ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ కంపెనీ రీవోల్ట్ మోటార్స్ రూపొందించే ఎలక్ట్రిక్ బైక్స్‌కు మార్కెట్‌లో క్రేజ్ మామూలుగా లేదు. ఆర్‌వీ 400 మోడల్ అయితే చెప్పనక్కర్లేదు. దీని బుకింగ్స్ ఓపెన్ చేసిన క్షణాల్లోనే క్లోజ్ అయిపోతున్నాయంటే దీనికి ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. తాజాగా రీవోల్ట్ ఆర్‌వీ 400 (Revolt RV 400) ఎలక్ట్రిక్ బైక్ అమ్మకాల గురించి సంస్థ ఒక ప్రకటన చేసింది.
రీవోల్ట్ ఆర్‌వీ 400 బుకింగ్స్ ప్రారంభించిన క్షణాల్లోనే రికార్డు స్థాయిలో అమ్మకాలను సాధించిందని కంపెనీ ప్రకటించింది. దీంతో బుకింగ్ నిలిపివేసినట్లు తెలిపింది. రీవోల్ట్ ఆర్‌వీ 400 బైక్‌కు జూన్ నెలలో బుకింగ్స్ పెట్టినప్పుడు రెండు గంటల్లోనే బైక్‌లన్నీ బుక్ అయిపోయాయి. అప్పుడు రూ.50 కోట్ల విలువైన బైక్‌లకు బుకింగ్స్ వచ్చాయని కంపెనీ పేర్కొంది. ఇక తాజాగా మరోసారి బుకింగ్‌లను ప్రారంభించగా.. నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్‌గా నిలిచిందని వెల్లడించింది.
ప్రస్తుతం తమ బైక్స్ వెయిటింగ్ పీరియడ్ నాలుగు నెలలుగా ఉందని పేర్కొంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని రీవోల్ట్ తెలిపింది. కాగా, ఈ బైక్‌ను హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పుణె, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లో బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కంపెనీ కల్పించింది.
ఫీచర్లు ఏంటి?
రీవోల్ట్ ఆర్‌వీ 400 బైక్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 150 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవడానికి 4.5 గంటల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లుగా ఉంది. బ్యాటరీ కెపాసిటీ 72 వాట్స్, 3.24 కేడబ్ల్యూహెచ్ (KWh) గా ఉంది. మోటార్ పవర్ 3000 వాట్లుగా ఉంటుంది.
మిగతా బైక్‌లతో పోలిస్తే ఇది లెయిట్ వెయిట్‌గా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే రిమూవబుల్ బ్యాటరీతో ఈజీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీనిలో ఇకో, నార్మల్, స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవసరానికి తగినట్లు మోడ్ మార్చుకోవచ్చు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ బైక్స్ కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ రూపొందించారు. దీని ద్వారా సాంకేతిక సమస్యలను తెలుసుకోవచ్చు.
ఎందుకంత క్రేజ్..
దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఇటీవల ప్రకటించిన సబ్సిడీలతో రివోల్ట్ ఆర్‌వీ 400 బైక్ ధరలు భారీగా తగ్గాయి.
రీవోల్ట్ ఆర్‌వీ 400 ఎక్స్ షోరూమ్ ధర రూ.1,03,999 కాగా (ప్రాంతాన్ని బట్టి ధర మారుతుంది) సబ్సిడీ తర్వాత దీని ధర రూ.90,799కి తగ్గింది. దీంతో ఈ బైక్‌కు డిమాండ్ పెరిగింది. రివోల్ట్ ఆర్‌వీ 400 మోడల్‌కు ఎనిమిది సంవత్సరాల వారెంటీ ఉంది. బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ఉండటం వంటివన్నీ దీనిపై క్రేజ్ పెరగడానికి కారణాలుగా చెప్పవచ్చు.
అయితే ఇటీవలి కాలంలో ఆర్‌వీ 400 మోడల్ బైక్స్‌పై నెగిటివ్ రివ్యూలు కూడా వినిపిస్తున్నాయి. దీని గరిష్ట వేగం 150 కి.మీ అని చెప్పినా 90 కి.మీ వేగాన్ని మించి వెళ్లడం లేదని పలువురు వినియోగదారులు అంటున్నారు. బైక్‌ను ఛార్జ్ చేసేందుకు 5 గంటలకు పైగా సమయం పడుతుందని ఆరోపిస్తున్నారు.