆటోమేటిక్‌తోనే వస్తుంది. అలాగే, వినియోగదారుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని, 1.5 TSI వేరియంట్లకు ఇప్పుడు రియర్‌ డిస్క్‌ బ్రేకులు కూడా జోడించారు.

మొత్తంగా చూస్తే, 2026 స్కోడా కుషాక్‌ ఫేస్‌లిఫ్ట్‌ పాత మోడల్‌తో పోలిస్తే మరింత ఆధునికం, ఫీచర్లతో నిండిన SUVగా మారింది. లుక్‌, లగ్జరీ అనుభూతి, టెక్నాలజీ పరంగా ఇది స్పష్టమైన అప్‌గ్రేడ్‌ అని చెప్పొచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.