Renault Kwid new price 2026: కొత్త ఏడాది 2026 ప్రారంభం నుంచే కారు కొనుగోలుదారులకు రెనాల్ట్ ఇండియా షాక్ ఇవ్వనుంది. 2026 జనవరి నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ఈ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ధరల పెంపు గరిష్ఠంగా 2 శాతం వరకు ఉండనుందని రెనాల్ట్ స్పష్టం చేసింది. అయితే ఈ పెంపు అన్ని మోడళ్లకు, అన్ని వేరియంట్లకు ఒకేలా ఉండదని కూడా తెలిపింది.
ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదలతో పాటు ప్రస్తుత మాక్రో ఎకనామిక్ పరిస్థితులే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా రెనాల్ట్ పేర్కొంది. ముడి పదార్థాల ధరలు, లాజిస్టిక్స్ ఖర్చులు, తయారీ వ్యయాలు పెరగడం వల్ల రేట్ల రివిజన్ తప్పనిసరి అయిందని అధికారిక ప్రకటనలో వివరించింది.
ప్రస్తుతం భారత మార్కెట్లో రెనాల్ట్ లైనప్
ప్రస్తుతం రెనాల్ట్ ఇండియా మూడు మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. అవి Kwid, Triber, Kiger. వీటిలో ఎంట్రీ లెవల్ కారుగా Kwid కొనసాగుతోంది. ప్రస్తుతం Kwid ఎక్స్-షోరూమ్ ధర ₹4.29 లక్షల నుంచి ₹5.99 లక్షల వరకు ఉంది. ధరల పెంపు తర్వాత కూడా Kwid రెనాల్ట్ పోర్ట్‌ఫోలియోలో అత్యంత అందుబాటు ధర కారు గానే కొనసాగనుంది.
Triber విషయానికి వస్తే, ఇది ఒక కాంపాక్ట్ MPVగా మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం దీని ఎక్స్-షోరూమ్ ధర ₹5.76 లక్షల నుంచి ₹8.59 లక్షల వరకు ఉంది. కుటుంబ వినియోగానికి సరిపోయే స్పేస్, ఫ్లెక్సిబుల్ సీటింగ్ వల్ల Triberకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది.
రెనాల్ట్ ఇండియా లైనప్‌లో టాప్ మోడల్‌గా Kiger కాంపాక్ట్ SUV నిలుస్తోంది. దీని ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర ₹5.76 లక్షల నుంచి ₹10.33 లక్షల వరకు ఉంది. SUV తరహాలో ఉండే డిజైన్, టర్బో పెట్రోల్ ఆప్షన్‌లతో Kiger యువ కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది.
ధరల పెంపు ఎలా ఉండబోతోంది?
రెనాల్ట్ తెలిపిన ప్రకారం, ధరల పెంపు అన్ని మోడళ్లలో ఒకేలా ఉండదు. వేరియంట్, మోడల్‌ను బట్టి పెంపు శాతం మారుతుంది. కొత్త ధరల వివరాలను అతి త్వరలో ప్రకటించనున్నారు. అంటే, ఇప్పుడు కొనుగోలు చేసేవారికి ఇంకా కొంత సమయం ఉంది, పాత రేట్లతోనే కారు బుక్ చేసుకోవచ్చు.
GST తర్వాత తగ్గిన ధరలకు చెక్
ఇటీవల కొత్త GST మార్పుల నేపథ్యంలో రెనాల్ట్ కొన్ని మోడళ్లపై ఎక్స్-షోరూమ్ ధరలను తగ్గించింది. కస్టమర్ దృష్టితో చూస్తే, GST వల్ల వచ్చే ప్రయోజనం ఇప్పుడు ప్రకటించిన ధరల పెంపు కారణంగా కొంతవరకు తగ్గుతుంది. అంటే కస్టమర్‌కు అప్పట్లో వచ్చిన రిలీఫ్, ఇప్పుడు కొంత మేర తగ్గినట్లే అవుతుంది.
జనవరి 2026లో కొత్త రెనాల్ట్ డస్టర్
ధరల పెంపుతో పాటు మరో కీలక విషయం కూడా ఉంది. రెనాల్ట్ ఇండియా, జనవరి 2026లో కొత్త తరం డస్టర్ SUVని భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు అధికారికంగా నిర్ధారించింది. ఇప్పటికే కంపెనీ మొదటి టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో వెనుక భాగం డిజైన్‌కు సంబంధించిన ఒక చిన్న లుక్ మాత్రమే చూపించారు.
అంతర్జాతీయ మార్కెట్లలో, ముఖ్యంగా యూరప్‌లో, ఈ మోడల్ ఇప్పటికే Dacia Duster పేరుతో అమ్మకాల్లో ఉంది. భారత మార్కెట్‌కు వచ్చే డస్టర్‌పై మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
2026లో రెనాల్ట్ కార్ కొనాలనుకునే వారు ధరల పెంపును దృష్టిలో పెట్టుకుని ఈ రోజే ప్లాన్ చేసుకోవడం మంచిది. అలాగే, కొత్త డస్టర్ కోసం ఎదురుచూసే వారికి వచ్చే ఏడాది ప్రారంభం ఆసక్తికరంగా ఉండబోతోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.