6 airbags in cars  : ఎనిమిది సీట్ల వరకు సామర్థ్యమున్న కార్లన్నింటికీ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి కేంద్రం ఇచ్చిన ఆదేశాలు కారు తయారీ దారులకు కొత్త టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే కార్ల తయారీ దారులు మాత్రం ఈ డెడ్ లైన్ అందుకోవడం కష్టమని అంటున్నారు. నిజానికి చిన్న కార్లకు రెండు ఎయిర్ బ్యాగ్‌లు ఉండాలనే నిబంధనను కేంద్రం పెట్టింది.  గత ఏడాది మార్చి నుంచే అమలు కావాల్సి ఉంది. కానీ, ఉత్పత్తిదారులు ఏడాదికి సరిపడా ముడిపదార్థాలను ముందే సమకూర్చుకోవడం.. డిమాండ్‌కు తగ్గట్లుగా ప్రాడక్టులు దొరికే అవకాశాలు తక్కువ కావడం వల్ల అమలు చేయలేకపోయారు. చాలా కాలం తర్వాత ఆ లక్ష్యాన్ని అందుకోగలిగారు. కానీ ఇప్పుడు ఏకంగా ఆరు బ్యాగ్‌లు అంటే... అదీ కూడా అక్టోబర్ నుంచే అంటే సాధ్యం కాదని చెబుతున్నాయి.  


కేంద్రం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 800 సీసీ అయినా.. అంతకు మించిన సామర్థ్యం ఉన్న కార్లయినా.. ఎం1 కేటగిరీ వాహనాలన్నింటికీ ఆరు ఎయిర్ బ్యాగ్‌ల నిబంధనల వర్తిస్తుంది. ఎనిమిది సీట్ల వరకు సామర్థ్యం ఉన్న కార్లన్నీ ఈ కెటగిరీ కిందకు వస్తాయి.  డ్రైవర్‌ సీటుకు స్టీరింగ్‌ పైభాగంలో, ముందు సీట్లో కూర్చొనే ప్యాసింజర్‌కు డ్యాష్‌బోర్డుకు అనుసంధానంగా ఎయిర్‌బ్యాగులు ఉంటాయి. కేంద్రం తీసుకు వచ్చిన  తాజా నిబంధనలో.. వెనక వరసల్లో కూర్చొనే వారికి సైడ్‌ కార్నర్‌ నుంచి, ముందు నుంచి కూడా నాలుగు ఎయిర్‌బ్యాగులను ఏర్పాటు చేయాలి. ప్యాసింజర్ల పక్క వైపు సైడ్‌ కర్టైన్‌ లేదా ట్యూబ్‌ తరహా ఎయిర్‌బ్యాగులను అమర్చాల్సి ఉంటుంది.


రోడ్డు ప్రమాదాల్లో.. కార్లలో ఎయిర్‌బ్యాగులు తెరుచుకుని, డ్రైవర్లు, ముందువరసలోని ప్యాసింజర్లు క్షేమంగా బయటపడ్డా.. వెనక సీట్లలో కూర్చొనేవారు చనిపోయిన ఉదంతాలున్నాయి. 
ఇప్పుడున్న రెండు ఎయిర్‌బ్యాగుల నిబంధనతో.. వాహనాల ముందు/వెనక భాగంలో ప్రమాదం జరిగితేనే సెన్సార్లు యాక్టివేట్‌ అయ్యి ఎయిర్‌బ్యాగులు తెరుచుకుంటాయి. పక్కవైపున ప్రమాదం జరిగితే.. సెన్సార్లు లేకపోవడం వల్ల ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడం లేదు. అందుకే.. సైడ్‌ కర్టైన్‌/ట్యూబ్‌ ఎయిర్‌బ్యాగులను కేంద్రం తప్పనిసరి చేస్తోంది.


కార్ల తయారీ కంపెనీలు ఓ వైపు ఎయిర్ బ్యాగ్‌ల ముడిపదార్థల సమస్యతో బాధపడుతున్నారు. మరో వైపు ధరలు కూడా భారీగా పెంచాల్సి రావొచ్చంటుంచున్నారు.  ఉత్పత్తిదారుడి వద్దే రూ. 30 వేల నుంచి రూ. 40 వేల దాకా ఖర్చవుతుందని తెలుస్తోంది. ఆ ఖర్చు వినియోగదారుడికి చేరేసరికి రూ. 50 వేల దాకా అవుతుందని ఆటోమొబైల్‌ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఈ నిబంధన కొన్నాళ్ల పాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే ఉద్దేశంలో ఆటోమోబైల్ కంపెనీలు ఉన్నట్లుగా తెలుస్తోంది.