ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ.. తన ఎలక్ట్రిక్ కారు నిర్మాణ పనులను మళ్లీ మొదలు పెట్టింది. ‘ప్రాజెక్ట్ టైటాన్’ ను ట్రాక్ మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది చివరి వరకు ఈ ప్రాజెక్టు సంబంధించి టీమ్ ను రెడీ చేయబోతున్నది. అధికారికంగా ఆపిల్ కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించకపోయినా.. మైక్రో బ్లాగింగ్ సైట్ లో టెక్ విశ్లేషకుడు మింగ్-చి కువో ఈ ప్రాజెక్టు సంబంధించిన తాజా వివరాలను వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో నిలిచిపోయిన ప్రాజెక్ట్ టైటాన్ పనులను వేగవంతం చేయడానికి ఆపిల్ కొత్త టీమ్ ను రెడీ చేయబోతుందని వివరించారు. ఆపిల్ కంపెనీ.. తన ఎలక్ట్రిక్ కారు ప్రాజెక్టు పనులు చాలా వరకు ముందడుగు వేసినట్లు తెలుస్తున్నది. కానీ, దాని తాజా పరిస్థితి ఏంటనేది మాత్రం వెల్లడించడం లేదని ArenaEV వెల్లడించింది.
ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ విశ్లేషకులు ఆపిల్ కంపెనీ కారుకు సంబంధించి పలు విషయాలను వెల్లడిస్తున్నారు. తొలుత సాధారణ కారుగా ప్రారంభమైనా.. ఇప్పుడు పూర్తి అటానమస్ కారుగా తయారవుతున్నట్లు తెలుస్తున్నది. డ్రైవర్ నుంచి ఎలాంటి ఇన్ ఫుట్స్ అవసరం లేకుండా ఈ కారు నడవనున్నట్లు సమాచారం.
వాస్తవానికి ఆపిల్ ప్రాజెక్ట్ టైటాన్ కు 2014లో పునాదులు పడ్డాయి. ఈ ప్రాజెక్టుపై పని చేసేందుకు సిక్స్టీ ఎయిట్ రీసెర్చ్ అనే షెల్ కంపెనీ అని ను ఏర్పాటు చేసింది. అయితే కొంత కాలం ప్రాజెక్టుకు సంబంధించిన పనులు యాక్టివ్ గా కొనసాగినా.. ఆయా కారణాల మూలంగా పూర్తిగా ట్రాక్ తప్పింది. ప్రాజెక్ట్ అనేక మార్పులు, టీమ్స్ మారడం, ప్రాజెక్ట్ డైరెక్టన్ ఛేంజ్ కావడం, నిర్వహణలో పలు మార్పులు రావడం మూలంగా పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు ఆపిల్ టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ బాబ్ మాన్స్ ఫీల్డ్ చీఫ్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు పూర్తిగా తగ్గుముఖం పట్టడం, ప్రపంచంలో పరిస్థితులు కుదుటపడటంతో ఆపిల్ ప్రాజెక్ట్ టైటాన్ ను తిరిగి పట్టాలెక్కించే పనిలో పడింది. వీలైనంత త్వరలో ఎలక్ట్రిక్ కారు ప్రాజెక్టు మరింత పురోగతి సాధించే అవకాశం ఉంది. మరి, ఆపిల్ ఈ రంగంలో కూడా దూసుకెళ్తుందో లేదో చూడాలి. అయితే, భవిష్యత్తు ఎలక్ట్రిక్ కార్లదే కావడంతో ఆపిల్ కార్ల రాక కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ, అవి సంపన్నులకు మాత్రమే సుమీ.
Also Read: హారన్ కొడితే రూ.15 వేలు జరిమానా, జైల్లో చిప్పకూడు తప్పదు - ఎక్కడో తెలుసా?
Also Read: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?