CM Chandrababu Visited Rushikonda Buildings: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన కొనసాగుతోంది. శనివారం అనకాపల్లి జిల్లా పర్యటన అనంతరం పరవాడ నుంచి నేరుగా రుషికొండకు చేరుకున్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh), భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి రుషికొండలో చేపట్టిన నిర్మాణాలను ఆయన పరిశీలించారు. కాగా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.500 కోట్లు ఖర్చు పెట్టి రుషికొండపై భవనాలను (7 బ్లాక్‌లు) నిర్మించారు. ప్రజాధనం ఖర్చు చేసి విలాసవంతమైన భవనాలను నిర్మించారంటూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఆరోపించారు. గత 4 నెలలుగా ఇక్కడి భవనాలు, ఉద్యానవనాల నిర్వహణ, విద్యుత్ వినియోగం కోసం పెద్దమొత్తంలో ఖర్చవుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. భవనాల నిర్వహణకే ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని.. దీనిపై ఓ నిర్ణయానికి రావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, పర్యావరణ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పటికే రుషికొండకు వచ్చి భవనాలను పరిశీలించారు. తాజాగా, సీఎం చంద్రబాబు సైతం ఇక్కడ భవనాలను పరిశీలించారు.






'ఆ భవనాలను ఏం చేద్దాం.?'


వైసీపీ హయాంలో రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాలపై ముందు నుంచి చంద్రబాబు, పవన్ కల్యాణ్ సహా కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రుషికొండను తొలిచేసి పరదాలతో రూ.కోట్లు ఖర్చు చేసి భవనాలు నిర్మించినట్లు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. వాటిని సద్వినియోగం చేసేలా చూస్తామని ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇదే విషయంపై గత అసెంబ్లీలోనూ ప్రస్తావించారు. మంత్రులు, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తాజాగా, రుషికొండపై పర్యటించిన ఆయన దీనిపై మళ్లీ ఆలోచన చేస్తున్నారు. నిర్వహణ పరంగా చూస్తే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో.. ఈ భవనాలను ఏం చేయాలి.?. ఏ విధంగా ఉపయోగించాలి.? అనే విషయాలపై చంద్రబాబు అధికారులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు పూర్తి సమాచారాన్ని సీఎంకు వివరిస్తున్నారు. ఏ మేరకు ఇక్కడ విద్యుత్ వినియోగం జరుగుతుందనే వివరాలను ఆ శాఖ అధికారులు సీఎంకు వివరించారు. ఈ భవనాలను భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగించాలనే అంశంపై ప్రజాభిప్రాయం తీసుకోవడంపైనా సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం.


రోడ్ రోలర్ నడిపిన సీఎం


అంతకుముందు అనకాపల్లి జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు రోడ్ రోలర్ నడిపారు. వెన్నెలపాలెంలో రహదారి గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. స్వయంగా రోడ్ రోలర్ నడిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.






Also Read: YS Sharmila: ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు