Premium petrol ethanol blending: ప్రీమియం పెట్రోల్ వాడే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త చెప్పింది. మార్కెట్లో లభిస్తున్న ప్రీమియం గ్రేడ్ పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న E20 విధానానికి మించి పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని పెంచే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. దీంతో ప్రీమియం ఇంధనాన్ని వినియోగించే కార్లు & బైక్‌ల యజమానుల్లో నెలకొన్న సందేహాలకు తెరపడింది.

Continues below advertisement

లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానంగా, కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు శాఖ మంత్రి సురేశ్ గోపి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు విక్రయిస్తున్న ప్రీమియం పెట్రోల్ గ్రేడ్లు పూర్తిగా ఇథనాల్ రహితంగానే వినియోగదారులకు అందుతున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న ప్రీమియం పెట్రోల్‌లో ఎలాంటి ఇథనాల్ మిశ్రమం ఉండదని స్పష్టంచేశారు.

దేశంలోని మూడు ప్రధాన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తమ తమ ప్రీమియం ఇంధన బ్రాండ్లను విక్రయిస్తున్నాయి. అందులో IOC విక్రయించే XP100, HPCL అందించే Power100 & BPCL మార్కెట్లో విక్రయించే Speed100 పెట్రోలు పూర్తిగా ఇథనాల్ లేకుండానే సరఫరా అవుతున్నాయని కేంద్రం వెల్లడించింది. అధిక ఆక్టేన్ విలువ కలిగిన ఈ ఇంధనాలను ప్రధానంగా హై పెర్ఫార్మెన్స్ కార్లు, సూపర్‌బైక్‌లు & ప్రీమియం వాహనాల కోసం రూపొందించారు.

Continues below advertisement

అయితే దేశంలో ఈ ప్రీమియం పెట్రోలు వినియోగం చాలా పరిమితంగానే ఉందని ప్రభుత్వం తెలిపింది. మొత్తం పెట్రోల్ విక్రయాల్లో ఈ ప్రీమియం గ్రేడ్‌ల వాటా కేవలం 0.5 శాతం మాత్రమేనని వివరించింది. అంటే ఎక్కువ మంది వాహనదారులు సాధారణ E20 పెట్రోల్‌ను వినియోగిస్తుండగా, అతి కొద్ది మంది మాత్రమే ఈ ప్రీమియం ఇంధనాన్ని ఎంచుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: ప్రభుత్వ సబ్సిడీ ఉన్నప్పటికీ, EVల ధర ఎందుకు పెరుగుతోంది

E20ని మించిన ఇంధనంపై క్లారిటీఇటీవల E20 పెట్రోల్ అమలు తర్వాత చాలామందిలో మరో సందేహం కూడా నెలకొంది. భవిష్యత్తులో పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని 20 శాతం కంటే ఎక్కువగా పెంచుతారా? అనే ప్రశ్నకు కూడా కేంద్రం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం E20కు మించి ఇథనాల్ బ్లెండింగ్ అమలు చేయాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదని తెలిపింది. దీంతో సమీప భవిష్యత్తులో E25 లేదా అంతకంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమం కలిగిన పెట్రోల్ వచ్చే అవకాశాలపై ఉన్న ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడినట్లైంది.

మరోవైపు, గతంలో అందుబాటులో ఉన్న E0 లేదా E10 పెట్రోల్‌ను తిరిగి మార్కెట్లో ప్రవేశపెట్టే ప్రతిపాదన కూడా లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ప్రస్తుతం అమల్లో ఉన్న E20 విధానమే కొనసాగుతుందని కేంద్రం సంకేతాలు ఇచ్చింది.

ధరల విషయానికి వస్తే, E20 పెట్రోల్ లీటర్ ధర ప్రస్తుతం రూ.102.12గా ఉండగా, ప్రీమియం గ్రేడ్ పెట్రోల్ ధర లీటర్‌కు సుమారు రూ.160గా ఉంది. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ప్రీమియం పెట్రోల్ ధర గణనీయంగా ఎక్కువే అయినప్పటికీ, అధిక పనితీరు అవసరమైన ఇంజిన్ల కోసం చాలామంది వాహనదారులు దీనినే ఎంచుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Turbo Brezza కొనాలా? NA Brezza తీసుకోవాలా? - డిజైన్‌, ఫీచర్లు, ఇంజిన్‌లో తేడాలు ఏంటి?

ఇథనాల్ రహిత ప్రీమియం పెట్రోల్ కొనసాగుతుండటం హై పెర్ఫార్మెన్స్ వాహనాల యజమానులకు సానుకూల పరిణామంగా చెప్పవచ్చు. అదే సమయంలో E20 విధానాన్ని కొనసాగిస్తూ, ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం & ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోంది. తాజా ప్రకటనతో ప్రీమియం పెట్రోల్ వినియోగదారులు, ఆటోమొబైల్ రంగం & వాహన యజమానులకు ఉన్న కీలక సందేహాలకు ప్రభుత్వం ఒకేసారి స్పష్టత ఇచ్చినట్లైంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.