Royal Enfield Achieves 1 Lakh Sales: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఈ బైక్‌లు ఇప్పటి వరకు భారత మార్కెట్‌లో అమ్మకాల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. గత నెల అంటే 2024 అక్టోబర్‌లో కంపెనీ చరిత్రలోనే మొదటిసారి లక్ష యూనిట్లను విక్రయించింది. ఇది చారిత్రాత్మక రికార్డు. ఇంతకు ముందెప్పుడూ రాయల్ ఎన్‌ఫీల్డ్ నెలలో ఇన్ని బైక్‌లు విక్రయించలేదు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ మనదేశంలో గత నెల మొత్తం 1,10,574 మోటార్ సైకిళ్లను విక్రయించింది. వీటిలో దేశీయ మార్కెట్ విక్రయాలు 1,01,886 యూనిట్లు కాగా, 8,688 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. ఈ విధంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ 2023 అక్టోబర్‌తో పోలిస్తే 31 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది అక్టోబర్‌లో 84,435 యూనిట్లు అమ్ముడయ్యాయి.
నవంబర్ 5న రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్...
బ్రిటీష్ వాహన తయారీదారులు ఇప్పుడు మరో కొత్త బైక్‌తో సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ ‘బేర్’ నవంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఈ బైక్‌ను ఇటలీలోని మిలాన్‌లో జరిగే EICMA మోటార్ షోలో ప్రదర్శించనున్నారు. కంపెనీ ఈ బైక్ ఫోటోను రివీల్ చేయడం ద్వారా దాని శైలి మరియు రూపాన్ని ఆవిష్కరించారు.
దీంతో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలో ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా లాంచ్ చేయనుందని తెలుస్తోంది. నవంబర్ 4వ తేదీన ఈ బైక్ భారతీయ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి.
Also Read: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!
రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650కి చాలా కాలంగా ప్రజల్లో క్రేజ్ ఉంది. రెండేళ్లుగా ఈ బైక్ లాంచ్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ బైక్ ఐదు కలర్ వేరియంట్‌లతో గ్లోబల్ మార్కెట్‌లోకి రాబోతోంది. ఈ బైక్ ఇంటర్‌సెప్టర్ 650 తరహాలోనే 650 సీసీ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ కొత్త మోటార్‌సైకిల్‌లో ఇంటర్‌సెప్టర్ 650 మాదిరిగానే ఇంజన్, ఛాసిస్ ఉండనుంది. అయితే సస్పెన్షన్, చక్రాలు భిన్నంగా ఉంటాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 ఫీచర్లు
రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650లో 648 సీసీ ఆయిల్, ఎయిర్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజన్‌ని అమర్చారు. ఈ ఇంజన్ 7,150 ఆర్పీఎం వద్ద 47 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 5,150 ఆర్పీఎం వద్ద 56.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లోని మోటార్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. బేర్ 650 స్క్రాంబ్లర్ లాగా విస్తృత హ్యాండిల్‌బార్‌ను కలిగి ఉంది. ఈ బైక్‌లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఉంది. ఇందులో యూఎస్‌బీ టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది.
Also Read: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్!